ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం క్రైమ్ క్యాపిటల్‌గా మారుతోందా?

శనివారం, 1 జులై 2023 (20:33 IST)
అమిత్ షా జూన్ 11న విశాఖ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, విశాఖపట్నం విద్రోహులకు అడ్డాగా మారిందని, ప్రశాంత నగరంగా పేరుపొందిన విశాఖలో నేరాలు పెరుగుతున్నాయని సీరియస్ కామెంట్స్ చేశారు. జూన్ 15న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు, భార్య, అతడి ఆడిటర్ జీవీ కిడ్నాప్ గురయ్యారు. కేంద్ర హోం మంత్రి విశాఖలో చేసిన కామెంట్స్ ఇంకా ట్రెండింగ్‌లో ఉండగానే ఎంపీ కుటుంబీకులు కిడ్నాప్ గురికావడంతో అసలు విశాఖలో ఏ స్థాయిలో నేరాలు పెరిగిపోయాయనే చర్చకు తావిచ్చింది. జూన్ 16న ‘అమిత్ షా గారూ...విశాఖను రక్షించండి’ అంటూ విశాఖలోని కొన్ని జంక్షన్లలో జన జాగరణ సమితి పేరిట ఫ్లెక్సీలు కనిపించాయి. విశాఖపట్నంలో భూకబ్జాలు, గంజాయి మాఫియా, కిడ్నాప్‌లు పెరుగుతున్నాయనే అర్థం వచ్చేలా ఆ ఫ్లెక్సీలు ముద్రించారు.
 
‘రియల్ ఎస్టేట్ వివాదాలు, వరుస కిడ్నాప్‌లు’
రాజకీయంగా అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఎన్ని విమర్శలు చేసుకున్నా... ఆ విమర్శల్లో విశాఖ కూడా టార్గెట్ అవుతోంది. ఎందుకంటే విశాఖని పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో విశాఖలో ఏం జరిగినా... అది పతాక స్థాయి వార్తల్లో నిలుస్తోంది. తాజాగా అంటే జూన్ 29న విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపార గొడవల్లో శ్రీనివాస్, లోవలక్ష్మీ అనే దంపతులు కిడ్నాప్‌కు గురయ్యారు. ఎంపీ కుటుంబం కిడ్నాప్‌ను గంటల్లోనే చేధించిన పోలీసులు, రియల్టర్ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన వారిని కూడా గంటల వ్యవధిలోనే పట్టుకుని నలుగురిని అరెస్ట్ చేశారు.
 
ఈ రెండు కిడ్నాపుల్లో కిడ్నాపర్లు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ప్రముఖ రియల్టర్, ఎంపీ అయిన ఎంవీవీ సత్యనారాయణ కుటుంబీకుల కిడ్నాప్ తర్వాత ఎంపీ తాను ఇక విశాఖలో వ్యాపారాలే చేయనని, తన వ్యాపారాల్ని హైదరాబాద్ కేంద్రంగా చేసుకుంటానని ప్రకటించారు. రియల్టర్ కుటుంబీకుల కిడ్నాపులో గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగిన ఆర్థిక లావాదేవీల కారణంగానే భార్యభర్తలను కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. ఈ రెండింటిలోనూ రియల్ ఎస్టేట్ అనేది ప్రధానంగా కనపడుతోంది. విశాఖలో పెరిగిన భూమి ధరలతో పాటు దానికి సంబంధించిన నేరాలు పెరుగుతున్నాయనే విషయం అర్థమవుతోంది.
 
మరో వైపు విశాఖలో దాదాపు ప్రతిరోజూ భూ కబ్జాలు, దానికి సంబంధించి బాధితులు పోలీస్ కేసులు పెట్టడం, దాంతో పాటు పార్టీలకు సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు... వారి అనుచరుల పేర్లు ఈ భూ వివాదాల్లో వినిపిస్తుండటంతో విశాఖలో ఏదో జరుగుతుందనే అందోళన స్థానికుల్లో మొదలైంది.
 
కిడ్నాపులే విశాఖ వాసుల్ని భయపెడుతున్నాయా?
జూన్ నెలలో 15 రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు కిడ్నాపులే విశాఖ వాసుల్ని భయానికి గురి చేస్తున్నాయా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే విశాఖలో గత కొంత కాలంగా రియల్ ఎస్టేట్ వివాదాలు ఎక్కువైపోయాయి. నగరంలో జరిగే చాలా నేరాల్లో ప్రధాన కారణం భూ వివాదామే అవుతోంది.
 
“కొందరు రాజకీయ నాయకులు, బడాబాబులు వివాదాస్పద భూముల విషయంలో తలదూర్చి వాటిని సెటిల్ చేసేందుకు రౌడీషీటర్లు, గ్యాంగులను ప్రొత్సహిస్తున్నారు. వారే తర్వాత రోజుల్లో నేరాలకు పాల్పడితే మళ్లీ ఈ రాజకీయ నాయకులు, పెద్దమనుషులే వారికి రక్షణగా నిలబడుతున్నారు. ఎంపీ కుటుంబీకులను కిడ్నాప్ చేసిన రౌడీషీటర్ హేమంత్ ఏడాది క్రితం భీమిలికి చెందిన ఒక స్థానిక రాజకీయ నాయకుడిని కిడ్నాప్ చేసి రూ. కోటి డిమాండ్ చేశారు. దీనిపై పీఎం పాలెం పీఎస్‌లో కేసు నమోదైంది. అలాగే ఎంపీ కుటుంబీకుల్ని కిడ్నాప్ చేసినప్పుడు ఏకంగా రూ. 50 కోట్లు అడిగినట్లు తెలుస్తోంది” అని బీబీసీతో పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.
 
ఇలా రౌడీ షీటర్లు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేసే వారే కాకుండా రకరకాలైన గ్యాంగుల పేరుతో ప్రజలను భయపట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. వివిధ పేర్లతో ఉన్న ఈ గ్యాంగుల్లో స్థానికులతో పాటు కొన్ని ఇతర రాష్ట్రాలకు చెందినవి కూడా ఉంటున్నాయని చెప్పారు.
 
విశాఖలో రౌడీ గ్యాంగులు
విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం 30 ఏళ్ల క్రితం నుంచే విస్తరిస్తున్నప్పటికీ... 2004-2005 నుంచి మాత్రం పైకి, పైపైకి వెళ్లడం మొదలైంది. కరోనా సమయంలో కూడా విశాఖ రియల్ ఎస్టేట్ రంగానికి ఎదురులేకుండా పోయిందనే విషయాన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో జరిగిన రిజిస్ట్రేషన్లు చెప్తున్నాయి. దాంతో పాటు విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో మరోసారి భూముల ధరలు మరింతగా పెరిగాయి. దాంతో రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన సెటిల్మెంట్లు, వివాదాలు, కబ్జాలు కూడా మొదలయ్యాయి. ఇవే కిడ్నాపులు, హత్యలు, బెదిరింపులు వంటి నేరాలకు దారి తీస్తున్నాయి.
 
హైపర్ బాయ్స్, దండుపాళ్యం, త్రీస్టార్ గ్యాంగ్, ఖాసీం గ్యాంగ్, చిట్టిమామూ గ్యాంగ్ అంటూ వివిధ పేర్లతో ఉన్న గ్యాంగులు నేరాలకు పాల్పడుతున్నాయి. వీటిలో హైపర్ బాయ్స్ అనే గ్యాంగ్ సోషల్ మీడియాలో కత్తులు పట్టుకొని ఉన్న తమ ఫోటోలు పెట్టుకుని మరీ ప్రచారం చేసుకుంటుందని, ఆ గ్యాంగ్‌ని పట్టుకున్నప్పటీ సీపీ సీహెచ్ శ్రీకాంత్ చెప్పారు. చాలా మంది గ్యాంగులుగా ఏర్పడి బెదిరింది డబ్బులు తీసుక్కోవడం, ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడం చేస్తున్నారనే విషయం ఆయా గ్యాంగులు పట్టుబడినప్పుడు పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం అర్థమవుతోంది.
 
“బీహార్ చైన్ స్నాచర్స్, వెస్ట్ బెంగాల్ ఫేక్ నోట్ ముఠా, ఒడిశా హౌస్ బ్రేకర్స్, జార్ఖండ్ కిడ్నాపర్స్, కర్ణాటక హిట్ మేన్స్, హర్యానా గ్యాంగ్, ఒడిశా గ్రూప్స్ వంటి పేర్లతో నేరాలకు పాల్పడుతున్నారు. వీరంతా ఉపాధి, ఉద్యోగాల కోసం వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వచ్చిన వారే. వీరి వద్ద సరైన ధ్రువపత్రాలు ఉండకపోవడంతో వీరిని పట్టుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వీరిలో ఎక్కువ మంది గంజాయి వ్యాపారం చేస్తుంటారు. ఆ మత్తులోనే నేరాలకు పాల్పడుతుంటారు” అని ఒక పోలీస్ అధికారి చెప్పారు.
 
‘లెక్కల్లో తగ్గుతున్న నేరాలు’
విశాఖలో ఏ నేరం జరిగినా అది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అలాగని నేరాలు తక్కువ జరిగితే ఎక్కువగా చెప్పుకుంటారని కాదు. కానీ, చర్చ జరిగే తీవ్రత ఎక్కువ ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే విశాఖలో హత్యలు నుంచి వైట్ కాలర్ నేరాలు వరకు అన్ని జరుగుతూనే ఉన్నాయి. కానీ పోలీసు లెక్కలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
 
విశాఖ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 2022లో విశాఖలో హత్య, రేప్, బెదిరింపులు ఇలాంటి మొత్తం నేరాలు 10,834 నమోదయ్యాయి. వీటికి అదనంగా సైబర్ నేరాలు 316 కేసులు రిజిస్టర్ అయ్యాయి. కానీ 2021లో మొత్తం నేరాలు సైబర్ క్రైంతో కలిపి 14,925 నేరాలు నమోదవ్వగా... అందులో సైబర్ నేరాలు 610 ఉన్నాయి. అంటే 2021 కంటే 2022లో సైబర్ నేరాలు పెరగ్గా, హత్యలు వంటి ఇతర నేరాల సంఖ్య తగ్గిందని పోలీసు రికార్డులు చెప్తున్నాయి. అంటే నేరగాళ్లు టెక్నాలజీ వైపు మళ్లుతున్నారనే విషయం అర్థమవుతోంది.
 
ఇక ప్రత్యేకంగా ప్రశాంత నగరంగా పేరు పొందిన విశాఖలో హత్యల విషయానికి వస్తే సగటున నెలకు మూడు జరుగుతున్నాయనే విషయం పోలీసులు చెప్తున్న లెక్కల ప్రకారం తెలుస్తోంది. 2021లో విశాఖలో 37 హత్యలు చోటుచేసుకోగా, 2022లో 38 హత్యలు జరిగాయి. ఈ ఏడాది అంటే 2023 జనవరి నుంచి జూన్ వరకు అంటే ఆరు నెలల వ్యవధిలో 15 జరిగాయని పోలీసు లెక్కలు చెప్తున్నాయి. దీంతో పాటు 2023లో నగరంలో పెరుగుతున్న గన్ లైసెన్స్ దరఖాస్తుల సంఖ్య కూడా అందోళనకు గురి చేసే అంశమే.
 
‘పెరుగుతున్న గన్ లైసెన్స్ దరఖాస్తులు’
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు, భార్య కిడ్నాప్ తర్వాత ఎంపీ కుమారుడు గన్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో మంత్రి హోదాలో ఉన్న గుడివాడ అమర్నాథ్‌కు ప్రభుత్వం ఇచ్చే గన్ మెన్లు ఉన్నప్పటికీ వ్యక్తిగత భద్రత పేరుతో గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. వరుస కిడ్నాపులు నేపథ్యంలో చాలా మంది నగర ప్రముఖులు గన్ లైనెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు ఒక్కసారిగా పెరిగాయి. దీనిపై నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ క్లారిటీ ఇచ్చారు.
 
“ఇప్పటివరకు విశాఖలో అధికారికంగా లైసెన్స్ ఉన్న గన్స్ 620 ఉన్నాయి. 2020, 2021, 2022లో మొత్తం 5 మంది గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే 2023లో అంటే గడిచిన ఆరు నెలల్లో గన్ లైసెన్స్ కోసం 10 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 3 సీఆర్ఫీఎఫ్, 1 ఎక్స్ సర్వీస్ మెన్, 2 స్పోర్ట్స్ పర్సన్స్, మరో నలుగురు సెల్ఫ్ డిఫెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో తాజాగా కిడ్నాప్ కు గురైన ఎంపీ కుటుంబ సభ్యులు ఇద్దరు ఉన్నారు. అంటే 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం 15 దరఖాస్తులే గన్ లైసెన్స్ కోసం వచ్చాయి” అని సీపీ త్రివిక్రమ్ వర్మ చెప్పారు. మంత్రి అమర్నాధ్ గతంలో అంటే 2020లోనే గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్నారని సీపీ తెలిపారు.
 
“ప్రాణ భయమున్న ఎవరైనా గన్ లైసెన్స్ కు నగర సీపీ కార్యాలయంలో కానీ, కలెక్టర్ కార్యాలయంలో కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. అలా వచ్చిన దరఖాస్తులను స్పెషల్ బ్రాంచ్ ద్వారా విచారణ చేయించి, వారికి అవసరమనుకుంటేనే, అటువంటి దరఖాస్తులను గుర్తించి వాటిని డీజీపీ కార్యాలయానికి పంపుతాం. అక్కడ మరోసారి విచారణ జరిపిన తర్వాత అవసరమని గుర్తిస్తేనే దరఖాస్తుదారుడికి గన్ లైసెన్స్ మంజూరు చేస్తారు” అని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.
 
‘సమాజంపై ప్రభావం చూపుతాయి’
విశాఖ నగరంలో క్రమంగా నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. దేశ హోం మంత్రి విశాఖపై అంత సీరియస్ కామెంట్లు చేశారంటేనే ఇక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చునంటూ జాన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు బీబీసీతో అన్నారు. గంజాయి, భూ కబ్జా నేరాలు విశాఖలో ప్రతి రోజూ వింటూనే ఉంటామని ఆయన అన్నారు. “విశాఖలో క్రిమినల్ గ్యాంగ్స్ ఒకప్పుడు ఒకటో, రెండో ఉండేవి. అవి కూడా నగరంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. కానీ ప్రస్తుతం క్రిమినల్ గ్యాంగ్స్ అంటూ... అది కూడా ఒక స్టేటస్‌లా ఫీలై మరీ నేరాలు చేస్తున్న వారు పెరిగిపోతున్నారంటేనే అందోళన కలుగుతుంది” అని వాసు అన్నారు.
 
“ఏ సమాజంలోనైనా నేరాలు పెరగడం మంచిది కాదు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో సరికొత్త నేరాల్ని చూడాల్సి వస్తుంది. వాటిని చేధించేందుకు పోలీసులు కూడా కొత్త పంథాలను పాటించాల్సి వస్తుంది. ఏదైనా నేరం జరిగితే అది ఆ కుటుంబానికో, ఆ కాలనీకో పరిమితం కాదు. అది కచ్చితంగా సమాజంపై ప్రభావం చూపుతుంది. అది కూడా చెడు చేసే దిశగానే ఉంటుంది. అందుకే నేరాల నియంత్రణ అనేది ఏ ప్రభుత్వమైనా తప్పనిసరిగా చేయాల్సిందే” అని ఏయూ సోషల్ సైన్స్సెస్ రిటైర్డ్ ప్రొఫెసర్ దేవిప్రసాద్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు