హైదరాబాద్ సన్‌రైజర్స్ హ్యాట్రిక్ ఓటమి - ముంబై ఖాతాలో మరో గెలుపు
ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (11:04 IST)
ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. మిగతా జట్లన్నీ ఆధిపత్యం కోసం పోటీ పడుతుంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం సీజన్‌లో బోణీ కొట్టేందుకు తండ్లాడుతున్నది. మిడిలార్డర్ వైఫల్యంతో సన్‌రైజర్స్ వరుసగా మూడో పరాజయం మూటగట్టుకుంది.
ఓ మోస్తరు లక్ష్యఛేదనలో మెరుపు ఆరంభం లభించినా.. ఫినిషింగ్ లోపంతో ఐపీఎల్ 14వ సీజన్‌లో వార్నర్ సేన పరాజయాల హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. శనివారం ముంబైతో జరిగిన పోరులో హైదరాబాద్ 13 పరుగుల తేడాతో ఓడింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 150/5 స్కోరు చేసింది. డికాక్ (40), పొలార్డ్ (22 బంతుల్లో 35), రోహిత్ శర్మ (32) రాణించారు.
హైదరాబాద్ బౌలర్లలో విజయ్ శంకర్, రహమాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ 19.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. జానీ బెయిర్‌స్టో (43), వార్నర్ (36) తప్ప మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో చాహర్, బౌల్ట్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. పొలార్డ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు శుభారంభం దక్కింది. ముజీబ్ ఓవర్‌లో 4, 6 కొట్టిన రోహిత్.. భువనేశ్వర్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్ అరుసుకున్నాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి రోహిత్‌సేన వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. ఈ దశలో శంకర్‌కు బంతినివ్వడం ఫలితాన్నిచ్చింది.
భారీ షాట్‌కు యత్నించిన రోహిత్ క్యాచ్ ఔట్ కాగా.. తదుపరి ఓవర్‌లో సూర్యకుమార్ (10)ను కూడా శంకర్ డగౌట్ బాట పట్టించాడు.
ఈ దశలో మన బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేయడంతో ముంబై రన్‌రేట్ మందగించింది. హైదరాబాద్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన ముజీబ్.. డికాక్‌తో పాటు ఇషాన్ కిషన్ (12)ను పెవిలియన్ పంపాడు. ఆఖర్లో పొలార్డ్ ధాటిగా ఆడటంతో ముంబై మంచి స్కోరు చేయగలిగింది.
చెపాక్ పిచ్‌పై కఠినమైన లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌కు మెరుపు ఆరంభం లభించింది. బెయిర్‌స్టోతో పాటు వార్నర్ పవర్‌ప్లేలో దంచికొట్టారు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్‌లో 4, 4, 6, 4 కొట్టిన బెయిర్‌స్టో.. మిల్నే ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు అరుసుకున్నాడు. ఫలితంగా 5 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. ఎనిమిదో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్యా.. బెయిర్ స్టోను ఔట్ చేసి ముంబైకి బ్రేక్‌త్రూ ఇప్పించాడు. ఇక అక్కడి నుంచి హైదరాబాద్ బ్యాటింగ్ తడబడింది.
మనీశ్ పాండే (2) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. వార్నర్ రనౌటయ్యాడు. కాసేపటికి చాహర్ ఒకే ఓవర్‌లో విరాట్ సింగ్ (11), అభిషేక్ శర్మ (2)ను ఔట్ చేశాడు. విజయానికి 5 ఓవర్లలో 47 పరుగులు అవసరమైన దశలో విజయ్ శంకర్ (28) రెండు చక్కటి సిక్సర్లు బాదాడు. బౌల్ట్.. రషీద్ ఖాన్ (0)ను ఎల్బీడబ్ల్యూ చేయగా.. హార్దిక్ బుల్లెట్ త్రోకు సమద్ (7) రనౌటయ్యాడు. రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన దశలో శంకర్ కూడా ఔటవడంతో రైజర్స్‌కు హ్యాట్రిక్ ఓటమి తప్పలేదు.