ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ ఉద్యోగులు: 'జూన్ వస్తున్నా ఇంకా మార్చి జీతమే రాలేదు'
బుధవారం, 24 మే 2023 (21:17 IST)
సాధారణ ఉద్యోగికి ఒక నెల జీతం రాకపోతే పాల బిల్లు, కిరాణా బిల్లు, ఈఎంఐలు అంటూ సవాలక్ష సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే మూడు నెలలుగా జీతాలు లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏపీలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అంగన్‌వాడీ సిబ్బంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఐసీడీఎస్‌లో పని చేసే అంగన్‌వాడీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, బాలింతల సంక్షేమం కోసం అంగన్‌వాడీ సిబ్బంది పనిచేస్తున్నారు. కొద్దిపాటి జీతాలతోనే వారు జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఆ వేతనాలు కూడా సకాలంలో విడుదల చేయకుండా జాప్యం చేస్తుండడంతో వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. జీతాలతో పాటు కార్యకర్తల బిల్లులను కూడా ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం సిబ్బందిని వేధిస్తోంది. ఉద్యోగులు, కార్యకర్తలు సహా అందరినీ ఈ సమస్యలు వెంటాడుతున్నాయి. అయినా ప్రభుత్వం కాలయాపన చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
మూడు నెలలుగా రాని జీతాలు
స్త్రీ శిశు సంక్షేమ శాఖలో భాగంగా ఐసీడీఎస్ పథకం నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారుల సంక్షేమం కోసం అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేయాల్సి ఉంటుంది. అంగన్‌వాడీ కేంద్రాలను చిన్న పిల్లలకు తొలి పాఠశాలలుగా చెబుతున్నారు. ఏపీలో మారిన విద్యావిధానంలో భాగంగా అంగన్‌వాడీ సెంటర్లను ప్రీ ప్రైమరీ విద్యాలయాలుగా గుర్తించారు. అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను ఐసీడీఎస్ ప్రాజెక్టులు పర్యవేక్షిస్తుంటాయి. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత, వాటికి అనుగుణంగా ఐసీడీఎస్ ప్రాజెక్టులను కూడా పునర్వవస్థీకరించారు. 2023 మార్చిలో ఇవి అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ కొత్త ప్రాజెక్టులలో చేరిన సిబ్బందికి మాత్రం వేతనాలు దక్కడం లేదు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వారి అకౌంట్లకు చేరాల్సిన జీతాలు ఇంకా జమకాలేదని చెబుతున్నారు. సంబంధిత అధికారులను పలుమార్లు కలిసినా ప్రయోజనం లేదని అంటున్నారు.
చిన్న సమస్యే అన్నారు, కానీ..
కొత్తగా ఏర్పాటైన ప్రాజెక్టుల్లో సీడీపీవో, ఏసీడీపీవో, సూపర్ వైజర్లు, ఆఫీసు సిబ్బందితో కలిపి 10 నుంచి 15 మంది ఉంటారు. వారితో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ వేతనాలు జమ చేసేందుకు ఐడీలు క్రియేట్ చేసి, వాటిని జిల్లా స్థాయి ఖజానా అధికారి ధ్రువీకరించే మ్యాపింగ్ ప్రక్రియను రాష్ట్రస్థాయి అధికారులు చేయాల్సి ఉంది. అది సకాలంలో జరగకపోవడంతో సిబ్బంది జీతాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. "మార్చి నెలలో జీతం పడాలి. కానీ రాలేదు. వెంటనే అధికారులను ఆశ్రయించాం. చిన్న సమస్య ఉంది. అయిపోతుందని చెప్పారు. ఏప్రిల్ గడిచింది. మే నెల జీతం కూడా రాలేదు. మళ్లీ జూన్ వస్తోంది. ఇప్పటికీ డీడీవో(డిస్ట్రిక్ట్ డ్రాయింగ్ ఆఫీసర్) మ్యాపింగ్ జరగలేదని అంటున్నారు'' అని ఉద్యోగిని ఆర్ రమాప్రభ చెప్పారు. ''ఒక నెల అంటే ఏదో టెక్నికల్ కారణాలతో ఆగిపోయిందని అనుకుంటాం. మూడు నెలలుగా అలా చేస్తుంటే మేమంతా ఏమవ్వాలి'' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో వారికి ఆరోగ్యం బాగోకపోతే అప్పులు చేసి వైద్యం అందించాల్సి వస్తోందని, వేతనాల సమస్య తీరితే కాస్త ఉపశమనం దక్కుతుందని ఆశిస్తున్నామని ఆమె అన్నారు.
ప్రణాళిక ఉండాలి కదా: ఏపీ ఎన్జీవో
గతంలో డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు కూడా రెండు, మూడు నెలల వరకూ ఇదే సమస్య ఎదురైందని, ఇతర శాఖల్లో కూడా ఇలాంటి అనుభవాలున్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ''ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చినప్పుడు, వారికి సంబంధించిన జీతాల విషయంలోనూ స్పష్టత ఇవ్వాలి. కానీ, జాయినింగ్ తర్వాత కూడా ట్రెజరీలకు చేరాల్సిన ఆదేశాల్లో నిర్లక్ష్యం చేస్తారు. నెలల తరబడి వారి వేతనాలు పెండింగులో పెడుతుంటారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ వైఖరికి ఇది నిదర్శనం'' అని ఏపీ ఎన్జీవో నాయకుడు విద్యాసాగర్ తెలిపారు.
''కొత్తగా ఉద్యోగంలో చేరడంతో వాళ్లు గట్టిగా అడగలేరు. కొత్త ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ అన్నింటినీ సర్దుకుపోలేక ఇరకాటంలో పడుతుంటారు. దీన్నీ సరిచేయాలి. నిర్లక్ష్యం వీడాలి. ఐసీడీఎస్ సిబ్బంది అందరికీ వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలి'' అని ఆయన డిమాండ్ చేశారు. ఒకే శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు వేతనాలు ఇచ్చి, కొందరికి ఆలస్యం చేయడం కూడా సరికాదని ఆయన అన్నారు. ఐసీడీఎస్ కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుగా ప్రణాళిక వేసినట్టుగానే, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది జీతాల చెల్లింపునకు కూడా ప్రణాళిక ఉండాలి కదా అని ప్రశ్నించారు.
అంగన్‌వాడీ వర్కర్ల పరిస్థితి అంతే..
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వర్కర్లు, హెల్పర్ల వేతనాలు కూడా పెండింగులో ఉన్నాయి. మూడు నెలల బకాయిలకుగాను మే నెలలో ఒక నెల జీతం ప్రభుత్వం విడుదల చేసింది. ''మే 20 నాటికి ఇంకా రెండు నెలల జీతాలు రావాల్సి ఉంది'' అని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్సర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్లకు ఎక్కువగా జీతాలు ఇస్తామన్నారని, అది మరచిపోయారని, కనీసం పెండింగ్ లేకుండా జీతాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయడం లేదని ఆమె చెప్పారు. '' టీఏ బిల్లులు ఏళ్ల తరబడి పెండింగులో పెట్టారు. ఎన్నిమార్లు అడిగినా వాయిదాలు వేయడమే తప్ప అంగన్‌వాడీలకు న్యాయం జరగడం లేదు. సెంటర్ల అద్దెలు, ఇతర బిల్లులు కూడా బకాయిలు పెట్టేస్తున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. ఆవేదన చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు" అని సుబ్బారావమ్మ బీబీసీతో చెప్పారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల మీద పనిభారం పెంచడమే కాకుండా తనిఖీల పేరుతో వేధింపులకు దిగుతున్న వారు, పనిచేసిన దానికి వేతనాలు, బిల్లులు సకాలంలో ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు.
వారంలో పరిష్కారం: అధికారి
ఐసీడీఎస్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న కొందరు కార్యాలయ సిబ్బంది వేతనాల చెల్లింపు విషయంలో సమస్య ఉందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. అయితే, ఈ సమస్య పై స్పందించేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు నిరాకరించారు. "బకాయి పడిన వేతనాలు చెల్లించేలా ఆదేశాలిచ్చాం. డీడీవోలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రాసెస్ పూర్తికాగానే అందరికీ బకాయిలు లేకుండా జీతాలు జమ అవుతాయి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఒకసారి సమస్య పరిష్కారమైతే పెండింగ్ లేకుండా జీతాల చెల్లింపు జరుగుతుంది" అని స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ అధికారి ఒకరు తెలిపారు. సమస్యను అధిగమించే ప్రయత్నం జరుగుతోందని, ఈ వారంలోగా పరిష్కారం అవుతుందని బీబీసీకి చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు కూడా పరిష్కరిస్తున్నామని, వేతనాలు, బిల్లుల చెల్లింపు గతంలో కంటే వేగవంతమైందన్నారు. పెండింగ్ లేకుండా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.