కరోనావైరస్: పాకిస్తాన్ ఇంకా ఎందుకు కోవిడ్ వ్యాక్సీన్‌ను కొనుక్కోవడం లేదు?

శుక్రవారం, 22 జనవరి 2021 (13:34 IST)
పాకిస్తాన్‌లో సాధారణ ప్రజలకు కోవిడ్ వ్యాక్సీనేషన్ ఇంకా మొదలవ్వలేదు. ఆ దేశంలో వ్యాక్సీన్లు ఉత్పత్తి అవ్వడం లేదు. వాటి కొనుగోలు కోసం కూడా ప్రభుత్వం అధికారికంగా ఏ ఒప్పందాలూ చేసుకోవడం లేదు. పాకిస్తాన్ ఔషధ నియంత్రణ సంస్థ (డీఆర్ఏపీ) అత్యవసర ప్రాతిపాదికన వినియోగించేందుకు రెండు సంస్థల వ్యాక్సీన్లకు ఆమోదం తెలిపింది.

 
బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించి, ఆస్ట్రోజెనెకా ఫార్మా సంస్థ తయారుచేస్తున్న వ్యాక్సీన్‌తోపాటు చైనా సంస్థ సాయనోఫార్మ్ తయారు చేస్తున్న వ్యాక్సీన్‌ను పాక్ ఆమోదించింది. అయితే, ఈ వ్యాక్సీన్లు దేశంలో ఇప్పుడే అందుబాటులోకి వస్తాయా? లేదా? అన్నది స్పష్టత లేదు. బ్రిటన్, భారత్‌తోపాటు చాలా దేశాలకు వ్యాక్సీన్లు అందించేందుకు ఆస్ట్రోజెనెకా ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంది.

 
సాయనోఫార్మ్ వ్యాక్సీన్ చైనాతోపాటు కొన్ని దేశాల్లో ఇప్పటికే వినియోగంలో ఉంది. చాలా దేశాలతో ఆ సంస్థ ఒప్పందాలు కూడా చేసుకుంది. పాకిస్తాన్ మాత్రం ఈ రెండు సంస్థలతో ఎలాంటి ఒప్పందాలూ చేసుకోలేదు. సాయనోఫార్మ్ నుంచి 10 లక్షల వ్యాక్సీన్ డోసుల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ‘ప్రీ-బుకింగ్’ చేసిందని ప్రధానికి వైద్య సలహాదారుడిగా ఉన్న ఫైసల్ సుల్తాన్ చెప్పారు. అధికారికంగా ఆర్డర్ ఇవ్వడానికి ముందే ఈ పని చేసిందని చెప్పారు.

 
చైనా నుంచి పాకిస్తాన్‌కు మార్చి నెలలో ఈ డోసులు వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఏ తేదీన ఇవి వస్తాయన్నదానిపై ప్రభుత్వం తరఫు నుంచి అధికారంగా స్పష్టమైన సమాచారం లేదు. ఈ విషయమై వివరణ కోసం బీబీసీ ఫైసల్ సుల్తాన్‌ను సంప్రదించింది. కానీ, ఆయన చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. వ్యాక్సీన్ కొనుగోలు కోసం పాకిస్తాన్ ఏ సంస్థతోనూ ఇంతవరకూ ఎందుకు ఒప్పందం చేసుకోలేదో చెప్పలేదు?

 
వ్యాక్సీన్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోకపోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వ జాప్యమేమీ కారణం కాదని నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యక్షుడు డాక్టర్ అతా ఉర్ రెహమాన్ అన్నారు. ‘‘వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలు పెద్ద పెద్ద ఆర్డర్లు తీసుకోవడం లేదు. వాటివద్ద ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యానికి సరిపోయేంత ఆర్డర్లు ఉన్నాయి. అందుకే అధికారికంగా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అవి ముందుకు రావడం లేదు’’ అని ఆయన అన్నారు.

 
ఎలా పొందవచ్చు?
పాకిస్తాన్ ప్రభుత్వాల స్థాయిలో ఏదైనా దేశంతో వ్యాక్సీన్ కోసం ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), గ్లోబల్ అలయన్స్ ఫర్ వాక్సీన్స్ అండ్ ఇమ్యూనైజేషన్ (గావి), కోఅలైషన్ ఫర్ ఎపిడమిక్ ప్రీపేర్డ్‌నెస్ ఇనోవేషన్స్ (సీఈపీఐ) కలిసి ఏర్పాటు చేసిన కోవాక్స్ కూటమి పాకిస్తాన్‌కున్న మరో అవకాశం. కోవాక్స్ ద్వారా పాక్‌లో 20 శాతం జనాభాకు వ్యాక్సీన్లు ఇస్తారు.

 
పాకిస్తాన్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా ఈ కూటమిలో చేరాయి. కోవాక్స్ పాకిస్తాన్‌కు ఉచితంగా వ్యాక్సీన్ అందించాల్సి ఉంటుంది. కోవాక్స్ ద్వారా కొన్ని వారాల్లోనే పాకిస్తాన్‌కు వ్యాక్సీన్ రావొచ్చని ప్రధాని వైద్య సలహాదారుడు ఫైసల్ సుల్తాన్ ఇదివరకు స్థానిక మీడియాతో చెప్పారు. అయితే, ఆగస్టు కన్నా ముందు ఈ వ్యాక్సీన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సు ఆరోగ్య శాఖ అధికారి బీబీసీతో అన్నారు.

 
‘‘కోవాక్స్ తమ ప్రాధాన్యత కార్యక్రమాన్ని అనుసరిస్తూ దేశాలన్నింటికీ వ్యాక్సీన్లు ఇస్తుంది. గావి ద్వారా పాకిస్తాన్‌లో ఇప్పటికే వివిధ రోగాలకు సంబంధించిన వ్యాక్సీనైజేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కరోనావైరస్ వ్యాక్సీన్‌ను కూడా ఇందులో చేర్చొచ్చు’’ అని ఆయన చెప్పారు. కోవాక్స్ ద్వారా అందే డోసులతో పాకిస్తాన్‌లో వ్యాక్సీన్ అవసరం పూర్తిగా తీరుతుందా అన్నది ఓ పెద్ద ప్రశ్న.

 
ప్రైవేటు సంస్థలు త్వరగా ఇస్తాయా?
ఔషధాలను దిగుమతి చేసుకుని, సరఫరా చేసే ప్రైవేటు సంస్థలతోనూ పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవచ్చు. డీఆర్ఏపీ అనుమతితో పాకిస్తాన్‌లోని ప్రావిన్సు ప్రభుత్వాలు వ్యాక్సీన్ కోసం ఏ ప్రైవేటు సంస్థతోనైనా ఒప్పందం చేసుకోవచ్చని కోవిడ్-19 విషయంలో పర్యవేక్షణ కోసం ఏర్పాటైన నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ డైరెక్టర్ అసద్ ఉమర్ వెల్లడించారు.

 
అయితే, వ్యాక్సీన్‌ను త్వరగా పాకిస్తాన్‌కు తీసుకురావడం ప్రైవేటు సంస్థలకు కూడా కష్టమేనని పంజాబ్ ప్రావిన్సు ఆరోగ్య శాఖ అధికారి అంటున్నారు. ‘‘ఇప్పటివరకూ వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలన్నీ ప్రభుత్వాలతోనే ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ ఆర్డర్లు పూర్తి చేయడానికే వాటికి నెలల సమయం పడుతుంది’’ అని అన్నారు.

 
జనాలు సొంతంగా కొనుక్కోవాలా?
ప్రైవేటు సంస్థలు వ్యాక్సీన్ అమ్మడం మొదలుపెడితే, జనాలు వాటిని మెడికల్ షాపుల్లో కొనుక్కోవాల్సి వస్తుందని పంజాబ్ ప్రావిన్సు ఆరోగ్య శాఖ అధికారి అన్నారు. ‘‘జనాలు సొంతంగా వ్యాక్సీన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి రావాలని ప్రస్తుతం ఏ ప్రభుత్వమూ కోరుకోవడం లేదు. ఇలా జరిగే అవకాశాలు కూడా తక్కువే. కేంద్ర ప్రభుత్వం లేదా ప్రావిన్సు ప్రభుత్వాలు ఆ ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకోవచ్చు’’ అని అన్నారు.

 
ప్రావిన్సు ప్రభుత్వాలకు సాధ్యమా?
ప్రావిన్సు ప్రభుత్వాలు తమకు తాముగా వ్యాక్సీన్లు కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్ అనుమతి ఇచ్చింది. అయితే, ప్రావిన్సు ప్రభుత్వాలు సొంతంగా వ్యాక్సీన్ కొనుగోలు చేసే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. పంజాబ్ ప్రావిన్సు వ్యాక్సీన్ కోసం పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపైనే ఆధారపడి ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఇంతవరకూ ప్రావిన్సు ప్రభుత్వం ఏ సంస్థతోనూ వ్యాక్సీన్ కోసం ఒప్పందం చేసుకోలేదని చెప్పారు.

 
వ్యాక్సీన్లను సొంతంగా తెప్పించుకునేందుకు సింధు ప్రావిన్సు ప్రయత్నాలు చేస్తోందని ఆ ప్రావిన్సు ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అజరా పెచీహో బీబీసీతో చెప్పారు. ‘‘త్వరగా తీసుకురావాలని ఎంతో ప్రయత్నిస్తున్నాం. అయినా, మార్చి వరకూ సమయం పట్టేలా ఉంది’’ అని ఆమె అన్నారు. ‘‘వ్యాక్సీన్‌ను దిగుమతి చేసుకునేందుకు ఓ ప్రైవేటు సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఆస్ట్రోజెనెకా వ్యాక్సీన్ కోసం ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పారు.

 
‘‘ఈ విషయంలో కేంద్రం దిశానిర్దేశాలకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటాం. వ్యాక్సీనేషన్ కోసం కేంద్రం ఏర్పాటు చేసే కార్యక్రమాలు పంజాబ్‌లోనూ అమలవుతాయి. వీటన్నింటి కోసం కేంద్ర స్థాయిలో ఓ విధానం ఉండటం అవసరం. అప్పుడు దేశంలో అందరికీ సమానంగా వ్యాక్సీన్ అందుతుంది’’ అని పంజాబ్ ప్రావిన్సు ప్రాథమిక ఆరోగ్య శాఖ కార్యదర్శి మహమ్మద్ ఉస్మాన్ యూనుస్ అన్నారు.

 
చైనాపై ఆశలు
వ్యాక్సీన్ కోసం మిత్రం దేశం చైనాపై పాకిస్తాన్ బాగా ఆశలు పెట్టుకుందని డాక్టర్ అతా ఉర్ రెహమాన్ అన్నారు. ‘‘సాయనోఫార్మ్ వ్యాక్సీన్ 79 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోంది. దాని ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆమోదం లభించిన తర్వాత యూఏఈ, ఇండోనేసియా తదితర దేశాల్లోనూ జనాలకు దీన్ని ఇవ్వనున్నారు’’ అని ఆయన చెప్పారు.
 
‘‘సాయనోఫార్మ్‌ నుంచి పాకిస్తాన్ వ్యాక్సీన్‌ను ఎంత మొత్తంలో కొనుగోలు చేస్తోందనేది నేను చెప్పలేను. ఆ సంస్థ ఎంత త్వరగా వ్యాక్సీన్‌ను తయారుచేయగలదన్నదానిపై అది ఆధారపడి ఉంటుంది. మార్చిలో ఆ వ్యాక్సీన్ పాకిస్తాన్‌కు వస్తుందని ఆశాభావంతో ఉన్నాం’’ అని ఆయన అన్నారు.

 
ఏవి రావొచ్చు?
‘‘ఆస్ట్రోజెనెకా సంస్థ బ్రిటన్, భారత్‌ల్లో వ్యాక్సీన్ ఉత్పత్తి చేస్తోంది. ఈ రెండూ దేశాల్లోనూ కోవిడ్ రోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో ఆ సంస్థ ఉత్పత్తి చేసే వ్యాక్సీన్లలో పెద్ద భాగం ఆ రెండు దేశాలకే వెళ్తోంది’’ అని డీఆర్ఏపీ అదనపు డైరెక్టర్ అక్తర్ అబ్బాస్ ఖాన్ అన్నారు. చైనా సంస్థలు మినహా యురోపియన్, అమెరికన్ సంస్థల నుంచి పాకిస్తాన్‌కు వ్యాక్సీన్‌లు త్వరగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదని పంజాబ్ ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.

 
సాయనోఫార్మ్ చైనా ప్రభుత్వ సంస్థ కాబట్టి, పాకిస్తాన్‌కు వ్యాక్సీన్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే, త్వరితగతిన ఎంత మొత్తంలో వ్యాక్సీన్లు ఆ సంస్థ ఇవ్వగలదన్నది చూడాల్సి ఉంది. సాయనోఫార్మా కాకుండా కైనసాయనో అనే చైనా సంస్థ కూడా పాకిస్తాన్‌లో కోవిడ్ వ్యాక్సీన్ ట్రయల్స్ చేస్తోంది. ప్రస్తుతం ఇవి మూడో దశలో ఉన్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే డీఆర్ఏపీ దీనికి ఆమోదం ఇవ్వొచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు