అఫ్గానిస్తాన్: అధికారంలోకి వచ్చాక తొలిసారి బహిరంగ మరణ శిక్ష అమలు చేసిన తాలిబాన్లు

బుధవారం, 7 డిశెంబరు 2022 (22:28 IST)
అఫ్గానిస్తాన్‌లో గత ఏడాది తాలిబాన్లు తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత తొలిసారి బహిరంగ ఉరిశిక్ష అమలు చేశారు. ఫారా ప్రావిన్సులోని క్రీడా మైదానంలో అందరూ చూస్తుండగా తాజ్మీర్ అనే వ్యక్తికి ఉరిశిక్ష విధించినట్టు తాలిబాన్ల అధికార ప్రతినిధి చెప్పారు. తాజ్మీర్ తాను హత్య చేసినట్టు ఒప్పుకోవడంతో ఈ శిక్ష విధించినట్లు వారు చెప్పారు. తాలిబాన్ ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి మంత్రులు, 12 మంది నాయకుల సమక్షంలో ఈ ఉరిశిక్షను అమలు చేశారు.

 
షరియా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాలని జడ్జిలకు ఆదేశించిన వారాల వ్యవధిలోనే ఈ బహిరంగ ఉరిశిక్షను తాలిబన్ ప్రభుత్వం అమలు పరిచింది. బహిరంగ ఉరి శిక్షలతో పాటు శరీరంలో ఏదో భాగాన్ని తీసివేయడం, రాళ్లతో, కొరడాతో కొట్టడం వంటి శిక్షలను కూడా అమల్లోకి తీసుకు రావాలని గత నెలలోనే తాలిబాన్ సుప్రీం లీడర్ హైబతుల్హా అఖుండ్‌‌జాదా జడ్జిలను ఆదేశించారు. అయితే, ఎలాంటి నేరాలకు, ఏ శిక్షలు విధించాలన్నది తాలిబాన్ ప్రభుత్వం ఇంకా స్పష్టంగా నిర్వచించలేదు.

 
అఫ్గానిస్తాన్‌లో 1996 నుంచి 2001 మధ్య కాలంలో తాలిబాన్ ప్రభుత్వమే ఉండేది. అప్పట్లో అమలు చేసిన కఠినమైన చట్టాలను ఇప్పుడు అమలు పరచమని, ఆ నిబంధనలకు కాస్త సడలింపులు ఉంటాయని ఈ మిలిటెంట్ ఇస్లామిస్ట్ గ్రూప్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రకటించింది. కానీ, బుధవారం నాటి బహిరంగ మరణ శిక్ష అమలుతో ఆనాటి కఠినమైన చట్టాల రోజులు మళ్ళీ వచ్చినట్లయింది. ఇటీవలి కాలంలో తాలిబాన్లు బహిరంగంగా కొరడాతో వీపులు వాచిపోయేలా కొట్టడం వంటి పలు రకాల కఠిన శిక్షలను విధించింది. గత నెలలో లోగార్ ప్రావిన్స్‌లోని ఫుట్‌బాల్ స్టేడియంలో పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడిన సమయంలో పది మందికి పైగా ప్రజలకు ఈ శిక్ష వేసింది.

 
అయితే, ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం తాను తొలిసారిగా బహిరంగంగా మరణ శిక్ష విధించినట్లు ప్రకటించింది. తాలిబాన్ గ్రూప్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ చెప్పిన వివరాల ప్రకారం, సుప్రీంకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు, రక్షణ అధికారులు, న్యాయ, విదేశీ, హోం శాఖ మంత్రులు ఈ మరణ శిక్ష అమలుకు హాజరయ్యారు. కఠినమైన ఇస్లామిక్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మహమ్మద్ ఖాలిద్ హనాఫీ కూడా ఈ ఉరిశిక్ష అమలులో పాల్గొన్నారు. అయితే, ప్రధానమంత్రి హసన్ అఖుండ్ మాత్రం దీనికి హాజరు కాలేదు. తాలిబాన్లు చెప్పిన వివరాల ప్రకారం, హెరాత్ ప్రావిన్స్‌కు చెందిన గులాం సర్వార్ కొడుకు తాజ్మీర్ అనే వ్యక్తికి ఈ శిక్ష విధించారు. అయిదేళ్ల కిందట అతడు ముస్తఫా అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు.

 
ఆ తర్వాత మూడు తాలిబన్ కోర్టులు తాజ్మీర్‌ను దోషిగా నిర్ధారించాయి. అతడికి విధించిన శిక్షను ముల్లా అఖుండ్ ‌జాదా కూడా ఆమోదించారు. తాజ్మీర్‌కు ఉరిశిక్ష విధించే ముందు తాలిబన్ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ప్రజలందరూ స్పోర్ట్స్ మైదానానికి వచ్చి ఈ ఉరిశిక్షను చూడాలని తెలిపింది. అయితే, ఉరి తీసే ముందు తాజ్మీర్‌ను క్షమించాలని తాలిబన్లు తనను కోరినట్టు హత్యకు గురైన వ్యక్తి తల్లి బీబీసీకి చెప్పారు. కానీ, అతనికి శిక్ష అమలు చేయాలని ఆమె పట్టుబట్టారు.

 
"దేవుడి కోసం ఆ వ్యక్తిని మన్నించాలంటూ తాలిబాన్లు నన్ను కోరారు"అని ఆమె చెప్పారు. తాజ్మీర్ తప్పనిసరిగా శిక్ష ఎదుర్కోవాలని, తన కొడుకుని ఏ విధంగా చేశాడో, ఆ విధంగా అతడిని ఖననం చేయాలని కోరినట్లు ఆమె వివరించారు. ఇది ఇతరులకు ఒక పాఠంలా మారుతుందని ఆమె అన్నారు. ఒకవేళ అతనికి శిక్ష వేయకపోతే, భవిష్యత్‌లో ఇతర నేరాలను కూడా పాల్పడతాడని ఆమె అన్నారు. తాలిబాన్లు 1996-2001లో అధికారంలో ఉన్న రోజుల్లో కాబూల్‌ నేషనల్ స్టేడియంలో బహిరంగ ఉరిశిక్షలు అమలు చేయడంతో పాటు అనేక కఠిన శిక్షలను అమలు చేశారు. వారు అలా చేయడాన్ని చాలా మంది తీవ్రంగా ఖండించారు.

 
అయితే, ప్రస్తుత తాలిబాన్ పాలకులు తాము మహిళలకు క్రూరమైన ఆంక్షలను విధించమని అధికారంలోకి వచ్చిన కొత్తలో వాగ్దానం చేసింది. కానీ, వారు మహిళల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను తీవ్రంగా అణచివేశారు. హక్కుల కోసం పోరాడిన ఎంతో మంది మహిళలను దారుణంగా కొట్టారు. అఫ్గానిస్తాన్‌లోని ఈ తాలిబాన్ ప్రభుత్వాన్ని ఏ దేశం కూడా గుర్తించలేదు. బాలికలను స్కూళ్ళకు రానివ్వకుండా నిషేధం విధించడంతో ప్రపంచ బ్యాంకు ఆ దేశానికి ఇవ్వాల్సిన 60 కోట్ల డాలర్లను ఆపేసింది. అమెరికా కూడా ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న అఫ్గానిస్తాన్ సెంట్రల్ బ్యాంకులలోని కోట్లాది డాలర్లను స్తంభింపచేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు