భారతావనికే ఆదర్శ గ్రామంగా వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి నిలుస్తోంది. ఇప్పటికే జాతీయ నిర్మల్ అవార్డుతో సహా, కేరళ ప్రభుత్వం ఇచ్చే జాతీయ అవార్డు, రాజీవ్ గాంధీ అత్యుత్తమ గ్రామ పంచాయతీ అవార్డులను ఈ గ్రామం కైవసం చేసుకుంది. ఇలా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న గంగదేవిపల్లిలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటనే విషయాన్ని పరిశీలిస్తే.. అందరికీ ఆశ్చర్యం కలుగక మానదు.
ప్రత్యేక గ్రామ పంచాయతీగా అవతరించిన తర్వాత అంటే 25 సంవత్సరాలుగా ఈ గ్రామం అన్నింటిలో స్వయం సమృద్ధిని సాధిస్తోంది. అనగా నూటికి నూరు శాతం వృద్ధిని సాధిస్తోంది. మెరుగైన వైద్య సేవలు, టీకాలు, సంపూర్ణ మద్య నిషేధం, కుటుంబ నియంత్రణ, ఉచిత డిష్ టీవీ ప్రసారాలు, ఇంటింటికీ మరుగుదొడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా ఇలా ఒకటేంటి గ్రామ ప్రజలకు కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని వారే స్వయంగా సమకూర్చుకుంటున్నారు.
ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ గ్రామాన్ని సందర్శించేందుకు మన రాష్ట్ర ప్రజాప్రతినిధులే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, విదేశీ ప్రతినిధులు సైతం వస్తున్నారు. వీరి రాకతో ఆ గ్రామ ప్రజలు ఉబ్బితబ్బిబ్బులై పోతున్నారు. ప్రపంచమే తమ వైపు చూస్తుంటే.. రాష్ట్ర సర్కారు మాత్రం కన్నెత్తి చూడటం లేదని వారు ఆరోపిస్తున్నారు.