కరోనా కాలంలో మోదీ ప్రభుత్వం సామాన్యుల జేబును భద్రంగా చూసుకుందా?

బుధవారం, 9 జూన్ 2021 (15:11 IST)
ఈ కథలోని పాత్రలు ఏవీ కల్పితమైనవి కావు. భారతదేశంలోని ప్రతి మధ్య తరగతి కుటుంబం అనుభవాలను ఈ కథలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ కథ ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన సుమేధ శర్మ కుటుంబానికి సంబంధించింది. భారతదేశంలో కరోనా సెకండ్‌ వేవ్ పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు, ఆసుపత్రి బెడ్ కోసం ఎదురు చూసిన కుటుంబాల్లో సుమేధ శర్మ కుటుంబం ఒకటి.

 
దిల్లీకి సమీపంలోని గాజియాబాద్‌లో నివసించే సుమేధ శర్మ కుటుంబం మొత్తం ఈ ఏడాది ఏప్రిల్ చివరిలో కోవిడ్ వైరస్ బారిన పడింది. ఇంట్లో ఉన్నవారందరికీ లక్షణాలు తగ్గిపోగా, మధుమేహంతో బాధపడుతున్న సుమేధ భర్త శాంతను మాత్రం ఇబ్బంది ఎదుర్కొన్నారు. మొదటి కొన్ని రోజులు ఇంట్లోనే ఉండి మందులు వాడారు. కానీ, ఆక్సిజన్ లెవెల్ పడిపోవడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. మే 6 నుంచి మే 20 వరకు శాంతను రెండు వేర్వేరు ఆసుపత్రులలో చికిత్స పొందారు.

 
హాస్పిటల్‌లో 15 రోజుల చికిత్సకు రూ.5లక్షలు ఖర్చయ్యాయి. వీటిలో కొంత ఇన్సూరెన్స్ నుంచి రాగా, కొన్ని కోవిడ్ చికిత్సలకు ఇన్సూరెన్స్‌లో అవకాశం లేకపోవడంతో సొంత జేబు నుంచే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వచ్చింది. 2016లో ఉద్యోగం వదిలేసిన శాంతను ఎలక్ట్రికల్ వస్తువుల బిజినెస్ ప్రారంభించారు. అంతకు ముందు చేసిన పొదుపు, డిపాజిట్లు అన్నింటినీ తెచ్చి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు. సరిగ్గా బిజినెస్ ప్రారంభించబోతున్న సమయంలోనే లాక్‌డౌన్ మొదలైంది. ఏడాదిపాటు బిజినెస్ ఆగిపోయింది. అంటే, ఆదాయం పూర్తిగా నిలిచి పోయింది. అంతకు ముందు చేతిలో మిగిలిన సొమ్ముతో కుటుంబం గడుస్తోంది.

 
కానీ, ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు ఆ కుటుంబ ఆర్ధిక స్థితిగతులను చిన్నాభిన్నం చేశాయి. సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇంటి ఖర్చులు కూడా పెరిగాయి. ఏది కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కుటుంబంలో శాంతను, సుమేధతోపాటు ఇద్దరు పిల్లలు, శాంతను తల్లిదండ్రులు ఉంటారు. శాంతను, సుమేధల పెద్ద కూతురు అయిదో తరగతి చదువుతుండగా, చిన్న కూతురు నర్సరీలో ఉంది. నెలవారి ఖర్చులకు ఇంటి ఈఎంఐ అదనం. మీ కుటుంబం కూడా మధ్య తరగతి కుటుంబమైతే, సుమేధ శర్మ కథలో మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు.

 
పెరిగిన ద్రవ్యోల్బణం
మరి కరోనాపై మోదీ చర్యల కారణంగా ఈ కుటుంబానికి ఏదైనా ఊరట లభించిందా? ''ఇల్లు, పెట్రోల్, డీజిల్, పప్పులు, ఉప్పులను ఎలాగో కొంత తగ్గించుకుంటాం. కానీ వైరస్ కారణంగా అయిన ఖర్చులను ఎవరు భరిస్తారు'' అన్నారు సుమేధ శర్మ. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021 ఏప్రిల్‌లో వంట నూనె 25శాతం, గుడ్లు 10 శాతం, చేపలు, మాంసం 16 శాతం, పప్పుధాన్యాలు 7 శాతం ధరలు పెరిగాయి.

 
కొన్ని కూరగాయల ధరలు తగ్గినా, పెరిగిన రేషన్, ఇతర వస్తువులు ఆ ప్రయోజనాన్ని అడ్డుకున్నాయి. మే నెలలో పెట్రోల్ ధరలు 17 సార్లు పెరిగాయి. జూన్‌లో కూడా ఆ వేగం కొనసాగనుంది. పెట్రోలు దేశంలో కొన్నిచోట్ల రూ. 100 దాటింది. డీజిల్ రేటు పెట్రోలు కన్నా కొద్దిగానే తక్కువ ఉంది. దీంతో రవాణా చేసే ఆహార పదార్ధాల ధరలు ప్రియంగా మారాయి. అంతకు ముందు సుమేధ ఇంట్లో ఖర్చుల కోసం రూ.7 వేలు వెచ్చించాల్సి వచ్చేంది. కానీ, గత రెండు మూడు నెలలుగా ఈ ఖర్చు రూ.10 వేలకు తగ్గడం లేదు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు బలమైన ఆహారం తీసుకోవడం కోసం పండ్లు, కూరగాయలు అదనంగా కొనాల్సి రావడంతో ఈ ఖర్చు పెరిగింది.

 
నిరుద్యోగిత రేటు
సుమేధ భర్త శాంతనుకు బీమా కంపెనీల మీద కంటే ప్రభుత్వం మీదే ఎక్కువ కోపం ఉంది. ''వ్యాధి పేరిట రోగులనే ఎలుకలుగా చేశారు. ప్రయోగాలన్నీ మాపైనే చేశారు. ఇవన్నీ ఇన్సూరెన్స్‌లో కవర్ కాకపోవడంతో వాటిని మేమే భరించాల్సి వచ్చింది. ప్రభుత్వం నిబంధనలు సరిగ్గా ఉంటే మాపై భారం తగ్గేది'' అన్నారు శాంతను. ఉపాధి ఏదీ లేనందున తనను తాను నిరుద్యోగిగా భావిస్తున్న శాంతను, ఈ ఖర్చులన్నీ ఎలా భరించాలని ప్రశ్నిస్తున్నారు.

 
జూన్‌ 6, 2021న సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన డేటా ప్రకారం భారతదేశంలో నిరుద్యోగిత రేటు 13 శాతంగా ఉంది. ''నిరుద్యోగులైన కరోనా బాధితులను గుర్తించడం ప్రభుత్వానికి చాలా సులభం. శాంతను కూడా అలాంటి నిరుద్యోగుల్లో ఒకరు. టెస్టుల సమయంలో నింపే ఫారమ్‌లు ఇందుకు ఉపయోగపడతాయి'' అని ప్రసిద్ధ స్టాటిస్టీషియన్ ప్రణబ్ సేన్ అన్నారు. కానీ, కోవిడ్ వ్యాధి లేకుండా, ఉద్యోగం పోగొట్టుకున్న వారిని గుర్తించడం కష్టం. అయితే, అలాంటి వారిలో కొందరికి పీఎఫ్ సౌకర్యం ఉంది. ఇలాంటి వారిని మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారిగా పరిగణించాలని ప్రణబ్ సేన్ అంటారు.

 
ప్రావిడెంట్ ఫండ్ విత్‌డ్రా
దిల్లీకి చెందిన మంజరి అనే మహిళ సోదరుడి పరిస్థితి ఒక దశలో ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) విత్ డ్రా చేసే దాకా వచ్చింది. 31 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నందుకు రూ.10 లక్షలు ఖర్చయింది. కొంత మొత్తం బీమా కంపెనీ నుంచి రాగా, మరికొంత సొమ్మును కుటుంబ సభ్యులు భరించారు. ఇంకా కొంత సరిపోక పోవడంతో మూడు నెలల జీతాన్ని అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ''ఖర్చులు ఇంకా పెరిగేవే. ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకు రావడం వల్ల కొంత వరకు ఖర్చు తగ్గింది. లేదంటే పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాల్సి వచ్చేది'' అని మంజరి చెప్పారు.

 
కరోనా మొదలైనప్పటి నుంచి సుమారు 76 లక్షలమంది ప్రావిడెంట్ ఫండ్‌ నుంచి కొంత మొత్తాన్ని విత్‌ డ్రా చేశారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దీని ద్వారా ప్రభుత్వ ఖజానా నుంచి రూ.18 వేల కోట్ల రూపాయలు బయటకు వెళ్లిపోయాయి. వైరస్ మొదటి వేవ్‌లో ఇలాంటి మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి ఖర్చుల కోసం పీఎఫ్ విత్‌ డ్రా చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. సెకండ్ వేవ్‌లో కూడా అది కొనసాగుతోంది. ఎంతో ఇబ్బందుల్లో ఉంటే తప్ప, సామాన్యులు పీఎఫ్‌ సొమ్మును విత్ డ్రా చేసే ప్రయత్నం చేయరని ఆర్ధిక నిపుణులు చెబుతారు. పెద్ద మొత్తంలో విత్ డ్రా అయిన ప్రావిడెంట్ ఫండ్‌ను బట్టి చూస్తే మధ్య తరగతి ప్రజల దుస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

 
పేద కార్మికుల పరిస్థితి ఏంటి?
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో పేద కార్మికులు ఆర్థికంగా ఎక్కువ ప్రభావితమయ్యారని ప్రణబ్ సేన్ అభిప్రాయ పడ్డారు. మొదటి వేవ్‌లో 'ప్రధాన్ మంత్రి జన్ కల్యాణ్ అన్న యోజన' కింద ఉచిత ఆహార ధాన్యాలు కూడా వచ్చాయి. డబ్బు కూడా జన్‌ధన్ ఖాతాలో జమ అయ్యింది. కానీ, రెండో వేవ్‌లో పేద కార్మికులు కేవలం ఆహార ధాన్యాల మీదే ఆధారపడాల్సి వచ్చింది. నిత్యావసరాల ధరల పెరుగుదల వారి పరిస్థితిని మరింత దిగజార్చింది.

 
ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 80 కోట్ల మందికి ప్రయోజనం కలిగిందని ప్రధాని మోదీ అన్నారు. సెకండ్ వేవ్‌లో దీపావళి వరకు పేదలకు ఆహార ధాన్యాల సరఫరా పథకాన్ని అమలు చేస్తామన్నారు. కానీ, బ్యాంకు ఖాతాలో డబ్బు వేయడం గురించి మాత్రం కేంద్రం మాట్లాడటం లేదు. దీనికి కూడా ఒక కారణం ఉంది. సెకండ్ వేవ్‌లో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రకటించ లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అందువల్ల, పేదలను ఆదుకునే బాధ్యత కేంద్రం కంటే రాష్ట్రాలపైనే ఉంటుంది. కానీ, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వనరులు రాష్ట్రాలకు లేవు.

 
కొన్ని రాష్ట్రాలు పేద కార్మికుల కోసం పథకాలు ప్రకటించగా, మరికొన్ని ప్రకటించలేదు. వీటిలో ఎన్ని అమలయ్యాయి, ఎన్ని కాలేదు అన్నదానిపై స్పష్టమైన గణాంకాలు లేవు. అటువంటి పరిస్థితిలో, ఈ కరోనా సమయంలో ప్రజల జేబులు ఏ స్థాయిలో నిండుగా ఉన్నాయో, ఎంత ఖాళీగా ఉన్నాయో అంచనా వేయడం పెద్ద కష్టం కాదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు