జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: పోలింగ్ ఎందుకు తక్కువగా నమోదైంది?

బుధవారం, 2 డిశెంబరు 2020 (16:18 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది. నగరంలోని 149 డివిజన్లలో 45.71 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ఉదయం నుంచీ చాలా నెమ్మదిగానే సాగింది. గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2016 ఎన్నికల్లో 45.27 పోలింగ్ శాతం నమోదు అయింది.

 
ఎన్నికల ప్రచారం సాగిన తీరు, దానికి వచ్చిన స్పందన చూసి.. ఈ సారి ఎన్నికలు భిన్నంగా ఉండబోతున్నాయని అందరూ అంచనావేశారు. ముందు జాగ్రత్తగా భారీ స్థాయిలో పోలీసులను కూడా మోహరించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి వచ్చిన జనం కంటే పోలీసుల సంఖ్యే ఎక్కువగా ఉంది.

 
సోషల్ మీడియాలో మీమ్స్
ఓల్డ్ సిటీ యాకుత్‌పురా తలాబ్ చంచాలంలో ఓటర్లు లేక నిద్ర పోతున్న ఎన్నికల అధికారుల ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఓటింగ్ శాతం తక్కువగా ఉండడంతో, ఐకియా ఓపెనింగ్ రోజు ఫోటోలు పెట్టిమరీ జనాలను పోలింగ్‌కు రావాల్సిందిగా అభ్యర్థించారు.

 
‘‘ఓటు వేయని వాడికి రోడ్డు బాగాలేదు. నీళ్లు రావడం లేదు. అని అడిగే హక్కు లేదు’’, ‘‘చదువుకున్న వాడు ఓటు వేయడానికి బయటకు రావడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం రెచ్చి పోతారు’’ అంటూ అనేక రకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకుడికీ, పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్‌లకు పార్టీ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు కృతజ్ఞతలు తెలిపారు.

 
‘‘నాలుగు రోజులు సెలవులు వచ్చిన సమయం చూసి.. ముఖ్యమంత్రితో కలిసి ప్లాన్ చేసి ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలు నిర్వహించింది. ఇదంతా కుట్రే’’అని పోలింగ్‌ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

 
ప్రజలు ఆలోచించాలి
పోలింగ్ తక్కువ శాతం నమోదు కావడం విచారకరమని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. “కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఎన్నికల కమిషన్ ఆలోచించాలి. అలాగే ప్రజలు కూడా ఆలోచించాలి.


ఓటు వేసిన వారిని ఒక రీతిలో, ఓటు వేయని వారిని ఒక రీతిలో చూడాల్సిన అవసరం వుందేమో. ఓటు వేసిన వారికి పన్ను రాయితీల వంటి ఇతర పారితోషికాలు ఇవ్వడం వంటివి చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకునే యువతను కూడా ఓటు వేసిన వారికి ఒక రకంగా వేయని వారిని ఒక రకంగా చూడాల్సిన పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తుంది” అని ఆయన అన్నారు.

 
ఎందుకు ఇలా?
వార్డుల వారీగా చూస్తే హైదరాబాద్ పాత బస్తీలో పోలింగ్ చాలా తక్కువ శాతం నమోదు అయింది. అక్టోబర్‌లో వరద నీటితో మునిగిన పలు ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువ నమోదు అయ్యింది. సెలవులు కలిసి రావడం, గడువు కంటే ముందే ఎన్నికలు నిర్వహించడం, కోవిడ్ వ్యాప్తి కారణంగా అనేక మంది వారి స్వగ్రామాలకు తిరిగి వెళ్లిపోవడం.. వంటి అనేక అంశాలు తక్కువ పోలింగ్ శాతానికి కారణం అంటున్నారు సీనియర్ జర్నలిస్టు పద్మజా షా.

 
“లాక్‌డౌన్‌లో బయట తిరిగిన వారిని పోలీసులు కొట్టారు. మాస్క్ లేకుండా తిరిగిన వారి నుంచి ఫైన్ వసూలు చేశారు. వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నా, ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారం పేరుతో రాజకీయ నేతలు కోవిడ్ సేఫ్టీ అన్నది పక్కన పెట్టారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. విరక్తి చెంది ఓటు వేసి ఉపయోగం లేదు అనుకున్నారేమో” అన్నారు పద్మజా షా. పోలింగ్ పర్యవసానాలు ఎలా ఉండబోయేది డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాల రోజు తెలుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు