దంతములను, నోటిని శుభ్రపరచుకునేటప్పుడు తూర్పు, ఉత్తరాభిముఖంగా నుంచుని గానీ, కూర్చుని గానీ చేయాలి. దంతములను శుభ్రం చేయడానికి మఱ్ఱి, చండ్ర, కానుగ, మద్ది, వేప మొదలగు పచ్చిపుల్లలను ఉపయోగించవచ్చు. దీనిని బాగా నమిలి.. కుచ్చు వచ్చు నట్లుగా చేసి, ఆకుచ్చుతో దంతాలను రుద్దుతూ శుభ్రపరచుకోవాలి. చిగుళ్ళకు నొప్పికలగకుండా శుభ్రపరచాలి. శాస్త్రోక్తమైన పండ్లపొడిని కూడా ఉపయోగించి రుద్దుకోవచ్చును.
దంతములు శుభ్రమునకు.. తీపి కలవాటిలో ఇప్పపుల్ల, కారం గల వాటిలో.. కానుగపుల్ల, చేదుగల వాటిలో వేపపుల్ల, వగరు గల వాటిలో.. చండ్రపుల్ల చాలా శ్రేష్టమైనవి. వీటి బద్దలతో నాలుక గీచుకుని శుభ్రపరచాలి. నోటి శుభ్రతకు.. వేడినీటిని ఉపయోగించాలి. చాలాసార్లు పుక్కిలిపట్టి వదులుతూ నోటిని శుభ్రపరచుకోవాలి. దీనివలన నోటియందు పాచి, సూక్ష్మక్రిములు నశించి వ్యాధులు రాకుండా అరికడుతుంది.
కంఠంలోగానీ, పెదవులు, నాలుక, దంతములలో వ్యాధులు కలిగినప్పుడు, నోటియందు పుండు ఏర్పడినపుడు.. పైన పేర్కొన్న పుల్లలతో నోటిని శుభ్రం చేయకూడదు. నేత్రవ్యాధులు, హృద్రోగం కలవారు కూడా వ్యాధి నయమయేవరకూ వీటితో దంత శుభ్రత చేయకూడదు. ఇలాంటి వ్యాధులు గలవారు వెండి, రాగి లేక తాటాకుతో నాలుక మీద పాచిని తొలగించి శుభ్రం చేసుకోవాలి.