భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు? చరిత్ర ఏం చెబుతోంది?

గురువారం, 3 డిశెంబరు 2020 (14:13 IST)
అది రాజుల కాలం. హైదరాబాద్ నగరంలో చార్మినార్ దగ్గర కాపలాదారులు ఉన్నారు. అప్పుడే లక్ష్మీదేవి నడుచుకుంటూ అక్కడికి వచ్చింది. కాపలాదారులు అడ్డగించారు. దేవి తన గురించి చెప్పగా, ఆమెను లోపలికి రానివ్వడానికి అనుమతి కోసం రాజు దగ్గరకు వెళ్లారు. తాము వచ్చే వరకూ అక్కడే ఉండాలని సూచించారు. వారు తిరిగి వచ్చే వరకూ అక్కడే ఉంటానని మాటిచ్చింది అమ్మవారు. వెళ్లిన కాపలాదారులు గోల్కొండ ప్రభువులకు లక్ష్మీదేవి రాక గురించి చెప్పారు.

 
తమ రాజ్యానికి వచ్చింది సాక్షాత్తు లక్ష్మీదేవి అని గుర్తించిన ప్రభువులు, ఆమె తిరిగి వెళ్లిపోతే రాజ్యంలో సిరిసంపదలు మాయం అవుతాయని ఆలోచించి, ఆమెను తిరిగి వెనక్కు పంపకుండా ఉపాయం ఆలోచించారు. ఆ కబురు తెచ్చిన కాపలదారులు వెనక్కి వచ్చే వరకూ దేవి అక్కడే ఉంటానని మాటిచ్చింది కాబట్టి, వారిని వెనక్కి పంపకుండా ఆపేశాడు రాజు. దీంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంది దేవి. ఇది హైదరాబాద్‌లోని చార్మినార్‌ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయంలోని అమ్మవారి గురించి ప్రాచుర్యంలో ఉన్న కథల్లో ఒకటి.

 
ఇలా జరిగింది అనడానికి ఆధారాలు లేకపోవచ్చు. కానీ, ప్రస్తుతం అక్కడ గుడి, అందులో విగ్రహం కనిపిస్తున్నాయి. మరి ఆ గుడి ఎప్పుడు వెలసింది? విగ్రహం ఎప్పుడు పెట్టారు? భారత హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆ గుడికి వెళ్లడం, ఆమె పేరునే భాగ్యనగరం అనే పేరు వచ్చిందన్న బీజేపీ వాదన నడుమ గుడి చరిత్రపై ఆసక్తి నెలకొంది. ఆ గుడి ఎప్పటిది అన్న ప్రశ్నకు సమాధానంగా కొన్ని పాత ఫోటోలను పరిశీలిద్దాం.

 
ఫోటో - 1: 'ఈ ఫోటో హైదరాబాద్ - ఎ సావనీర్' పుస్తకంలోనిది. ఈ కాపీ 1944లో ప్రచురించారు. అప్పటి హైదరాబాద్ రాజ్యంలోని పలు హిందూ దేవాలయాలను కూడా ఆ పుస్తకం ప్రస్తావించింది. కానీ, చార్మినార్ ఫోటోల్లో మాత్రం ఆ గుడి కనపడలేదు. ఈ సావనీర్‌ను మొదట 1922లో అప్పటి వేల్స్ యువరాజు హైదరాబాద్ పర్యటన సందర్భంగా, ఆయనకు హైదరాబాద్ చరిత్ర చెప్పడం కోసం ప్రచురించగా, 1944లో మళ్లీ ముద్రించారు. ఈ కింది చార్మినార్ ఫోటో ఆ పుస్తకం 1944 ముద్రణలోనిది. ఇక్కడ ఏ గుడీ లేకపోవడం కనిపిస్తోంది

 
ఫోటో - 2: ఈ ఫోటో ఉర్దూ దినపత్రిక 'సియాసత్' కార్యాలయం లోనిది. ఈ ఫోటోను రాజా దీన్ దయాళ్ తీశారని కొందరు చరిత్రకారులు.. ఆయన మనుమడు అమిచంద్ దయాళ్ తీశారని మరికొందరు చరిత్రకారులు చెబుతారు. ఆ ఇద్దరూ హైదరాబాద్ కట్టడాలను పలు ఫోటోలు తీసిన వారే. ఈ ఫోటోలో కూడా చార్మినార్ దగ్గర ఆ గుడి లేదు. కేవలం ఆ ప్రాంతంలో ఒక తెల్లకారు పార్క్ చేసి ఉంది. ఈ ఫోటోను చూసి కొందరు పెయింటింగ్ కావచ్చని అభ్యంతరం చెప్పారు. వీటిని ఫోటో పెయింటింగ్ అంటారు. అంటే కలర్ ఫోటో రాక ముందు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసి, వాటిని ప్రింట్ చేసిన తరువాత కొన్ని రంగులు అద్దేవారు. ఈ ఫోటో అలా చేసినది.

 
ఈ ఫోటోనే 2012 నవంబరులో భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర వివాదం ఏర్పడినప్పుడు ''ది హిందూ'' పత్రిక ప్రచురించింది. గుడి లేకముందూ, గుడి వచ్చిన తరువాతా ఫోటోలను హిందూ పత్రిక పక్కపక్కనే అచ్చు వేసింది. అయితే, ఈ ఫోటోను పలువురు ప్రశ్నించగా, అప్పుడు హిందూ పత్రిక మరిన్ని ఫోటోలు బయట పెట్టింది. గుడి లేని మరో బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ప్రచురించింది. అంతేకాదు, ది హిందూ పత్రిక వద్ద ఉన్న పాత ఫోటోల్లో 1957, 1962లలో తీసిన వాటిల్లో గుడి లేదనీ, 1990, 1994లలో తీసిన వాటిల్లో గుడి ఉందనీ తన పత్రికలో రాసింది.

 
ఈ ఫోటోనే కాదు, 60లకు ముందు తీసిన పలు ఫోటోల్లో, వీడియోల్లో చార్మినార్ దగ్గర ఆ గుడి లేకపోవడం కనిపిస్తుంది. కాసేపు ఫోటోల సంగతి పక్కన పెడదాం. అసలు ఈ గుడి గురించి చరిత్రలో ఎక్కడ నమోదు అయింది? ఈ గుడి గురించి ఏ చరిత్ర పుస్తకాల్లోనూ ప్రస్తావన లేదు. సాధారణంగా హిందూ దేవాలయాలకు దాన శాసనాలు ఉంటాయి. అంటే గుడి కట్టించిన వారో, లేకపోతే ఆ తరువాత ఎవరైనా ప్రముఖులు ఆ గుడి నిర్వహణ కోసం మాణ్యం (భూమిని విరాళంగా ఇవ్వడం) ఇస్తారు. ఆ భూమిపై వచ్చే ఆదాయంతో పూజలకు ఏర్పాట్లు చేస్తారు. కానీ, భాగ్యలక్ష్మి దేవాలయానికి సంబంధించి అటువంటి శాసనాలు లభించలేదు.

 
మరైతే గుడి ఎప్పుడు కట్టారన్న ప్రశ్నకు సమాధానంగా 1967 అని చెబుతున్నారు పలువురు హైదరాబాదీలు. చరిత్ర, సాహిత్యం గురించి అధ్యయనం చేసే పలువురు హైదరాబాదీలను బీబీసీ అడిగినప్పుడు అందరి సమాధానం ఇదే. 1967కి ముందు అక్కడ గుడి లేదని చెప్పారు.

 
ప్రస్తుతం 80 ఏళ్ల వయసులో ఉన్న హైదరాబాద్ పాత బస్తీకి చెందిన సాహితీవేత్త ఔదేష్ రాణి బీబీసీతో మాట్లాడారు. ఆమె ఉర్దూ సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. ''మేం చూసినప్పుడు, మొదట్లో, అంటే 1955-56లలో చార్మినార్ చుట్టూ చాలా లావుగా ఉండే ఇనుప గొలుసు ఉండేది. క్రమంగా అది కనుమరుగు అయిపోయింది. అందులో చిన్న ముక్క అమ్మినా బోలెడు డబ్బు వచ్చేది. అలా జనం కొందరు ఇనుప తాడు దొంగిలించేవారు. అప్పుడు అక్కడ ఒక మైలురాయి ఉండేది. హైదరాబాద్ జీరో మైలు రాయి అది. 1967లో ఒక బస్సు డ్రైవర్ ఆ రాయిని గుద్దేస్తే పగిలిపోయింది. వెంటనే ఆర్య సమాజ్ వారు వచ్చి ఆ రాయి భాగ్యలక్ష్మీ దేవని చెప్పి అప్పటికప్పుడు రెండున్నర అడుగుల ఎత్తులో నాలుగు పైపులు వాడి ఒక షెడ్ లాగా వేసేశారు. అంతే'' అని ఆమె వివరించారు.

 
''ఆ షెడ్ కట్టక ముందు అక్కడ ఇద్దరు అమ్మాయిలు భిక్షాటన చేసేవారు. వారు అక్కడే పసుపు, కుంకుమ వేసేవారు. ఈ గుడి కట్టాక వారిని పంపించేశారు. ఒక పూజారి వచ్చాడు. ఆ రాయి దగ్గర లక్ష్మీ దేవి ఫోటో పెట్టారు. ఆమె భాగ్యలక్ష్మీ అనీ హైదరాబాద్‌ను కాపాడటానికి వచ్చిందనీ చెప్పారు. కొన్ని రోజులకు ఆ ఫోటో బదులు విగ్రహం పెట్టారు'' అని వివరించారు ఔదేష్ రాణి.

 
అయితే, అప్పట్లోనే ఈ గుడి కట్టడంపై కొందరు కమ్యూనిస్టు నాయకులు అభ్యంతరం చెప్పినట్టు చెప్పుకొచ్చారు రాణి. ''అదే సమయంలో అయిదారుగురు కమ్యూనిస్టు నాయకులు అసలు అక్కడ గుడి ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వారికి ఆసక్తికర విషయాలు తెలిశాయి. హైదరాబాద్‌లో వెట్టి చాకిరీ కోసం వచ్చి, రోడ్లు వేసే కూలి పనిచేసే ఒక మహిళను అదే ప్రదేశంలో పూడ్చి పెట్టారనీ, ఆమె పుణ్యస్త్రీగా చనిపోవడంతో ఆమె సమాధిపై పసుపు, కుంకుమ చల్లేవారనీ తెలిసింది. ఆమె కుమార్తెలే అక్కడ భిక్షాటన చేసే వారనే వాదన ఉంది. ఈ విషయాన్ని (గుడి లేదన్న) వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ, ప్రభుత్వం పట్టించుకోలేదు'' అన్నారామె.

 
అయితే, చార్మినార్ పరిసరాల్లో భాగ్యలక్ష్మి గుడి లేదు కానీ, వేరే గుడి ఉందనీ, ఆ గుడి ఇప్పటికీ కొనసాగుతుందనీ చెప్పారామె. ''మక్కా మసీదు దగ్గర్లో ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయం నిర్వహణకు పూజ సామాగ్రి ఖర్చులు కుతుబ్ షాహీ రాజులే ఇచ్చేవారు. దీనికి స్పష్టమైన రికార్డులు ఉన్నాయి. అంతేకాదు, పాతబస్తీలోని చాలా హిందూ గుళ్లకు రికార్డులు ఉన్నాయి. దాన శాసనాలు ఉన్నాయి. కానీ భాగ్యలక్ష్మి గుడి ఉన్నట్టు మాత్రం ఎక్కడా లేదు''. అన్నారామె.

 
విగ్రహం పెట్టక ముందు అక్కడ రాయి, ఫోటో ఉండేదన్న విషయాన్ని చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి పూజారులూ చెప్పారు. వారితో బీబీసీ మాట్లాడింది. అయితే ఆ రాయి పురాతనమైన అమ్మవారి రూపం అని వారి అభిప్రాయం. ''ఆ రాయి రూపంలో అమ్మవారిని 500 ఏళ్ల నుంచి ఆరాధిస్తున్నారని'' చెప్పారు పూజారి సూర్యప్రకాశ్. ప్రస్తుతం భాగ్యలక్ష్మి గుడిలో అమ్మవారి విగ్రహం పాదాల దగ్గర రెండు వెండి రూపాలు ఉంటాయి. ''ఆ వెండి తొడుగుల వెనుక ఆ పగిలిన రాయి ఉంది. పగిలిన రాళ్లకు పూజలు చేయకూడదు కాబట్టి, మొదట్లో ఫోటో పెట్టారు. తరువాత విగ్రహ ప్రతిష్టాపన జరిగింది'' అని ఆయన వివరించారు.

 
''ఈ గుడి కట్టే 80-100 ఏళ్లు అవుతుంది.'' అని చెప్పారు సూర్య ప్రకాశ్. అయితే గుడిలేని చార్మినార్ ఫోటోల గురించి ఆయన దగ్గర ప్రస్తావించినప్పుడు, తనకు ఆ ఫోటోల సంగతి తెలియదనీ, కానీ, తాము నాలుగు తరాలుగా ఇక్కడే పూజ చేస్తున్నామనీ చెప్పుకొచ్చారు. అస్ఘర్ అలీ ఇంజినీర్ రాసిన ''కమ్యూనల్ రాయిట్స్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా'' (స్వతంత్ర్య భారతంలో మత కలహాలు) పుస్తకంలో చార్మినార్ దగ్గర ఘటనలను ప్రస్తావించారు. ఆ పుస్తకంలోని 292వ పేజీలో ఇలా ఉంది.

 
''ఈ గుడి ఈ మధ్య కాలంలో కట్టిందే. 1965లో ఒక మినార్ దగ్గర ఒక రాయికి కాషాయం రంగు పూసి, అక్కడో ముసలామెకు అప్పజెప్పారు. ఆ తరువాత 1970లలో ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆ రాయిని గుద్దినప్పుడు, ఒక పక్కా గుడిలా కట్టారు. ఆ డ్రైవర్ ముస్లిం కావడంతో అతణ్ణి డిస్మిస్ చేశారు.'' హైదరాబాద్లోని మత ఘర్షణల గురించి వివరించే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు రాశారు. 2018లో హైకోర్టులో ఒక కేసు సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్‌లో ''మహంత్ రామ్ చంద్ర దాస్ అనే వ్యక్తి తన తండ్రీ అనీ, ఆయనే తన సొంత డబ్బుతో ఈ గుడి కట్టించారనీ'' బబితా శర్మ పేర్కొన్నారు.

 
''చార్మినార్ నిర్మాణం జరిగినప్పుడు దాని ఆనవాళ్లు లేవు. మీర్ మొమీన్ వేసిన పునాది, ఆ సందర్భంలో అక్కడ ఏవైనా విగ్రహాలు ఉన్నట్టు కూడా లేదు. ఏ డాక్యుమెంటులో కానీ.. పుస్తకంలో కానీ ఆ వివరాలు లేవు. తెలంగాణలో ప్రార్థనా స్థలాలు పక్కపక్కనే ఉన్న నిదర్శనాలు ఉన్నాయి. కానీ, ఈ గుడి గురించి చార్మినార్ ఔట్‌లైన్ మాపుల్లో కూడా ప్రస్తావన లేదు. అటు ఆర్కియాలజికల్ రిపోర్టుల్లో ఎక్కడా దాని ప్రస్తావన లేదు.

 
అంతేకాదు, పూర్వం రాజులతో పాటూ వారి దగ్గర పనిచేసే మంత్రులు, ఉన్నతోద్యోగులు, సామంతులు గుడి కట్టించినా, దానం ఇచ్చినా శాసనాలు ఉండేవి. అలా హైదరాద్లోని చాలా పాత గుళ్లకు దానాలు ఇచ్చిన శాసనాలు ఉన్నాయి. కానీ భాగ్యలక్ష్మి దేవాలయానికి సంబంధించిన చరిత్ర, లేదా శాసనం ఏమీ లేదు'' అని బీబీసీతో అన్నారు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ. ఆయన హైదరాబాద్ చరిత్రపై పరిశోధనలు చేశారు.

 
''భాగ్యలక్ష్మి దేవాలయం గురించి చర్చ 70ల వరకూ లేదు. 90లలోనే దాని గురించి చర్చ మొదలైంది. బహుశా చార్మినార్ నిర్మాణం చేసిన కూలీలు ఎవరైనా ఒక ప్రతిమను అక్కడ ప్రతిష్టించారా అన్న ఒక ప్రశ్న ఉండిపోతుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనం కట్టినప్పడు వడ్డెరలు ఒక అమ్మవారిని ప్రతిష్టించారు. అలాగే ఏదైనా విపత్తు జరిగినప్పుడు విగ్రహాల ప్రతిష్టాపన జరిగే అవకాశం ఉంది'' అని ఆయన అన్నారు.

 
స్థానికుల కథనం..
''చార్మినార్‌కి నాలుగు వైపులా మైలురాళ్లుండేవి. వాటిలో ఒక రాయిపై పసుపు, కుంకుమ చల్లేవారు. 1969లో ఒక రోజు ఉదయాన్నే లారీ ఆ రాయిని గుద్దింది. అప్పట్నించి ఆ రాయి దేవత అని చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక షెడ్డులా ఏర్పాటు చేసి, లక్ష్మీ దేవి ఫోటో పెట్టారు. అదే సందర్భంలో ఇజ్రాయెల్‌లోని అల్ హక్సా మసీదుకు నిప్పు పెట్టారు ఒక ఇజ్రాయిలీ వ్యక్తి. దానిపై పాత నగరంలో మత కలహాలు జరిగాయి. ముస్లింలు రాత్రికి రాత్రి ఇక్కడ గుడి ఎలా కడతారంటూ అభ్యంతరం చెప్పారు. అప్పటి శుక్రవారం ప్రార్థనల తరువాత ఆ గుడి (షెడ్) గురించి గొడవలు జరిగాయి. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం జోరుగా ఉంది. దీంతో ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. కొన్నాళ్ల పాటూ అక్కడ ఫోటోయే ఉంది.'' అని బీబీసీతో చెప్పారు ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీలో చురుగ్గా ఉన్న, అలీజాకోట్లకు చెందిన ఒక పెద్ద వయసు వ్యక్తి.

 
''1979లో కాబా ఘటన జరిగింది. కొందరు సాయుధులు సౌదీలోని పవిత్ర మసీదులోకి చొరబడ్డారు. దాని తరువాత శుక్రవారం హైదరాబాదులో కాబా ఘటనకు నిరసనగా ఆందోళనలు జరిగాయి. అప్పుడు స్థానిక ముస్లింలు ఈ గుడిపై అభ్యంతరం చెప్పారు. అలా ఘర్షణలు జరిగాయి. 1979 నవంబరులో ఆ ఫోటో ఫ్రేం దెబ్బతింది. దీంతో వారు వెంటనే విగ్రహ ప్రతిష్ట చేశారు. క్రమంగా గుడి పెంచుకుంటూ వచ్చారు. చార్మినార్ లోపల ముస్లింలకు సంబంధించిన ఒక చిల్లా ఉంది. దానికి పోటీగా హిందువులు ఈ గుడిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు'' అని ఆయన అన్నారు.

 
'ఆ చోటు వందల ఏళ్ల నుంచీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ (ప్రార్థించే స్థలం). ఇందులో అనుమానం లేదు. కాకపోతే అక్కడ గుడి ఉండేది కాదు. అమ్మవారు ఇప్పుడున్న రూపంలో కాకుండా, బొడ్డురాయి తరహాలో, చూడ్డానికి మైలురాయిలాగా ఉండేది. హైదరాబాద్‌లోని అన్ని ప్రధాన కట్టడాల దగ్గరా, ఆ కట్టడాలకు రక్షణగా అమ్మవారిని ప్రతిష్టించేవారు. హుస్సేన్ సాగర్ దగ్గర కట్ట మైసమ్మ, గోల్కొండలో అమ్మవారి గుడి, పురానాపూల్ దగ్గర అమ్మవారు, అలియాబాద్ బురుజు దగ్గర దర్బార్ మైసమ్మ గుడి ఇలాంటివే. ఆ గుడి ఎదురుగా బస్టాప్‌లో నేను గమనించే వాడిని. అక్కడ చాలా మంది మొక్కు చెల్లించుకునే వారు. ముస్లిం మహిళలు పురుడు కోసం పక్కనే ఉన్న ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా మొక్కు చెల్లించుకునేవారు. మా ఇళ్లల్లో ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు మేమూ వెళ్లి మొక్కేవాళ్లం, వడి బియ్యం ఇచ్చేవాళ్లం''అని శాలిబండ ప్రాంతంలో పెరిగిన నిరంజన్ అన్నారు. ఈయన ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.

 
''1979 కాబా ఘటన తరువాత బస్ డ్రైవర్ ఆ రాయిని ఢీకొట్టాడు. అది ప్రమాదవశాత్తు జరిగింద లేక కావాలని చేశారా అనే గొడవ నడిచింది. అప్పుడు చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రి. ఆయనే అప్పుడు అక్కడ ఒక గుడిలా కట్టడానికి సహకరించారు. అప్పట్లో ఆ గుడి పూజారి కర్ఫ్యూలో కూడా పూజలకు వెళ్లేవారు. శుక్రవారం పూట మధ్యాహ్నం 12 గంటల నమాజు సమయంలో ఆయన హారతి గంట కొట్టకుండా పోలీసులు ఆ గంట పట్టుకుని కూర్చునేవారు'' అని ఆయన చెప్పారు.

 
ఫోటోల గురించి నిరంజన్ ను ప్రశ్నించగా.. ''ఫోటోలు దూరం నుంచి తీసినప్పుడు, అక్కడ గుడి ఉండుంటే కనిపించేది. అక్కడ గుడి లేదు అనేది వాస్తవం. కానీ రాయి ఉండేది. ఆ రాయి ఫోటోలో రాదు కదా?'' అన్నారు. మొత్తానికి 1967-69లలో గుడి కోసం షెడ్డు నిర్మాణం ప్రారంభం అయింది అని పలువురు చెప్పగా, నిరంజన్ ఉద్దేశంలో 1979లో గుడి నిర్మాణం మొదలైంది.

 
ఏఎస్ఐ ఏం చెబుతోంది?
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేదా భారత పురావస్తు సర్వేక్షణ 1951లో చార్మినార్‌ను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచీ ఈ కట్టడం బాగోగులు వారే నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి చార్మినార్‌కు సంబంధించిన ప్రతీ రికార్డూ వారి దగ్గర ఉంది. కానీ, ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ దీనిపై మాట్లాడడం లేదు. ''దీని గురించి మాట్లాడే అధికారం మాకు లేదు. మీకు ఏం కావాలన్నా దిల్లీలోని మా ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులను సంప్రదించండి''అని హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ స్మిత బీబీసీతో చెప్పారు.

 
ఈ గుడి మధ్యలోనే వచ్చిందని ఏఎస్ఐకు స్పష్టంగా తెలుసు అన్నది వాస్తవం. ఈ విషయాన్ని బీబీసీ ధ్రువీకరించుకుంది. ''ఆ దేవాలయాన్ని తొలగించాలని 1960ల నుంచీ మేం జిల్లా యంత్రాంగానికి రాస్తున్నాం. కానీ, వాళ్లేం చేయలేదు''అని న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికకు 2019 నవంబరులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ అప్పటి సూపరింటెండ్ చెప్పారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యారు, బీబీసీకి అందుబాటులోకి రాలేదు.

 
అన్నిటికీ మించి ఈ గుడి చట్టబద్ధంగా, ఏఎస్ఐ అనుమతితో కట్టిందా అని ప్రశ్నిస్తూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టారు ఒక హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి. ఆ ప్రశ్నకు ''లేదు'' అని సమాధానం చెప్పారు హైదరాబాద్ సర్కిల్ ఎఎస్ఐ అధికారులు. అసలు ఆ గుడి గురించి ఎటువంటి రికార్డులూ అందుబాటులో లేవని వారు తెలిపారు. 2019 డిసెంబరులో ఈ సమాధానం ఇచ్చారు. అయితే ఆ గుడి విషయంలో ఏం చేయాలనేదానిపై మాత్రం పలు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి.

 
ఇప్పుడెలా ఉంది?
మొదట్లో చిన్న తాత్కాలిక నిర్మాణం చేశారు. తరువాత 80లలో సిమెంటుతో చిన్న గుడిలాగ కట్టారు. అది శాశ్వత నిర్మాణం అయింది. తరువాత క్రమంగా చుట్టూ బారికేడ్లు, పూజార్లు విశ్రాంతి తీసుకోవడానికి రేకులతో కూడిన గదిలాంటి ఏర్పాటు చేశారు. బయట క్యూలైన్ల కోసం ఇనుప పైపులు, గుడి చుట్టూ వెదురు కర్రలకు ఎర్రని బట్ట చుట్టిన అలంకార తరహా నిర్మాణాలూ, పెద్ద ఫ్లెక్సీలు ఇప్పుడు ఉన్నాయి.

 
2012 దీపావళి సమయంలో ఆ గుడి చుట్టూ ఉన్న నిర్మాణాలను పెంచే క్రమంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పాత వెదురు కర్రలను మార్చే క్రమంలో ఆ ఉద్రిక్తత ఏర్పడింది అని గుడి నిర్వాహకులు చెబుతారు. ఈ పనులను ఎంఐఎం అడ్డుకుంది. దీంతో కర్ఫ్యూ తరహా వాతావరణం ఏర్పడింది. హైకోర్టు జోక్యం చేసుకుంది. గుడి విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది

 
ది హిందూ ఫోటోపై ఆసక్తికర చర్చ
ది హిందూ ప్రచురించిన ఆ ఫోటోపై అప్పట్లో ఆసక్తికర చర్చ జరిగింది. ఆ వార్తకు స్పందనగా పలువురు హిందూ పత్రికకు ఉత్తరాలు రాశారు. 2012 నవంబరు 24న ప్రచురించిన లేఖల్లో ఇలా ఉంది. చెన్నైకి చెందిన అరులూర్ ఎన్ బాలసుబ్రమణ్యన్ ఒక లేఖ రాశారు. ''నేను 1948-50ల మధ్య హైదరాబాద్లోని క్రిస్టల్ కో. సంస్థలో పనిచేశాను. సాయంత్రాలు చార్మినార్ దగ్గరకు వెళ్తుండే వాడిని. అక్కడ అప్పుడు గుడి ఏమీ లేదు. ఆ ప్రదేశంలో స్థానిక షాపులు వారు సైకిళ్లు పెట్టుకునేవాళ్లు'' అని ఆయన లేఖలో రాశారు.

 
దీనికి భిన్నంగా మరో లేఖ వచ్చింది. ''నేను 1945లో హైదరాబాద్‌లోనే పుట్టాను. నా చిన్నప్పుడే నేను భాగ్యలక్ష్మి గుడి చూశాను. వందేళ్ల క్రితం వచ్చిన కరువు నుంచి ఆ దేవత కాపాడిన దానికి గుర్తుగా గుడి కట్టారు'' అని ఎంఎన్ చారి రాశారు.

 
మరైతే అక్కడున్న రాయి సంగతేంటి?
ఆ రాయి ఎప్పటిది? అది మైలురాయా? లేక పూజలు అందుకుంటోన్న రాయా అన్నది స్పష్టంగా తెలియదు. ''ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలానే మొదలౌతుంది. హిందువులు అయితే రాయి పెడతారు. ముస్లింలు అయితే పచ్చ జెండా పెడతారు. అంతే..'' అంటూ తన అభిప్రాయం చెప్పారు ఇంటాక్ హైదరాబాద్ కో కన్వీనర్ సజ్జద్.

 
చరిత్రకారుల భయం
ఏదైనా పురావస్తు కట్టడానికి లేదా స్థలానికి యునెస్కో హెరిటేజ్ సైట్ హోదా రావడం ఎంతో గొప్ప విషయంగా చెబుతారు చరిత్ర, పురావస్తు అధ్యయనవేత్తలు. కానీ, చార్మినార్‌కు మాత్రం ఆ ట్యాగ్ రాకపోవడానికి ఈ గుడే కారణమని వారు చెబుతున్నారు. ఆయా సైట్లలో ఆక్రమణలు ఉంటే యునెస్కో ట్యాగ్ ఇవ్వరు. ఆ క్రమంలోనే చార్మినార్‌కు ఆ హోదా ఆగిపోయింది. చార్మినారే కాదు, గోల్కొండ విషయంలోనూ ఈ సమస్య ఉంది. గోల్కొండ చుట్టూ జనం ఇళ్లు ఉండడం ట్యాగ్‌కి అడ్డంకి.

 
ఈ విషయంపై వివరణ కోరడానికి బీబీసీ సంప్రదించినప్పుడు ఇద్దరు చరిత్రకారులు తమ పేరు రాయవద్దని కోరారు. భాగ్యలక్ష్మి దేవాలయం గురించి మాట్లాడితే, ఆ దేవాలయం పూర్వం నుంచీ ఉందని వాదించే వారి నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయనీ, కాబట్టి తమ పేరు వాడవద్దని వారు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు