ఆంధ్రప్రదేశ్: రూ. 2.29 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి, మహిళలు, చిన్నారులకు పెద్దపీట
గురువారం, 20 మే 2021 (12:25 IST)
YSRCP
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2021-22ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో మహిళలు, చిన్నారులకు పెద్దపీట వేసినట్లు బుగ్గన తెలిపారు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది మూడోసారి. రూ. 2,29,779.27 కోట్ల విలువైన బడ్జెట్‌ను బుగ్గన ప్రవేశపెట్టారు. గత ఏడాది బడ్జెట్ రూ. 2,24,789.18 కోట్లు కాగా ఈసారి స్వల్పంగా పెరిగింది.
ఎవరెవరికి ఎంతెంత?
2020–21తో పోలిస్తే వెనకబడిన కులాల బడ్జెట్‌లో 32 శాతం అధికంగా కేటాయింపులు (రూ. 28,237 కోట్లు) చేశారు.
ఈబీసీ సంక్షేమంలో 8 శాతం అధిక కేటాయింపులు (రూ. 5,478కోట్లు) చేశారు.
కాపు సంక్షేమం కోసం 7 శాతం అధిక కేటాయింపులు (రూ. 3,306 కోట్లు) చేశారు.
బ్రాహ్మణుల సంక్షేమంలో 189 శాతం అధిక కేటాయింపులు (రూ. 359 కోట్లు) చేశారు.
మైనార్టీ యాక్షన్ ప్లాన్‌కింద రూ. 3,840.72 కోట్లు కేటాయించారు. దీనిలో ఏడు శాతం పెరుగుదల కనిపించింది.
పిల్లలు, చిన్నారుల కోసం బడ్జెట్‌లో రూ. 16,748 కోట్లు కేటాయించారు.
మహిళల అభివృద్ధికి రూ. 47,283.21 కోట్లు కేటాయించారు.
వ్యవసాయ పథకాలకు రూ. 11,210 కోట్లు కేటాయింపులు చేశారు.
విద్యా పథకాలకు రూ. 24,624 కోట్లు కేటాయింపులు చేశారు.
వైద్యం– ఆరోగ్యానికి రూ. 13,830 కోట్లు కేటాయింపులు చేశారు.
డీబీటీ పథకాల వారీగా కేటాయింపులు
వైయస్సార్ పెన్షన్ కానుకకు రూ. 17,000 కోట్లు
వైయస్సార్ రైతు భరోసాకు రూ. 3,845 కోట్లు
జగనన్న విద్యా దీవెనకు రూ. 2500 కోట్లు
జగనన్న వసతి దీవెనకు రూ. 2,223.15 కోట్లు
వైయస్సార్ – పీఎం ఫసల్ బీమా యోజనకు రూ. 1,802 కోట్లు
డ్వాక్రా సంఘాలకు వైయస్సార్ సున్నా వడ్డీ కింద చెల్లింపులకు రూ.865 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు, మొత్తంగా రూ. 1,112 కోట్లు
రైతులకు సున్నా వడ్డీ కింద చెల్లింపులు కోసం రూ. 500 కోట్లు
వైయస్సార్ కాపు నేస్తంకోసం రూ. 500 కోట్లు
వివిధ పథకాల కింద కాపు సామాజికవర్గ సంక్షేమం కోసం రూ. 3,306 కోట్లు
వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి రూ. 1802.82 కోట్లు
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు రూ. 739.46 కోట్లు
వైయస్సార్ పశువుల నష్టపరిహార పథకానికి రూ. 50 కోట్లు
విద్యారంగానికి రూ.24,624.22 కోట్లు
స్కూళ్లలో నాడు–నేడుకు రూ. 3,500 కోట్లు
జగనన్న గోరు ముద్ద కోసం రూ. 1,200కోట్లు
జగనన్న విద్యా కానుక కోసం రూ. 750 కోట్లు
ఉన్నత విద్యకోసం రూ. 1,973 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ. 13,840.44 కోట్లు
డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య శ్రీ, మందుల కొనుగోలు కోసం రూ. 2,248.94 కోట్లు
ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాలకోసం రూ. 1,535 కోట్లు
కోవిడ్‌పై పోరాటానికి రూ. 1000 కోట్లు
ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్ కోసం రూ. 100 కోట్లు
పలాస ఆస్పత్రికి రూ. 50 కోట్లు
హౌసింగ్, మౌలిక సదుపాయాల కోసం మొత్తంగా రూ. 5,661 కోట్లు
పరిశ్రమలకు ఇన్సెంటివ్‌ల కోసం రూ. 1000 కోట్లు
వైయస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ కోసం రూ. 200 కోట్లు
కడప స్టీల్ ప్లాంట్ కోసం రూ. 250 కోట్లు
ఏపీఐఐసీకి రూ. 200 కోట్లు
ఎంఎస్‌ఎంఈల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ . 60.93 కోట్లు
పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ . 3,673.34 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు 2021–22 సంవత్సరంలో రూ. 7,594.6 కోట్లు
ఎనర్జీ రంగానికి రూ. 6,637 కోట్లు
YSRCP
ఒక రోజే సమావేశాలు
కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒక్కరోజు మాత్రమే ఈ సారి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ విధానంలో ప్రసంగించిన అనంతరం రాజేంద్రనాథ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టారు. శాసన మండలిలో బడ్జెట్‌ను హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టారు.
బహిష్కరించిన టీడీపీ
ఈ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ స్పష్టం చేసింది. తూతూమంత్రంగా ఒక్క రోజు జరిపే సమావేశాలకు తాము హాజరుకాలేమని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, శాసనసభ పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీలో మొట్టమొదటిసారిగా మే 20, 21 తేదీలలో డిజిటల్ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నామని చెప్పారు. బీఏసీ సమావేశానికి కూడా టీడీపీ ప్రతినిధులు హాజరుకాలేదు.
గతంలో ఆర్థిక శాఖ అనేవారు ఇప్పుడ అప్పుల శాఖ అంటున్నారు అని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజా బడ్జెట్‌పై విమర్శలు చేశారు. మరోవైపు కరోనావ్యాప్తి నడుమ కేవలం 100 మంది ఎమ్మెల్యేలను మాత్రమే ఈ సమావేశాలకు ఆహ్వానించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడానికి కూడా ఏర్పాట్లు చేశారు.
చివరిసారిగా అసెంబ్లీ సమావేశాలు గతేడాది నవంబరులో జరిగాయి. ప్రస్తుత సమావేశాల్లో ఐదు ఆర్డినెన్సులు కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభ ఓ తీర్మానాన్ని ఆమోదించనుంది.
ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సెల్యూట్: గవర్నర్
కోవిడ్‌ను ఎదుర్కోవడంలో దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి వర్చువల్ విధానంలో గవర్నర్ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదైన రోజుల్ని చూశాం. సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. సెకండ్ వేవ్ ప్రభావం ఏపీలోనూ ఉంది. కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సెల్యూట్. కొత్తగా కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర దేశాల నుంచీ క్రయోజనిక్ ఆక్సిజన్ తెప్పించాం అని గవర్నర్ తెలిపారు