అఫ్గానిస్తాన్: తాలిబాన్ల రాకతో భారత్‌కు కొత్త చిక్కులు తప్పవా?
గురువారం, 19 ఆగస్టు 2021 (17:11 IST)
తాలిబాన్లు మెరుపు వేగంతో అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకోవడం ప్రపంచవ్యాప్తంగా భద్రత, దౌత్య రంగాల నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది. తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న వెనువెంటనే, వివిధ దేశాలు, తమ దౌత్యవేత్తలను, పౌరులను హడావిడిగా వెనక్కి రప్పించుకునే ప్రయత్నాలు మొదలెట్టాయి. అఫ్గానిస్తాన్‌లో రెండు దశాబ్దాల పాటు పెట్టిన శ్రమ, పెట్టుబడిని అలాగే వదిలి పెట్టేందుకు సిద్ధపడ్డాయి. అఫ్గానిస్తాన్‌లో సంభవిస్తున్న తాజా పరిణామాలు దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది.
భారతదేశానికి పెద్ద సవాలు
ముఖ్యంగా భారతదేశానికి ఇది పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో చారిత్రకంగా ఉన్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో, ఈ రెండు దేశాలూ తాలిబాన్లకు మిత్రదేశాలు కావడం భారతదేశానికి సమస్యలు సృష్టించవచ్చు. భవిష్యత్తులో అఫ్గానిస్తాన్ ఆర్థిక, రాజకీయ అంశాల్లో పాకిస్తాన్, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య సరిహద్దు చాలా సంక్లిష్టమైనది. ఆ సరిహద్దు వెంబడి చాలా చోట్ల రాకపోకలకు ఆస్కారమిచ్చే దారులున్నాయి. అంతే కాకుండా, చాలాకాలం నుంచి అఫ్గానిస్తాన్ వ్యవహారాల్లో పాకిస్తాన్ చురుకుగా జోక్యం చేసుకుంటూ ఉంది. ఇప్పుడు, అఫ్గానిస్తాన్‌పై చైనా ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గత నెలలో సీనియర్ తాలిబాన్ నాయకులతో సమావేశమవడం చూస్తుంటే, చైనాకు అఫ్గానిస్తాన్‌పై ఉన్న ఆసక్తి స్పష్టం అవుతోంది.
"భౌగోళిక రాజకీయ అంశాల్లో ఈ రకమైన మార్పులు అనేక విషయాలను తలకిందులు చేయవచ్చు" అని అఫ్గానిస్తాన్, సిరియాలలో భారత మాజీ రాయబారి గౌతమ్ ముఖోపాధ్యాయ అభిప్రాయపడ్డారు. కాబుల్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి, పశ్చిమ దేశాలకు, ఇండియా లాంటి ఇతర ప్రజాస్వామ్య దేశాలకు పరస్పర ప్రయోజనాలు చేకూరేలా ఇంతవరకూ అఫ్గానిస్తాన్ వ్యవహారాలు నడిచాయి. ఇకపై, పాకిస్తాన్, రష్యా, ఇరాన్, చైనాలు కలిసికట్టుగా ఈ రాజకీయ ఆటలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే, ఇండియాలో కొందరు ఈ పరిణామాలను దేశానికి నష్టాన్ని కలిగించేవిగానూ, పాకిస్తాన్‌కు లాభాన్ని కలిగించేవిగానూ పరిగణిస్తున్నారు. కానీ, అదంత సులువుగా తేల్చి చెప్పే విషయం కాదని భారత మాజీ దౌత్యవేత్త జితేంద్ర నాథ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దులను పష్తూన్ల నేతృత్వంలోని తాలిబాన్ ఎప్పుడూ ఆమోదించలేదు. ఇది పాకిస్తాన్‌ను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంది.
"తాలిబాన్ ఆ సరిహద్దులను గుర్తించి, ఆమోదించాలనే పాకిస్తాన్ కోరుకుంటుంది. దీనికే మొదటి ప్రాధాన్యం ఇస్తుంది" అని ఆయన అన్నారు. అయితే, ఇక్కడ మరో విషయం కూడా ఉంది. అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పాలన, భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు వ్యూహాత్మకమైన బలాన్ని సమకూరుస్తుందన్నది కూడా వాస్తవమే.
'విజయం తమదేనని పాకిస్తాన్ భావిస్తోంది'
తాలిబాన్ల పునరాగమనంతో పాకిస్తాన్ చిరకాల కోరిక నెరవేరిందని వాషింగ్టన్‌లోని విల్సన్ సెంటర్ థింక్-ట్యాంక్ డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కుగెల్మన్ అన్నారు. "తాను సులభంగా ప్రభావితం చేయగలిగే ప్రభుత్వం అఫ్గానిస్తాన్‌లో రావాలన్నదే పాకిస్తాన్ కోరిక. ఇది భారతదేశానికి పెద్ద నష్టంగా పాకిస్తాన్ అధికారులు చూపించవచ్చు. కానీ, ఇంతకుమించిన పెద్ద వ్యూహాత్మక లక్ష్యాలు పాకిస్తాన్‌కు ఉన్నాయి. ప్రస్తుతానికి దక్షిణాసియాలో తామే విజేతలమని పాకిస్తాన్ భావిస్తోంది" అని కుగెల్మన్ అన్నారు.
ఓ పక్క అమెరికా, ఇండియాల మధ్య సత్సంబంధాలు నెలకొనడం, మరో పక్క అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, పాకిస్తాన్‌తో అంతంతమాత్రంగా సంబంధాలు కొనసాగించడం పాకిస్తాన్‌కు రుచించలేదని నిపుణుల అభిప్రాయం. తమ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుండడం కూడా ఈ అసంతృప్తిని మరింత పెంచింది. ప్రస్తుత పరిస్థితుల్లో తామే విజేతలమని పాకిస్తాన్ భావించడానికి తగిన కారణాలే ఉన్నాయి. చైనాతో తమ స్నేహం అఫ్గానిస్తాన్‌లో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, తమ శక్తిని చూపించుకోవడానికి చైనా ఎంతమాత్రం వెనుకాడదు.
"ఇప్పుడు చైనా తన సొంత నియమాలతో ఆటలో పావులు కదపగలదు" అని మిశ్రా అన్నారు. అలాగే, అఫ్గానిస్తాన్ ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాలపై కూడా చైనా దృష్టి సారిస్తోంది. అక్కడ పుష్కలంగా ఉన్న ఖనిజ వనరులు తమ దేశంలో పెరుగుతున్న ఖనిజ అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడతాయని భావిస్తోంది. కానీ, అంతకన్నా ముఖ్యంగా, అఫ్గాన్ గడ్డపై ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ (ఈటీఐఎం)ను నిషేధించాలని చైనా, తాలిబాన్లపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. తమ దేశంలో ముస్లింలు అధికంగా ఉన్న జిన్జియాంగ్ ప్రాంతంలో అశాంతికి ఈటీఐఎం కారణమని చైనా భావిస్తోంది.
"అఫ్గానిస్తాన్ విషయంలో చైనా, పాకిస్తాన్‌లు చేయీ చేయీ కలపడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి" అని ముఖోపాధ్యాయ అన్నారు. అయితే, చైనా ఈ విషయంలో జాగ్రత్త వహించాలని, గతంలో ఇతర ప్రపంచ శక్తులు మాదిరి ట్రాప్‌లో పడకుండా ఉండాలని ఆయన హెచ్చరించారు. రష్యా, ఇరాన్‌లు కూడా ఇలాంటి వ్యూహాలనే పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రెండు దేశాలూ కూడా కాబుల్‌లోని తమ రాయబార కార్యాలయాలను ఖాళీ చేయించలేదు. వారి దౌత్యవేత్తలు అక్కడే ఉండి విధులకు హాజరవుతున్నారు.
ఇప్పుడు ఇండియా ఏం చేయగలదు?
అఫ్గానిస్తాన్ విషయంలో పాకిస్తాన్, అమెరికా, రష్యాలు పోషించినంత పెద్ద పాత్ర భారత్ ఎప్పుడూ పోషించలేదు. అయితే, ఇరు దేశాల మధ్య భద్రత, సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడంలో భారతదేశం ఎప్పుడూ ముందుంది. అనేకమంది అఫ్గాన్ పౌరులు చదువుకోవడానికి, ఉద్యోగ నిమిత్తం లేదా వైద్య చికిత్స కోసం భారతదేశానికి వస్తుంటారు. "భారతదేశానికి ఎంచుకునేందుకు పెద్దగా మార్గాలేవీ ఉన్నట్లు కనబడడం లేదు" అని మిశ్రా అన్నారు.
తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించాలా వద్దా అనేదే భారతదేశం ఎదుర్కోబోయే అతి పెద్ద సవాలు. రష్యా, చైనాలు తాలిబాన్ అధికారాన్ని ఏదో ఒక రూపంలో గుర్తించేందుకు సిద్ధమైతే అప్పుడు భారత్‌కు సమస్య మరింత జటిలం అవుతుంది. 1999లో లాగానే ఇప్పుడు కూడా పాకిస్తాన్ అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని ఆమోదించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికి తాలిబాన్లతో చర్చలకు సిద్ధం కావడమే భారత్ ముందున్న ఉత్తమమైన మార్గం.
కానీ, అది అంత సులువేమీ కాదు. 1999లో ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసిన ఘటన వెనుక తాలిబన్ల హస్తం ఉందని భారత్ భావిస్తోంది. దాన్ని విడిపించడానికి జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్, అహ్మద్ జర్గర్, షేక్ అహ్మద్ ఉమర్ సయీద్‌లను విడుదల చేయడం భారతదేశంలో ఇప్పటికీ ఎవరూ మరచిపోలేదు. అంతేకాకుండా, 1996-1999 మధ్య తాలిబాన్లతో పోరాటం జరిపిన అఫ్గాన్ ఉత్తర కూటమితో భారతదేశానికి దగ్గర సంబంధాలున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో, సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి, దక్షిణాసియా ప్రాంతంలో స్థిరత్వాన్ని సాధించడానికి గతాన్ని పక్కన పెట్టడమే ఉత్తమమైన మార్గంగా ఇండియా భావించవచ్చు. తాలిబాన్ల విజయంతో జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా లాంటి తీవ్రవాద గ్రూపులు బలపడి, భారతదేశానికి వ్యతిరేకంగా దాడులు జరపవచ్చనే ఆందోళనలు కూడా ఉన్నాయి. దౌత్యపరంగా భారతదేశం ఆచి తూచి అడుగేయాల్సి ఉంటుందని అఫ్గానిస్తాన్‌పై పుస్తకం రాసిన, లంకాస్టర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అమలేందు మిశ్రా అన్నారు.
అంతే కాకుండా, వివాదాస్పద కాశ్మీర్ ప్రాంతం ముజాహిదీన్‌ల తదుపరి ర్యాలీ పాయింట్‌గా మారకుండా ఉండేందుకు ఇండియాకు ఒక వ్యూహం అవసరం కావచ్చు. తాలిబాన్లతో చర్చలు జరుపుతూనే, తాలిబాన్ వ్యతిరేక గుంపులతో ఎంతవరకూ కలవాలనే విషయాన్ని కూడా భారత్ ఆలోచించుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. తాలిబాన్లపై ఒత్తిడి తెచ్చేందుకు పశ్చిమ దేశాలు కూటమిని ఏర్పరిచే అవకాశం ఉంది. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇప్పటికే ఈ దిశలో పిలుపునిచ్చారు.
అఫ్గాన్ ఉత్తర కూటమి తిరిగి సమీకరించుకోవడం లేదా అఫ్గానిస్తాన్‌పై ఆధిపత్యం కోసం అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలకు, రష్యా, చైనా, పాకిస్తాన్ కూటమికి మధ్య పోరాటం ప్రారంభం కావొచ్చు. కాబట్టి భారత్ ఎదుట అంత సులువైన మార్గాలేమీ లేవు. కానీ, భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి దక్షిణాసియా ప్రాంత శాంతిభద్రతలు, భౌగోళిక రాజకీయలను ప్రభావితం చేస్తాయి.