కోవిడ్: కేంద్ర మంత్రి సోదరుడికే ఆసుపత్రి బెడ్ దొరకలేదా? వీకే సింగ్ ట్వీట్ వివాదం ఏమిటి?

సోమవారం, 19 ఏప్రియల్ 2021 (13:28 IST)
దిల్లీలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ ఆదివారం ఘాజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్‌ను ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో ఒక పోస్ట్ పెట్టారు.

 
అందులో "దయచేసి ఇది చూడండి. మాకు మీ సహాయం కావాలి. నా సోదరుడికి కరోనా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో బెడ్ అవసరం. ఘాజియాబాద్‌లో ఎక్కడా బెడ్ దొరకట్లేదు" అని హిందీలో రాసి ఉంది. రెప్పపాటులో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేంద్ర మంత్రి బంధువులకే ఆస్పత్రిలో బెడ్ దొరకట్లేదంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. అయితే, తన ట్వీట్‌పై వీకే సింగ్ వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశారు. తరువాత, వైరల్ అయిన తన పాత ట్వీట్‌ను తొలగించారు.

 
"నెటిజన్ల అవగాహన స్థాయి, తొందరపాటు చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. అది ఒక ఫార్వర్డ్ ట్వీట్. అసలు ట్వీట్ హిందీలో ఉంది. దాన్ని నేను ఫార్వర్డ్ చేస్తూ, 'దయచేసి ఈ విజ్ఞప్తిని చూడండి' అని జిల్లా మెజిస్ట్రేట్‌ను ట్యాగ్ చేశాను. జిల్లా మేజిస్ట్రేట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పడకలను ఏర్పాటు చేశారు. మీ అభిప్రాయాలను మార్చుకోమని మనవి" అని నెటిజన్లను ఉద్దేశించి రాశారు.

 
కాగా, దీనికి ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు దిలీప్ కుమార్ పాండే, వీకే సింగ్‌కు జవాబిస్తూ.. "రోగి పేరు, చిరునామా తదితర వివరాలను పంచుకోండి. సహాయం చేయడానికి సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తాం" అని ట్వీట్ చేశారు. వీకే సింగ్ తన మొదటి ట్వీట్‌లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సమాచార సలహాదారు శలభ్ మణి త్రిపాఠిని కూడా ట్యాగ్ చేశారు. త్రిపాఠి వెంటనే స్పందించి, ఈ అభ్యర్థనను పరిశీలించమని ఘాజియాబాద్ మెజిస్ట్రేట్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

 
త్రిపాఠి ట్వీట్‌కు జవాబుగా పవన్ శర్మ అనే వ్యక్తి.."శలభ్ భాయ్, 2020 జులై తరువాత ఘాజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ట్వీటర్‌లో కనిపించట్లేదు. ఆయన్ను ట్యాగ్ చేయడం అనవసరం. ఫలితం ఉండదు" అని రాశారు. వీకే సింగ్ గతంలో చేసిన ఒక ట్వీట్‌ను పోస్టు చేస్తూ @ZakiAhmed2808 అనే వ్యక్తి.. "100 ఆస్పత్రులు వస్తాయని వాగ్దానం చేసిన మంత్రికి ఒక బెడ్ కూడా దొరకలేదని" రాశారు.

 
కాగా, వీకే సింగ్ ట్వీట్‌కు వివరణ ఇస్తూ కొందరు ఆయన పక్షాన నిలబడ్డారు. "మానవతా దృక్పథంతో వీకే సింగ్ మరొకరి పోస్టును జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫార్వర్డ్ చేశారు. అయితే, ఆయన అసలు వ్యక్తిని ట్యాగ్ చేయడం మర్చిపోయారు" అని @RahulRahulk4 అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు