బీబీసీ వరల్డ్‌ న్యూస్‌ను నిషేధించిన చైనా

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:08 IST)
బీబీసీ వరల్డ్‌ న్యూస్‌ ప్రసారాలను తమ దేశంలో నిషేధిస్తూ చైనా ప్రభుత్వం గురువారంనాడు నిర్ణయం తీసుకుంది. వీగర్‌ ముస్లింలు, కరోనావైరస్‌ విషయంలో బీబీసీ ప్రసారం చేస్తున్న వార్తా కథనాలను చైనా ప్రభుత్వం తప్పుబట్టింది. చైనా నిర్ణయం తమకు నిరాశను కలిగించిందని బీబీసీ వ్యాఖ్యానించింది.
 
బ్రిటన్‌లో చైనాకు చెందిన వార్తాప్రసార సంస్థ 'చైనా గ్లోబల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్'‌(సీజీటీఎన్‌) ప్రసారాలను బ్రిటిష్‌ మీడియా రెగ్యులేటరీ సంస్థ 'ఆఫ్‌కామ్'‌ నిలిపేసిన నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. 'స్టార్ చైనా మీడియా' అనే సంస్థ నియమాలకు విరుద్ధంగా సీజీటీఎన్‌ లైసెన్స్‌లను పొందిందని గుర్తించడంతో ఈ నెల ఆరంభంలో సీజీటీఎన్‌ ప్రసారాలను ఆఫ్‌కామ్‌ నిలిపేసింది. గత ఏడాది పీటర్ హంఫ్రీ అనే బ్రిటీష్‌ పౌరుడితో బలవంతంగా ఇప్పించిన వాంగ్మూలాన్ని ప్రసారం చేయడం ద్వారా బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినట్లు సీజీటీఎన్‌పై ఆరోపణలు వచ్చాయి.
 
చైనా వాదనేంటి?
అయితే, చైనా గురించి బీబీసీ ప్రసారం చేస్తున్న కథనాలు మీడియా నియమాలను ఉల్లంఘిస్తున్నాయని, ముఖ్యంగా వార్తలు నిజాలతో, నిజాయితీతో కూడి ఉండాలన్న సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని చైనా స్టేట్‌ ఫిల్మ్, టీవీ అండ్ రేడియో అడ్మినిస్ట్రేషన్‌ వ్యాఖ్యానించింది. చైనాలో బీబీసీ ప్రసారాలను మరో ఏడాది పొడిగించే దరఖాస్తును అంగీకరించలేమని ఆ సంస్థ వెల్లడించింది.
 
ఈ నిషేధంపై స్పందిస్తూ “చైనా తీసుకున్న నిర్ణయంతో మేం తీవ్ర నిరాశకు గురయ్యాం. వార్తా కథనాలను ఎలాంటి పక్షపాతం లేకుండా, ఉన్నది ఉన్నట్లుగా ప్రసారం చేయడంలో బీబీసీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.” అని బీబీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. బీబీసీ వరల్డ్‌ న్యూస్‌ టీవీ ఛానల్‌ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ భాషలో వార్తలను ప్రసారం చేస్తుంది. చైనాలో ఈ ఛానల్‌పై చాలా ఆంక్షలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి హోటళ్లు, రాయబార కార్యాలయాల్లో మాత్రమే ఎక్కువగా బీబీసీ వరల్డ్‌ న్యూస్‌ ఛానల్‌ కనిపిస్తుంటుంది. సామాన్య ప్రజలకు ఇది అందుబాటులో లేదు.
 
మీడియాపై చైనా ఆంక్షలు
బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ను నిషేధిస్తూ చైనా తీసుకున్న నిర్ణయం మీడియాను అదుపు చేసే చర్యల్లో భాగమని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డొమినిక్‌ రాబ్‌ వ్యాఖ్యానించారు. అమెరికా హోంశాఖ కూడా బీబీసీపై నిషేధం నిర్ణయాన్ని ఖండించింది. చైనాలో మీడియా అణచివేతకు గురవుతోందని ఆరోపించింది. హాంకాంగ్‌ కారణంగా చైనా, బ్రిటన్‌ల మధ్య సంబంధాలు ఇటీవల బాగా దెబ్బతిన్నాయి. ప్రజలు అక్కడ నివసించే పరిస్థితులు లేవంటూ సుమారు 54 లక్షలమంది హాంకాంగ్‌వాసులకు తమ దేశంలో నివాస హక్కులు కల్పిస్తూ బ్రిటన్‌ తన వీసా విధానంలో మార్పులు చేసింది.
 
మరోవైపు గత రెండేళ్లుగా చైనా ప్రభుత్వం విదేశీ మీడియాను ఒక క్రమపద్ధతిలో నిషేధిస్తూ వస్తోంది. అమెరికాకు చెందిన మూడు పత్రికల జర్నలిస్టులను ఇప్పటికే చైనా బహిష్కరించింది. బీబీసీ వెబ్‌సైట్‌, యాప్‌లను చైనా ఇప్పటికే నిషేధించింది.
వీగర్‌ ముస్లిం తెగకు చెందిన ఓ మహిళ తనపై చైనా రీ-ఎడ్యుకేషన్‌ క్యాంపుల్లో జరిగిన అఘాయిత్యాలను ఇటీవల బీబీసీకి వివరించారు. ఈ కథనాన్ని బీబీసీ ప్రసారం చేసింది.
 
చైనా ప్రభుత్వం వీగర్‌ తెగతోపాటు మైనారిటీ మతానికి చెందిన ప్రజలను చంపుతోందంటూ అమెరికా గత నెలలో ఆరోపించింది. చైనాలో సుమారు 10లక్షలమంది వీగర్‌, ఇతర మైనారిటీ ముస్లిం తెగల ప్రజలను క్యాంపుల్లో బంధించారని ఒక అంచనా. అయితే చైనా ఈ ఆరోపణలను ఖండిస్తోంది. కాన్సంట్రేషన్‌ క్యాంపులను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న ప్రచారం అబద్ధమని గత ఏడాది యూకేలో చైనా రాయబారి ల్యూ జియోమింగ్‌ బీబీసీతో అన్నారు. వీగర్ ముస్లింలు, ఇతర మైనారిటీ తెగల ప్రజలు తమ దేశంలో మిగతా ప్రజలు అనుభవించే అన్ని హక్కులను అనుభవిస్తున్నారని జియోమింగ్ స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు