కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో 20 కోట్లు దండుకున్న ముఠా: ప్రెస్ రివ్యూ

గురువారం, 4 మార్చి 2021 (15:22 IST)
నిరుద్యోగులను మోసం చేసిన ఒక ముఠా, ఉద్యోగాలిప్పిస్తామంటూ వారి నుంచి 20 కోట్లు వసూలు చేసిందని సాక్షి కథనం ప్రచురించింది. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చినట్లు ఆర్డర్‌ కాపీలు చేతిలో పెట్టి.. కోల్‌కతా తీసుకెళ్లి ఫేక్‌ శిక్షణ ఇచ్చి.. నిరుద్యోగులను మోసం చేసింది ఆ ముఠా. తమిళనాడు కేంద్రంగా ఉన్న ఈ ముఠా చేతిలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన పలువురు నిరుద్యోగులు మోసపోయారని సాక్షి రాసింది.

 
ముఠా నాయకుడు 27 ఏళ్ల దేవప్రియన్, సభ్యుడు 50 ఏళ్ల హరిహరకుమార్‌ను చిత్తూరు పోలీసులు బుధవారం అరెస్టు చేయడంతో వీరి బండారం బయటపడింది. ఆ వివరాలను డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐలు నరసింహరాజు, యుగంధర్, ఎస్‌ఐ విక్రమ్‌ వెల్లడించారుని సాక్షి తెలిపింది. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన దేవప్రియన్‌ చెన్నై ఎయిర్‌పోర్టులో పనిచేసేవాడు. ఈ క్రమంలో ఢిల్లీలో ఓ కేంద్ర మంత్రికి సన్నిహితంగా ఉన్న వ్యక్తితో పరిచయం పెంచుకుని ఎయిర్‌పోర్టులో ఉద్యోగం మానేశాడు.

 
ఢిల్లీ వెళ్లి అక్కడ మంత్రి పేషీలో మరికొందరితో పరిచయాలు పెంచుకున్నాడు. తర్వాత మోసాలు మొదలు పెట్టాడు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చెన్నైలకు చెందిన పలువురిని తన ఏజెంట్లుగా పెట్టుకున్నాడు. రైల్వే, ఐటీ తదితర శాఖల్లో  ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు వసూలు చేశాడు.

 
ఫేక్‌ ఆర్డర్‌ కాపీలు నిరుద్యోగుల చేతిలో పెట్టి నిజంగానే ఉద్యోగాలు వచ్చినట్లు భ్రమ కల్పించేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే డబ్బు వెనక్కి ఇచ్చేవాడు. వసూలు చేసిన డబ్బుతో పాండిచ్చేరి, చెన్నై ప్రాంతాల్లో విలాసవంతమైన విల్లాలు, పంట పొలాలు కొనుగోలు చేశాడు. ఇతని మోసం ఖాతాలో చెన్నైకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు గుర్తించారని పత్రిక రాసింది. చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌ పురానికి చెందిన ఓ వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నమ్మి దేవప్రియన్‌కు 20 రోజుల క్రితం రూ. 26 లక్షలు ముట్టచెప్పాడు.

 
అయితేఅతని కదలికలపై అనుమానం రావడంతో తన నగదు ఇచ్చేయాలని డిమాండ్‌ చేశాడు. అతను చెల్లని చెక్కు ఇవ్వడంతో బాధితుడు చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. కాగా, ఈ లింకులో దొరకాల్సిన కేటుగాళ్లు చాలామంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారని సాక్షి వివరించింది.నిరుద్యోగులను మోసం చేసిన ఒక ముఠా, వారి నుంచి 20 కోట్లు వసూలు చేసిందని సాక్షి కథనం ప్రచురించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు