భారతదేశంలో 15 నెలల్లో 3 బ్యాంకులు పతనం.. మీ బ్యాంకు ఆర్థిక పరిస్థితి ఏమిటి?

గురువారం, 10 డిశెంబరు 2020 (13:39 IST)
అప్పులు కొండలా పేరుకుపోవడంతో గత 15 నెలల్లో భారత్‌లోని మూడు ప్రధాన బ్యాంకులు దివాలా తీశాయి. దీంతో దేశంలోని బ్యాంకుల ఆర్థిక స్థితిగతులపై అనేక మంది నిపుణుల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భారతీయ బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై ‘బీబీసీ’ ప్రతినిధి ఆకృతి థాపర్ అందిస్తున్న కథనం..

 
అసలే లాక్‌‌డౌన్... ఆపై బ్యాంకు దివాలా
‘‘కోవిడ్-19 కారణంగా మా వ్యాపారం తొలుత దెబ్బతింది. ఆ సమయంలో రెండు నెలల పాటు మాకు ఆదాయం లేదు. మా బ్యాంకు ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో ఈ మధ్య వరకు మా పొదుపు ఖాతాలను ఉపయోగించుకోలేకపోయాం, రోజువారీ లావాదేవీలనూ నిర్వహించలేకపోయాం. మా సిబ్బందికి జీతాలు ఎలా ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది’’ అని 50 ఏళ్ల మంగీలాల్ పరిహార్ అనే డిపాజిటర్ చెప్పారు.

 
ఆయనకు లక్ష్మీవిలాస్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. మంగీలాల్‌కు ముంబయి సబర్బన్ ప్రాంతంలో ఒక చిన్నపాటి దుకాణం ఉంది. సాధారణంగా భారతీయులు బ్యాంకును ఎంచుకోవడానికి రెండు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తారు కొందరు.. మరికొందరు తమ రోజువారీ లావాదేవీలు సులభంగా సాగేందుకు వీలుగా తమ ఇల్లు లేదా వ్యాపార ప్రదేశానికి సమీపంలోని బ్యాంకును ఎంచుకుంటారు.

 
పరిహార్ కూడా అదే రీతిలో లక్ష్మీవిలాస్ బ్యాంకును ఎంచుకున్నారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌‌బీఐ) గత నెలలో లక్ష్మీవిలాస్ బ్యాంకులోని డిపాజిట్లను ఖాతాదారులు వినియోగించుకోవడానికి వీలు లేకుండా తాత్కాలిక పరిమితులు విధించింది. 94 ఏళ్ల చరిత్ర ఉన్న లక్ష్మీవిలాస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో డిపాజిటర్లు నెలకు రూ. 25 వేలకు మించి నగదు విత్ డ్రా చేయకుండా ఆంక్షలు విధించింది.

 
ఎనిమిదేళ్ల కిందటా డబ్బులు ఇరుక్కుపోయాయి
తన డబ్బు ఇలా ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదని.. ఎనిమిదేళ్ల కింద స్థానిక సహకార బ్యాంకు ఒకటి ఇలాగే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో రెండేళ్ల పాటు తన ఖాతాలోని డబ్బులు తీయడానికి వీలుపడలేదని పరిహార్ చెప్పారు.

 
గత 15 నెలల కాలంలో ఇలా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన బ్యాంకుల్లో లక్ష్మీ విలాస్ బ్యాంకు మూడోది. 2019 సెప్టెంబరులో పంజాబ్, మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్(పీఎంసీ) ఇలాగే దివాలా పరిస్థితుల్లో చిక్కుకుంది. ఆ బ్యాంకులో అక్రమంగా ఇచ్చిన సుమారు రూ. 44 వేల కోట్ల రుణాల వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది. ఇక ఈ ఏడాది మార్చిలో అప్పటికి దేశంలోని అయిదో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా ఉన్న యెస్ బ్యాంకుపైనా ఆంక్షలు విధించారు.

 
అప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన యెస్ బ్యాంకు వాటిని తీర్చడానికి నిధులు సమీకరించుకోవడంలో విఫలం కావడంతో ఆర్బీఐ చర్యలు తీసుకుంది. లక్ష్మీవిలాస్ బ్యాంకు, యెస్ బ్యాంకులను గట్టెక్కించడంతో ఆర్బీఐ త్వరితగతిన చర్యలు తీసుకుంది. సింగపూర్‌కు చెందిన అతిపెద్ద బ్యాంకు డీబీఎస్‌లో లక్ష్మీవిలాస్ బ్యాంకు విలీనమైంది. దీంతో డీబీఎస్ నుంచి లక్ష్మీవిలాస్ బ్యాంకులోకి నిధులు సమకూరాయి.

 
ఆ బ్యాంకు ఖాతాదారుల కష్టాలు తీరలేదు
కానీ, పంజాబ్, మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు(పీఎంసీ) ఖాతాదారుల కష్టాలు మాత్రం ఇంకా తీరలేదు. అలాంటివారిలో 53 ఏళ్ల విద్యా మేర్వాడ్ ఒకరు. హోం ట్యూటర్‌గా పనిచేసే ఆమె పీఎంసీ పతనమై 14 నెలలైనా తన కష్టాల నుంచి ఇంకా బయటపడలేదు. వృద్ధురాలైన తన తల్లి దగ్గరున్న డబ్బుతో జీవనం సాగిస్తున్నట్లు మేర్వాడ్ తెలిపారు.
 
ఆటోల మరమ్మతులు చేసే తన భర్త సంపాదన, హోం ట్యూటర్‌గా తన సంపాదన నుంచి దాచుకున్న పొదుపు డబ్బంతా పీఎంసీలో దాచుకున్నట్లు ఆమె చెప్పారు. పీఎంసీ పతనంతో కొడుకు పెళ్లి, కూతురు జర్మనీ చదువు కోసం వేసుకున్న ప్రణాళికలన్నీ ఆగిపోయాయని ఆమె తెలిపారు.‘‘జీవితాంతం కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బంతా ఒక్క దెబ్బకు పోయింది.

 
ఇప్పుడు మేమెలా బతకాలి?’’పీఎంసీ నుంచి డిపాజిట్ల ఉపసంహరణ పరిమితిని ఆర్‌బీఐ క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. కానీ, తమ డిపాజిట్లతో పోల్చితే ఆ పరిమితి చాలా తక్కువగా ఉందని విద్య అన్నారు. అయితే, ఈ బ్యాంకులన్నీ ఇలా దివాలా తీయడానికి కారణాలేమిటి?కొన్నేళ్లుగా భారతీయ బ్యాంకులు కార్పొరేట్ రుణ బకాయిల కారణంగా తీవ్ర అవస్థలకు గురవుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలను బ్యాంకులు వదిలేసుకోవాల్సి వచ్చింది.

 
ఈ పరిస్థితిని ఆర్థికవేత్తలు ‘‘లెగసీ బ్యాడ్ డెట్ ప్రాబ్లమ్’’ అని పిలుస్తారు. వ్యాపారాలకు ఉదారంగా రుణాలు ఇవ్వడం వల్లా భారతీయ బ్యాంకులు అప్పుల్లో కూరుకుపోయాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ దీనిపై మాట్లాడుతూ బ్యాంకర్ల అత్యాశ, అత్యుత్సాహమే ఈ మొండి బకాయిలకు కారణమన్నారు.

 
‘బ్యాంకుకు బదులు ఇంట్లోనే డబ్బు దాచుకోవాల్సింది’
‘‘బ్యాంకుల పతనాన్ని ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి కోణంలో చూడాలి. భారత్‌లో ప్రస్తుత ఆర్థిక మందగమనం (కోవిడ్-19 దీనికి ఆజ్యం పోసింది) కూడా మొండి బకాయిలు మరింత పేరుకుపోవడానికి కారణమైంది’’ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ ఎకనమిస్ట్ బృందా జాగీర్దార్ అన్నారు. కార్పొరేట్ వ్యవహారాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, బ్యాంకు అంతర్గత బోర్డుల చూసీచూడనట్లుండే తీరు కూడా రుణాలు వసూలు కాకపోవడానికి కారణం కావొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

 
ప్రతి స్థాయిలో జవాబుదారీతనం ఉంటే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని అన్నారు.ఇలాంటి కొన్ని ఇబ్బందులు తప్పితే భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ దృఢంగానే ఉందని బృంద అన్నారు. 2016లో దివాలా చట్టాన్ని భారత్ అమల్లోకి తీసుకొచ్చింది కానీ అది డిపాజిటర్ల భయాలను ఏమాత్రం పోగొట్టలేకపోయింది. జలజ మెహతా అనే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ తాను డిపాజిట్లు చేసిన రెండు బ్యాంకులూ దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయారు.

 
ఆమె పీఎంసీ, యెస్ బ్యాంకుల్లో మదుపు చేయగా ఆ రెండూ పతనమయ్యాయి.‘‘నేనిప్పుడేమీ చేయలేను. బ్యాంకుల్లో తక్కువ డబ్బు ఉంచి ఇంట్లోనే ఎక్కువ దాచుకుంటే సరిపోయేది’’ అంటూ బాధపడ్డారామె.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు