భారత బ్యాంకుల్లో 12 నెలల్లో 71,000 కోట్ల కుంభకోణాలు, ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి?

గురువారం, 21 నవంబరు 2019 (20:46 IST)
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ఈ ఏడాది ఆరు నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ప్రభుత్వ బ్యాంకుల్లో 95,760 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు వార్తలు వచ్చాయని చెప్పారు. ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి లిఖిత సమాధానం ఇచ్చారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకుల్లో మోసాలు జరిగినట్లు మొత్తం 5,743 కేసులు వెలుగులోకి వచ్చాయని చెప్పారు.

 
ఈ ఏడాది జారీ చేసిన భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజా రిపోర్టు ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకుల సహా అన్ని బ్యాంకుల్లో మొత్తం 6,801 మోసాల కేసులు నమోదయ్యాయి. ఈ కుంభకోణాల కేసులను 12 నెలల్లో గుర్తించారు. ఈ సమయంలో మొత్తం 71,543.93 కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. ఈ రిపోర్టు ప్రకారం వీటిలో ఎక్కువ ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించిన కేసులో ఉన్నాయి. భారత మార్కెట్లో బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో, ప్రభుత్వ బ్యాంకులు అన్నిటికంటే ముందున్నాయి.

 
దీనికి ఏడాది ముందు, అంటే 2017-18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 5,916 మోసాల కేసులు నమోదయ్యాయి. వీటిలో 41,167.04 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఏటేటా మోసం కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దానితోపాటూ బ్యాంకులకు జరిగే నష్టం కూడా పెరుగుతోంది. దీంతో దేశంలోని బ్యాంకుల ఆర్థిక స్థిరత్వం తగ్గే ముప్పు కూడా కనిపిస్తోంది.

 
ప్రభుత్వ బ్యాంకులను నిర్వహించే ప్రభుత్వానికి, బ్యాంకుల నియామక సంస్థ అయిన ఆర్బీఐకి, బ్యాంకుల్లో డబ్బు పొదుపు చేసే ప్రజలు.. అందరికీ ప్రస్తుత స్థితి చాలా ఆందోళన కలిగిస్తోంది. ప్రతి కొన్ని వారాలకూ ఏదో ఒక కుంభకోణం జరిగినట్లు కొత్త కేసు వార్తల్లో కనిపిస్తోంది. ఇలాంటి వాటి వల్ల ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం పోతోంది. దాంతోపాటూ బ్యాంకులు, బ్యాంకుల ఆడిటర్లు, క్రెడిట్ రేటింగ్ సంస్థలు, బ్యాంకుల నియామక సంస్థ ఆర్బీఐ గురించి కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారింది.

 
ఆర్బీఐ ప్రకారం కుంభకోణాలను "తాత్కాలికంగా ప్రయోజనం పొందే ఉద్దేశంతో, లేదా అనుకోకుండా ప్రయోజనం పొందడం కోసం, ఒక వ్యక్తి లావాదేవీల సమయంలో బ్యాంకు మాన్యువల్‌గా కానీ, కంప్యూటర్ ద్వారా కానీ నిర్వహించే ఖాతాలకు నష్టం కలిగించడానికి చేసే పని" అని నిర్వచించారు. మొత్తం మోసం కేసుల్లో 90 శాతం ప్రభుత్వ యాజమాన్యం ఉన్న బ్యాంకుల్లోనే జరుగుతున్నాయి. 2013-14 తర్వాత కేవలం ఐదేళ్లలో ఇలాంటి మోసాల కేసులు నాలుగింతలు పెరిగాయి. అయితే, ఈ బ్యాంకుల్లో మోసాల కేసులు అంత ఎక్కువగా ఎందుకు పెరిగాయి.

 
పరిశోధన ద్వారా తెలిసిందంటేంటే మోసం చిన్నదైనా, పెద్దదైనా రెండూ వ్యవస్థ బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) దగ్గర ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోడానికి 'ముందస్తు హెచ్చరిక సంకేతం'(ఈడబ్ల్యుఎస్) వ్యవస్థ ఉంది. కానీ నీరవ్ మోదీ లాంటి కేసుల్లో బ్యాంకులు దాని ప్రయోజనాన్ని పొందలేకపోతున్నాయి.

 
ఇదే ఏడాది జూన్‌లో ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రెజంటేషనే ఇచ్చారు. అందులో "నష్టాలను తగ్గించడం కోసం ఉన్న చెత్త సిస్టం మేనేజ్‌మెంట్, పనికిరాని అంతర్గత ఆడిట్ వల్లే ప్రభుత్వ యాజమాన్యం ఉన్న బ్యాంకుల్లో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి" అని చెప్పారు. ఆయన ప్రెజెంటేషన్ ప్రకారం బ్యాంకులు నష్టాల గురించి చాలా తక్కువ విశ్లేషిస్తాయి. వాటి గురించి తగిన చర్యలు తీసుకోవు.

 
2016లో బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ చేసిన ఒక పరిశోధనలో మోసం, నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) లేదా బ్యాడ్ లోన్ మధ్య ఒక సంబంధం ఉంటుందని తేలింది. దీని ప్రకారం పబ్లిక్ బ్యాంకుల్లో ఎన్‌పీఏ, మోసాల కేసులు పెరుగుతున్నాయి. బ్యాంక్ లోన్ కేసుల్లో రుణం ఒక కోటి రూపాయల కంటే ఎక్కువ ఉంటే, అది చెల్లించని కేసుల్లో కార్పొరేట్ యాక్షన్ ప్రమాణాల ప్రకారం లేకపోవడాన్ని ఇది సూచిస్తోంది. ఈ కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకుల రుణ విభాగం ఉన్నతాధికారులు కుమ్మక్కయ్యారని కూడా ఈ పరిశోధనలో తేలింది.

 
సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లో జరిగిన మోసం కేసుల ప్రాథమిక దర్యాప్తులో మధ్యస్థాయి ఉద్యోగులే కాదు, బ్యాంక్ సీనియర్ మేనేజ్‌మెంట్ అధికారులకు కూడా అందులో పాత్ర ఉన్నట్టు ఐఐఎం(బాంబే) రిపోర్టులో చెప్పింది. ఈ పరిశోధనల ప్రకారం ఈ మోసాల వెనుక అత్యంత ముఖ్యమైన కారణం "ఈ బ్యాంకు ఉన్నతాధికారుల ఎంపిక ప్రక్రియ బలహీనంగా ఉందని, ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే వారి జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని" చెప్పారు.

 
అంతే కాదు, ఆ మోసాల కేసులు నమోదయ్యేసరికే వారు రిటైర్ కూడా అయిపోతారు. ఒకసారి రిటైర్ అయితే, వారికి పెన్షన్ నిబంధనలు అమలవుతాయి. ఎలాంటి ఆర్థిక శిక్షలు పడకుండా అవి వారిని కాపాడతాయి. పెద్ద రుణం అడ్వాన్స్‌ తీసుకునేటప్పుడు మోసం చేయడం అంత సులభం కాదని ఈ పరిశోధనల్లో తేలింది. అయినప్పటికీ అవి జరిగాయి. ఎందుకంటే బ్యాంక్ అధికారులు అప్పుడప్పుడు రుణదాతలు లేదా వకీళ్లు, చార్టెడ్ అకౌంటెంట్(సీఏ) లాంటి మూడో పార్టీలతో కూడా ఒప్పందం కుదుర్చుకుంటూ ఉంటారు.

 
బ్యాంకుల్లో ఆడిటర్లకు మామూలుకంటే, తక్కువ వేతనం ఇస్తున్నారు. అంటే దానర్థం. వారు తమ పనులు చేయడానికి ఒక పరిమితి వరకే ప్రయత్నిస్తారు. దీనితోపాటు వారి ట్రైనింగ్ స్థాయి, నైపుణ్యం కూడా చాలా వరకూ తక్కువగా ఉంటుంది. ఫలితంగా, మోసాల గురించి హెచ్చరించాల్సిన ఆడిటర్లు, అలాంటి వాటిని మొదటే గుర్తించడానికి సాయం చేసే సంకేతాలపై దృష్టి పెట్టరు.

 
ఉద్యోగుల్లో సామర్థ్యం, ఆధునిక టెక్నాలజీ వనరులు, పనిపట్ల ఉత్సాహం లేకపోవడం వల్ల ఈ బ్యాంకులు రుణం ఆమోదించాక, వాటిపై నిఘా పెట్డడం కూడా ప్రైవేటు బ్యాంకుతో పోలిస్తే చాలా బలహీనంగా ఉంది. దానితోపాటు మోసాలను మొదట్లోనే గుర్తించి, వాటిని అడ్డుకునే ఉద్యోగులకు తగిన ప్రోత్సాహం కూడా లభించడం లేదు. సీతారామన్ మంగళవారం రాజ్యసభలో బ్యాంకుల్లో పెరుగుతున్న మోసాలను అడ్డుకోడానికి ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందని భరోసా ఇవ్వడానికి ప్రయత్నించారు.

 
దానికోసం కేంద్రం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో నిష్క్రియ కంపెనీలకు సంబంధించిన 3,38,000 అకౌంట్లు మూసివేసింది. ఆర్థిక నేరస్థుల ఆస్తులను జప్తు చేసే సెక్షన్లను బ్యాంకింగ్ చట్టాల్లో చేర్చింది. ఇది మంచి చర్యే అయినప్పటికీ, మోసగాళ్లను ఆపడానికి ఇవి సరిపోవు

 
మోసాలను అదుపు చేసే చర్యలు కూడా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, ఆర్థిక నేరాలకు కారణమైన వ్యక్తులను దోషులుగా నిలబెట్టడంలో బ్యాంకులు ఇప్పటివరకూ పెద్దగా విజయవంతం కాలేకపోయాయి. ఒక విధంగా ఫోరెన్సింగ్ అకౌంటింగ్ సూక్ష్మ నైపుణ్య పరిజ్ఞానం ఉండడంతోపాటూ, మోసాల చట్టం గురించి బాగా తెలిసిన నిపుణులైన ఆర్థిక పరిశోధన అధికారులు లేకపోవడమే దానికి కారణం.

 
పెద్ద రుణాలతో జరిగే మోసాల కేసులను బ్యాంకుల గ్రూపులు చూస్తాయి. మోసాలకు సంబంధించిన సూచనలను ఇచ్చిపుచ్చుకునే ఈ బ్యాంకుల మధ్య సమన్వయం లోటును ఆర్బీఐ గమనిస్తోంది. మోసాల ముప్పును అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తే, ఆర్థిక మోసాల గురించి తెలుసుకునేలా అది, అఖిల భారత సేవల తరహాలో ఆర్థిక, చట్ట పరిజ్ఞానం ఉన్న అత్యంత అర్హులైన అధికారులతో ఒక స్వతంత్ర, ప్రత్యేక ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు గురించి ఆలోచించాలి.

 
ఆర్థిక అవకతవకలపై ఒక నిర్ణీత సమయంలోపు విజయవంతంగా దర్యాప్తు పూర్తి చేయగలిగేలా వారికి శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వం కావాలంటే బ్యాంకులు, ఆర్బీఐ, సీబీఐ అధికారులతో ఒక పూల్ ఏర్పాటు చేసి అలాంటి ఫ్రేమ్ వర్క్ నిలబెట్టగలదు. పెద్ద ప్రాజెక్ట్ కోసం రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకులు చాలా కఠినంగా దానిని మూల్యాంకనం చేసేందుకు ఒక ఇంటర్నల్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. ప్రాజెక్ట్ మూల్యాంకనం బిజినెస్ మోడల్ ఆధారితమై ఉండాలి. కంపెనీ బ్రాండ్, క్రెడిట్ అర్హతల ప్రభావంలో పడకుండా పూర్తి పథకాన్ని నిర్ధారిత ప్రక్రియల ప్రకారం కఠినంగా అమలు చేయాలి.

 
అంతే కాకుండా, ముప్పు ఎదురైనప్పుడు ఎర్ర జెండా చూపించడానికి, హెచ్చరిక ప్రాథమిక సంకేతాలను సమర్థంగా అమలు చేయడానికి బ్యాంకులు ఐటీ సర్వీస్, డేటా అనాలసిస్ అందించే అత్యంత మెరుగైన వారిని తమ దగ్గర నియమించుకోవాలి. దీనివల్ల వినియోగదారుల రికార్డులను మరింత మెరుగ్గా మేనేజ్ చేయవచ్చు. చివరగా, ప్రభుత్వం మోసం చేసిన వారితో చేతులు కలిపిన బ్యాంకు ఉద్యోగులతోపాటు, బ్యాంక్ ఖాతా గణాంకాలతో మోసం చేసిన చార్టెడ్ అకౌంటెంట్, వకీల్, ఆడిటర్లు, రేటింగ్ ఏజెన్సీలు లాంటి మూడో పక్షం వారికి కూడా కఠిన శిక్షలు పడేలా చేయాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు