బీబీసీ 100 మంది మహిళలు: అత్యాచార బాధితులకు న్యాయం దొరుకుతుందా... మూడు కేసుల్లో ఏం జరిగింది?

శుక్రవారం, 27 నవంబరు 2020 (22:19 IST)
భారతదేశంలో కొన్ని రేప్ కేసులు భయంకరంగా ఉంటాయి. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మీడియాలో చర్చనీయాంశాలవుతాయి. 2012లో దిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగిన తరువాత చట్టాలను కఠినతరం చేశారు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌లలో నమోదయ్యే కేసుల సంఖ్య కూడా పెరిగింది. మహిళలపై లైంగిక హింస మీద పెరుగుతున్న చర్చ దీనికి ఒక కారణం. అందుకే, చాలామంది నిపుణులు చట్టాలలో ఇంకా మార్పులు, సంస్కరణలు అవసరం అంటున్నారు.

 
ప్రభుత్వం మరణశిక్షలాంటి కఠినమైన చట్టాలను కూడా తీసుకువచ్చింది. కానీ, కొంతమంది విశ్లేషకుల ప్రకారం ఇటువంటివి అప్పటికి ఆగ్రహంలో ఉన్న ప్రజలను శాంతపరచడానికి తప్ప అసలు మూలాలను కనుక్కుని పరిష్కరించడంలో ఉపయోగపడవు. బీబీసీ 100మంది మహిళలు సిరీస్‌లో భాగంగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న ముగ్గురు మహిళల కథలు తెలుసుకుందాం.

 
“మేం బతికి ఉన్నప్పుడే న్యాయం జరగాలని మా కోరిక’’
ఇవాళ ఈ గ్రామానికి దేశవ్యాప్త గుర్తింపు ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉరి వేసుకుని మరణించారు. పన్నెండు, పదిహేనేళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలు ఈ ఊళ్లో ఉన్న ఓ మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించారు. వారిద్దరినీ అత్యాచారం చేసి హత్య చేశారని వారి కుటుంబాలు ఆరోపించాయి.

 
2012 దిల్లీ నిర్భయ రేప్ ఘటన తర్వాత ఇదే అతి పెద్ద అత్యాచారం కేసు. ఈ సంఘటన జరిగి ఇప్పటి ఆరు సంవత్సరాలైంది. కానీ అది నిన్న మొన్న జరిగినట్లుగానే అనిపిస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్‌ జిల్లాలో ఇరుకైన దారుల గుండా మేం ఆ గ్రామానికి వెళుతూ ఆ ఊరి పేరు అడగ్గానే అందరూ గుర్తు పట్టారు. దారి చూపించారు.

 
బదౌన్‌లోని ఆ కుటుంబాలు చేస్తున్న పోరాటాలు చిన్నవి కాదు. 2014 వేసవిలో నేను వారిని కలుసుకున్నా. దిల్లీ నుంచి 8 గంటలు ప్రయాణించి మొదటిసారి అక్కడికి చేరుకున్న రిపోర్టర్ల టీమ్‌లో నేను కూడా ఉన్నాను. ఉరి వేసుకున్న అమ్మాయిలలో ఒకరి తండ్రి ఆ చెట్టు కిందే నిలబడి నాతో మాట్లాడారు. స్థానిక పోలీసుల సహకారం లేకపోవడం వల్ల న్యాయం జరగదన్న ఆందోళన కలుగుతోందని ఆయన చెప్పారు.

 
కానీ ఆయనలో ప్రతీకార వాంఛ, ఆగ్రహం కూడా కనిపించాయి. “ మా అమ్మాయిని చంపిన వారిని అదే విధంగా ఉరి తీసి చంపాలి’’ అన్నారాయన. చట్టాలను కఠినతరం చేయడం వెనక ఉద్దేశం బాధితులు ఫిర్యాదు చేయడానికి భయం లేకుండా చేయడం ఒకటి. అత్యాచారం కేసులకు వేసే శిక్షల్లో మరణ శిక్షను కూడా చేర్చారు. కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ నిబంధనల్లో ఒకటి- మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగినప్పుడు దాని విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలి. కానీ ఈ నిబంధన పెట్టిన తర్వాత కూడా పెండింగ్‌లో ఉన్న అత్యాచార కేసుల సంఖ్య నిరంతరం పెరిగిపోతూనే ఉంది.

 
ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారం 2013 చివరి నాటికి, పెండింగ్‌లో ఉన్న అత్యాచారం కేసుల సంఖ్య 95వేలు. 2019 చివరి నాటికి ఇది 1 లక్ష 45 వేలకు పెరిగింది.

 
బాధితులకు న్యాయం ఎప్పుడు అందుతుంది?
బదౌన్‌లో మేం మళ్లీ ఆ చెట్టు దగ్గరి వెళ్లాలని అనుకున్నాం. కానీ ఆ అమ్మాయి తండ్రి కళ్లు వాలిపోయి ఉన్నాయి. పాత జ్జాపకాలు తనను బాధిస్తాయని ఆయన చెప్పారు. సంఘటన జరిగి ఆరు సంవత్సరాలే అయ్యింది. కానీ ఆయన వయసు చాలా సంవత్సరాలు పెరిగిపోయినట్లు కనిపించింది.

 
అయితే ఆయనలో ఆగ్రహం మాత్రం చల్లార లేదు. ఈ న్యాయ పోరాటం మరింత కాలం సాగించాలన్న నిజం మాత్రం ఆయనకు తెలిసినట్లే ఉంది. “నిబంధనల ప్రకారం కేసులను త్వరగా విచారించాలి. కానీ మా పిటిషన్లను కోర్టులు పట్టించుకుంటున్నట్లు లేదు. నేను న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నాను. కానీ పేదలకు న్యాయం అందదని అనిపిస్తోంది’’ అన్నారాయన.

 
బాలికలను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తగిన సాక్ష్యాధారాలు చూపించలేకపోయారు. దీంతో నిందితులు జైలు నుంచి విడుదలయ్యారు. దీనిని ఆ కుటుంబం మళ్లీ కోర్టులో సవాల్ చేయగా, మళ్లీ విచారించారు. అయితే ఈసారి అధికారులు ఆ కేసులో తీవ్రతను తగ్గించి అత్యాచారం, కిడ్నాప్‌లాంటి సెక్షన్ల కిందకు మార్చారు. వీటిని సవాల్‌ చేస్తూ కోర్టుకెళ్లిన బాలికల కుటుంబాలు అత్యాచారం, హత్య ఆరోపణలు చేశాయి.

 
భారత న్యాయ వ్యవస్థలో వనరులు, సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. బదౌన్‌ కేసు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. కానీ బాధితులకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదని వారి తరఫు న్యాయవాది జ్జాన్‌ సింగ్‌ అన్నారు.

 
“ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు వేగంగా విచారించడానికి ప్రయత్నిస్తుంది. కానీ కొన్నిసార్లు ఫోరెన్సిక్‌తోపాటు కొన్ని నివేదికలు రావడం ఆలస్యం అవుతుంది. వైద్యులు,దర్యాప్తు అధికారుల బదిలీ మీద వెళుతుంటారు. సాక్షులు మాట మారిస్తే కూడా ఆలస్యమవుతుంది " అన్నారు జ్జాన్ సింగ్. 
బదౌన్‌లోని బాధితుల ఇంట్లో పేపర్లు కుప్పలగా పేరుకుపోయాయి. చనిపోయిన అమ్మాయిలలో ఒక బాలిక తల్లి ఈ యుద్ధంలో పోరాడి పోరాడి అలసిపోయారు. నేను బాలిక ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ఆ తండ్రి అన్న మాటలను నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. “మేం బతికి ఉండగానే మాకు న్యాయం జరగాలన్నది మా కోరిక .’’

 
“నన్ను రేప్‌ చేశాడని నా బాయ్‌ ఫ్రెండ్‌ను జైలుకు పంపారు”
స్థానికంగా నివసించే ఓ అబ్బాయితో తన ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసేనాటికి ఉష (పేరు మార్చాం) వయసు 17 సంవత్సరాలు. గుజరాత్‌ పంచమహల్ జిల్లాలోని చిన్న గ్రామంలో ఇలాంటివి కొత్త కాదు. కానీ ఉష తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించ లేదు. 
పెద్దవాళ్లు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పారిపోవాలని ఆ ప్రేమ జంట నిర్ణయించుకుంది. దూరంగా వెళ్లిపోయి కొన్నిరోజులు స్వేచ్ఛగా ఉండగలిగారు. వారెక్కడున్నారో గుర్తించి ఉష తండ్రి ఇద్దరినీ ఊరికి తీసుకువచ్చారు.

 
"నన్ను తీవ్రంగా కొట్టారు. తర్వాత మరొక వ్యక్తికి లక్షా పాతిక వేల రూపాయలకు నన్ను అమ్మేశారు" అని ఉష అన్నారు. అయితే, పెళ్లి రోజు రాత్రి ఆ ఇంటి నుంచి తప్పించుకుని తిరిగి ప్రేమికుడి దగ్గరకు వచ్చారు ఉష. తర్వాత ఆ జంట వివాహం చేసుకున్నారు. ఆమె గర్భవతి కూడా అయ్యింది. అయితే ఈ కథలో మరో ట్విస్ట్‌ కూడా వచ్చింది.

 
మారిన చట్టాల ప్రకారం అమ్మాయిలను సెక్స్‌కు అనుమతించే వయసును 16 నుంచి 18 సంవత్సరాలకు పెంచారు. ఈ పరిస్థితిలో ఉష తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ చట్టం దృష్టిలో ఆమె శృంగారానికి అనుమతించే వయసు కాదు. చట్టంలోని ఈ నిబంధనను చూపి ఉష తల్లిదండ్రులు ఆ యువకుడు తమ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ కేసు పెట్టారు. దీంతో అతను జైలుకు వెళ్లాల్సి వచ్చింది. యువకుడి కుటుంబంపై కూడా కిడ్నాప్‌ కేసు పెట్టారు.

 
“మేం రెండువారాలు జైల్లో ఉన్నాం. అమ్మాయి బంధువులు మా ఇంటిని ధ్వంసం చేశారు. మా పశువులను తోలుకు పోయారు. ప్రాణాలు కాపాడటానికి దాక్కోవాల్సి వచ్చింది’’ అని యువకుడి తల్లి అన్నారు. ఉష భర్తపై నమోదైనది తప్పుడు కేసు. ఉషలాంటి వారిని రక్షించాల్సిన పని చట్టానిది.

 
పెరుగుతున్న చట్ట దుర్వినియోగం
కానీ, ఇలా ఎన్ని తప్పుడు కేసులు కోర్టులకు వస్తున్నాయో లెక్కలేదని, వీటివల్ల న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని న్యాయవాదులు అంటున్నారు. అయితే కొన్నిచట్టాలను మార్చలేమన్న నిజాన్ని ఇలాంటి కేసులు వెల్లడిస్తాయని కూడా నిపుణులు చెబుతున్నారు.

 
గరిమా జైన్‌ నెదర్లాండ్స్‌లోని టిల్బర్గ్‌ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ విక్టిమాలజీ ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్నారు. తన పరిశోధన కోసం ఆమె అత్యాచార బాధితుల మనస్తత్వాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఏ స్త్రీ అయినా తన తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్లిపోవాలని కోరుకోదు. ముఖ్యంగా మైనర్లు, ఆర్ధికంగా కుటుంబం మీద ఆధారపడిన వాళ్లు ఆ పని చేయలేరంటారు గరిమ.

 
“తాను ప్రేమించిన వ్యక్తిని జైలుకు పంపినప్పుడు వారిద్దరి మధ్య అనుబంధం తెగిపోవడమే కాక, ఆ అమ్మాయి షాక్‌కు గురవుతుంది. ఫలితంగా అలాంటి వారిపై తల్లిదండ్రుల నియంత్రణ మరింత పెరుగుతుంది" అన్నారు గరిమా జైన్‌. ఈ పరిస్థితుల్లో ఉషాకు ‘ఆనందీ’ అనే స్వచ్ఛంద సంస్థ సహాయం చేసింది. దీంతో ఆమె తన భర్త కుటుంబాన్ని జైలు నుంచి బైటికి తీసుకు రాగలిగింది. ఉష తనకు 18 ఏళ్లు నిండిన వెంటనే తల్లిదండ్రులపై మానవ అక్రమ రవాణా కేసు పెట్టారు. “మహిళలు తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోగలిగితే ప్రపంచం సంతోషంగా ఉంటుంది" అంటారు ఉష.

 
కానీ, దురదృష్టవశాత్తు అమ్మాయిలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నప్పుడు తల్లిదండ్రులు వారిని ఆపడానికి తమ శక్తి మేర ప్రయత్నిస్తారు. ఒక దశలో ‘ఆనందీ’ స్వచ్ఛంద సంస్థపై అక్రమ రవాణా కేసు పెడతామని ఉష తల్లిదండ్రులు బెదిరించారు. గ్రామీణ ప్రాంతాలలో చట్టాలను తప్పుగా ఉపయోగించుకోవడం కనిపిస్తుంది. 2013, 2014, 2015 సంవత్సరాలలో ‘ఆనందీ’ సంస్థ జరిపిన ప్రాథమిక అధ్యయనాల్లో 95శాతం మంది తల్లిదండ్రులు ఇలాంటి కేసులు పెడుతున్నారని తేలింది.

 
“చట్టాన్ని సరిగ్గా ఉపయోగించడం లేదని అర్ధమవుతుంది. ఇక్కడ మహిళలను వస్తువులుగా చూస్తారు. వారికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదు’’ అని ‘ఆనందీ’ సామాజిక సంస్థకు చెందిన సీమా షా అన్నారు.

 
“న్యాయశాస్త్రం చదివి నాలాంటి దళిత మహిళల కోసం పోరాడతా’’
మాయా పెదవులుపై చిరునవ్వు కళ్ల దాకా చేరదు. ఆమె తనలోని బాధను దాచుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. తాను ఇంజినీర్‌ కావాలని కలలుగంటున్న రోజుల్లో ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి ఆమె వెంటపడ్డారు. నువ్వు నన్ను కాదంటే బతకనంటూ ఆ వ్యక్తి మాయా ఉందే చేతిని కూడా కత్తితో కోసుకున్నారు. చివరికి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

 
"అతను చాలా బలంగా, బరువుగా ఉన్నాడు. నేను చాలా ప్రయత్నించాను. కానీ, అతనిని ఆపలేకపోయాను" అన్నారు మాయా. మాయా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాని ఆ వ్యక్తి పెళ్లికి ప్రతిపాదించడంతో సమాజం ఒత్తిడితో ఆ కుటుంబం కేసును ఉపసంహరించుకుంది. అత్యాచారం బాధితురాలు అనే 'కళంకం' నుండి తన కుమార్తెను రక్షించాడని ఆమె తల్లిదండ్రులు సంతోషించారు. కానీ ఆ వివాహం ఆమెకు మరో నరకాన్ని సృష్టించింది.

 
“నా భర్త కుటుంబ సభ్యులు నన్ను ఈసడించుకునేవారు. నువ్వు దళితురాలివి, నీ ముఖం చూడటం కూడా మాకు ఇష్టం లేదనేవారు’’ అంటూ తానుపడ్డ బాధలను వివరించారు మాయా.
"ఆయన తాగి ఇంటికి వచ్చేవారు. నా మీద కేసు పెడతావా అంటూ నన్ను తీవ్రంగా దూషించే వారు. నాకు ఇష్టం లేకపోయినా అసహజమైన సెక్స్‌ కోరికలు తీర్చుకోవడానికి బలవంత పెట్టేవారు" అని వెల్లడించారు మాయా.

 
ఆమె ఒక దశలో చాలా నిస్సహాయగా మారారు. ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ ఒక రోజు భర్త తలుపు తీసి బయటకు వెళ్లడంతో ఆ ఇంటి నుంచి పారిపోయి వచ్చారు.

 
చట్టాలకు దూరంగా దళితులు
ఆ తర్వాత మాయా దళిత న్యాయవాది, సామాజిక కార్యకర్త మనీషా మషాల్‌ను కలిసినప్పుడు ఆమె తనకున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువను గుర్తించారు. మనీషా హరియాణాలో దళిత మహిళలపై అత్యాచారం కేసులను అధ్యయనం చేశారు. కులం, లైంగిక హింసల నిర్మూలనకు రూపొందించిన చట్టాలు ప్రభావవంతంగా లేవని ఆమె గుర్తించారు. ఈ చట్టాల గురించి దళిత మహిళలకు తెలియకపోవడం ప్రధాన కారణం.

 
పైగా నిందితులు బాధితులకన్నా ఉన్నతమైన ఆర్ధిక, రాజకీయ, సామాజిక నేపథ్యాన్ని కలిగి ఉంటారని మనీషా అంటారు. పోలీసు, న్యాయవ్యవస్థలో కూడా కుల అసమానతలు ఉన్నాయని, ఇవి బాధితులకు న్యాయాన్ని అడ్డుకుంటున్నాయని అంటారామె. ఇవన్నీ పోవాలంటే దళిత మహిళలు సాధికారత సాధించాలని మనీషా అంటున్నారు. అందుకే ఆమె మాయాలాంటి బాధితులు న్యాయశాస్త్రం చదవడంలో మనీషా సాయ పడుతున్నారు.

 
కొత్త జీవితంలోకి ప్రవేశించడానికి న్యాయశాస్త్రం మాయాకు బాగా ఉపయోగపడింది. ఒకప్పుడు చనిపోవాలనుకున్న ఆమెకు ఒక లక్ష్యం ఏర్పడింది. తనపై అత్యాచారం కేసును మళ్లీ ఓపెన్‌ చేయించారు. అందులో అసహజమైన లైంగిక ఆరోపణలను చేర్చారామె.

 
"మనీషా అక్కను కలిశాక నా గొంతు వినిపించడానికి, జీవితంపట్ల సానుకూల దృక్పథం ఏర్పరుచుకోవడానికి నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది'' అన్నారు మాయా. “ఈ దారుణాలు చూశాక మౌనంగా ఉండకుండా, నాలాంటి దళితులైన బాధితుల తరఫున పోరాటానికి నేను చట్టాలను చదవాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు మాయా.

 
మనీషాతో కలిసి ఉంటున్న అత్యాచార బాధితుల్లో మాయా ఒకరు. " దళిత మహిళలను ఉన్నత కులాలవాళ్లు వస్తువులుగా చూస్తారు. వారిని తమకు ఇష్టంవచ్చినట్లు వాడుకోవచ్చు, లేదంటే పడేయవచ్చు అనుకుంటారు. దీన్ని వ్యతిరేకించిన వారిని చంపేస్తారు’’ అన్నారు మనీషా.

 
దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మనీషాకు నిత్యం బెదిరింపులు వస్తుంటాయి. కానీ వాటికి ఆమె భయపడరు. ఆమె దళిత సమాజంలో హక్కుల ప్రతినిధిగా మారారు. చట్టానికి, దళిత మహిళలకు ఆమె వారధిగా వ్యవహరిస్తున్నారు.

 
(గమనిక: భారతీయ చట్టాల ప్రకారం అత్యాచార బాధితుల పేర్లను మార్చి రాశాం.)
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 100మంది ప్రభావవంతమైన, ఉత్తేజకరమైన మహిళల జాబితాను బీబీసీ మీ ముందుకు తెస్తుంది. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో #BBC100Womenను ఉపయోగించి వీరి గురించి తెలుసుకోండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు