అమరావతి ఇష్టంలేకుంటే ధైర్యంగా చెప్పండి : జగన్ రెడ్డికి పవన్ సూచన
మంగళవారం, 31 డిశెంబరు 2019 (13:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో జనసేన తన వైఖరిని స్పష్టం చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ జిల్లాల నేతలు ఆ సమావేశంలో పాల్గొన్నారు.
మూడు రాజధానుల అంశంపై ఆయా జిల్లాల నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత పార్టీ వైఖరిని వెల్లడిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతి ప్రస్తుత పరిస్థితులపై జనసేన పార్టీ రూపొందించిన బుక్‌లెట్‌ను ఆయన ఆవిష్కరించారు.
"ఒకరికి న్యాయం జరగడం కాదు. అందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అన్ని జిల్లాల నాయకులు ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను తెలియజేశారు. వాటి ఆధారంగా పార్టీ పరంగా ఒక స్పష్టమైన వైఖరిని రూపొందించుకుంటాం" అని పవన్ అన్నారు.
అమరావతి ఇష్టం లేకపోతే ధైర్యంగా చెప్పండి
రాజధాని మార్పు ప్రతిపాదనలు, రైతుల దీక్షలపై పవన్ ఏమన్నారంటే... "ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కలలు కనేవాళ్లలో నేను ముందుంటాను. 'ప్రాంతీయత విస్మరించని జాతీయత' అని మేనిఫెస్టోలో అందుకే పెట్టాను. మోదీని కలిసినప్పుడు కూడా రాజధాని గురించి చర్చించాం. రాజధాని అనేది అందరికీ అమోదయోగ్యంగా ఉండాలి.
రాజుల కాలంలో చెల్లిపోయింది.. ఎవరికి నచ్చినట్టు వారు మార్చుకోవడం, ప్రజాస్వామ్యంలో చెల్లదు. అమరావతిని జగన్ రెడ్డి సహా అందరు ఆమోదించారు. ఒక్కరు కూడా అసమ్మతి స్వరం వినిపించలేదు.
నేను అప్పట్లోనే 3 వేల ఎకరాలు చాలని చెప్పాను. కానీ కొందరు భిన్నంగా మాట్లాడారు. అమరావతి రైతుల సమస్య అప్పుడే మొదలయ్యింది. భూసేకరణ విషయంలో రైతు కన్నీరు వద్దని ఆరోజే చెప్పాను. 40 శాతం ఎస్సీలు ఉన్న ప్రాంతం ఇది. ఈరోజుకీ బేతపూడి, ఉండవల్లి, పెనమాక అలా ఉన్నాయంటే అది జనసేన వల్లే.
అప్పట్లో జగన్ కూడా రాజధానికి మద్దతు ఇవ్వడం వల్లే రైతులు భూములిచ్చారు. వాళ్లు రాజధాని పెట్టమని అడగలేదు. రైతు కన్నీరు పెడితే అది దహించేస్తుంది. అప్పుడు ఒకలా... ఇప్పుడు మరోలా చెబితే ధర్మం తప్పినట్టే. వ్యవస్థను నడిపేవారు మాట తప్పితే పర్యవసానాలను ఊహించారా? అండగా నిలబడాల్సింది పోయి కేసులు పెడతారా?
జగన్ రెడ్డిలో స్పష్టత లేదు. వైజాగ్‌లో రాజధాని పెడతామని ఇంకా చెప్పలేదు. కర్నూలులో హైకోర్ట్ పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? భీమిలిలో రాజధాని అని చెప్పడానికి వైసీపీ నాయకుడెవరు? ఆంధ్రప్రదేశ్‌కి మీరు ముఖ్యమంత్రా.. లేక ఒక ప్రాంతానికా? వైషమ్యాలు పెంచకండి.. గత ప్రభుత్వం తప్పు చేస్తే సీబీఐకి ఫిర్యాదు చేయండి.
"విశాఖలో హూద్ హూద్ వస్తే వైసీపీ నాయకులు ఏమయ్యారు? ఉత్తరాంధ్ర మీద ఇప్పుడే ప్రేమ వచ్చిందా?" అని పవన్ ప్రశ్నించారు. అమరావతి ఇష్టం లేకపోతే ధైర్యంగా చెప్పండి. రాజధాని ఒక ప్రాంతంలో ఉండాలి. అమరావతి, వైజాగ్, కర్నూల్ ఎక్కడ పెట్టుకుంటారో మీ ఇష్టం. ఒక చోట నుంచి పాలన- అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి."
మంగళవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో పవన్ పర్యటన
మంగళవారం నాడు రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. తుళ్లూరు, మందడం గ్రామాల్లో పవన్ పర్యటించబోతున్నట్టు ఆపార్టీ నేతలు తెలిపారు. రాజధాని ప్రాంత రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వారికి సంఘీభావం తెలిపేందుకు ఈ పర్యటన చేపడుతున్నట్టు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు.
"రాజధాని ప్రాంతంలో ఇప్పటికే నాగబాబుతో కలిసి పర్యటించాం. రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఆరు నెలల వరకూ ప్రభుత్వం మీద విమర్శలు చేయకూడదని అనుకున్నాం. కానీ, ఇసుక సమస్య మీద పలువురు బాధితులు వచ్చి మా అధినేతను కలిసిన తర్వాత ఆ సమస్యపై స్పందించాం. పాఠశాలల్లో తెలుగు మీడియం విషయంలోనూ జనసేన వైఖరిని పలువురు అభినందించారు.
రాజధాని సమస్యపై కూడా అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని జనసేన అభిప్రాయం వెల్లడిస్తుంది. కానీ, రైతులను మాత్రం ఇబ్బంది పెట్టడం తగదు. ఇప్పటికే రాజధానిగా ఎంపిక చేసి, కొన్ని భవనాలు నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మార్పు ప్రస్తావన తీసుకురావడం వారికి ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాలపై మా అధ్యక్షుడు తగిన నిర్ణయం తీసుకుంటారు" అని మనోహర్ వివరించారు.
'హైపవర్ కమిటీ కాదు, అది ప్రభుత్వ కమిటీ'
మొన్నటి క్యాబినెట్ మీటింగ్‌లో ఏ ప్రతిపాదనతో అయినా ప్రభుత్వం ముందుకొస్తే, దాని మీద చర్చించాలనుకున్నాం గానీ హైపవర్ కమిటీ పేరుతో ప్రభుత్వ కమిటీని నియమించారని జనసేన నాయకుడు బొలిశెట్టి సత్య వ్యాఖ్యానించారు. రాజధాని అంశంలో జనసేన వైఖరిపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
"హైపవర్ కమిటీలో 10 మంది మంత్రులు, కొందరు అధికారులను నియమించారు. వారెవరైనా ముఖ్యమంత్రి మాటను కాదనగలరా? ఇంకెందుకు ఆ కమిటీ? ఐదేళ్ల క్రితమే రాజధానిగా అమరావతిని జగన్ అంగీకరించారు. అప్పుడే కాదని ఉంటే కథ వేరుగా ఉండేది. అప్పుడు అవునని చెప్పి, ఇప్పుడు కాదనడం ఏంటి? గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కొందరు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడితే ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ అదే జరుగుతోంది. రాజధానిగా చెబుతున్న విశాఖలో అభివృద్ధి ఎలా ఉన్నప్పటికీ అక్కడ భూములు కొనుగోలు చేసిన అధికార పార్టీ నేతలు, వారి అనుచరుల భూముల ధరల్లో మాత్రం అభివృద్ధి జరుగుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
మంచి సూచనలు ఎవరు చేసినా స్వీకరిస్తాం
విపక్షంలో ఉన్న జనసేన నాయకులు విలువైన సూచనలు చేస్తే కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని గుంటూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు తెలిపారు. "రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి తగిన రీతిలో న్యాయం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. భూములు వెనక్కి తీసుకుంటామని అడిగిన వాళ్లకు వెనక్కి ఇవ్వాలని, లేదంటే అభివృద్ధి చేసి తగిన పరిహారం చెల్లించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దానికన్నా మంచి సూచనలు ఎవరు చేసినా స్వీకరిస్తాం. పవన్ కల్యాణ్ కూడా రైతుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. దానికి భిన్నంగా వ్యవహరించడం మంచిది కాదు" అని ఆయన బీబీసీతో అన్నారు.
రాజధాని రైతు పరిరక్షణ సమితి ఫిర్యాదు, హైకోర్టులో విచారణ
ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీకి చట్టబద్ధత లేదంటూ రాజధాని ప్రాంత రైతు పరిరక్షణ సమితి వేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని తరలింపు ప్రతిపాదనపై కూడా పిటిషన్‌దారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, వెంటనే విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా, ప్రభుత్వం నుంచి వివరాలు అందలేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
బోస్టన్స్ కన్సల్టెన్సీ గ్రూప్ గురించి పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. ఆ కమిటీని ఎప్పుడు, ఎవరు నియమించారు? నియమ నిబంధనలు చెప్పాలి అని కోరారు. ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చాక వివరాలు ఇస్తామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. జనవరి 21 నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్ధానం ఆదేశించింది. జనవరి 23న ఈ కేసుపై తదుపరి విచారణ చేపడతామని హైకోర్ట్ తెలిపింది.
మీడియా ప్రతినిధులపై దాడి కేసులో నిందితులకు రిమాండ్, చంద్రబాబు పరామర్శ
డిసెంబర్ 27న రైతుల ఆందోళనలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేసిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్నవారిని ప్రతిపక్ష నేత చంద్రబాబు పరామర్శించారు. రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు.
పదమూడో రోజు కూడా రాజధాని రైతులు తమ ఆందోళన కొనసాగించారు. మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకుని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తుళ్లూరు, వెలగపూడి, మందడం, రాయపూడి గ్రామాల్లో రైతులు ధర్నాలు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు.