LIVE: తెలంగాణలో కరోనా వైరస్‌పై హైలెవల్ సమీక్ష, రూ.5 వేల కోట్లు అయినా ఖర్చు చేస్తాం - అసెంబ్లీలో కేసీఆర్
శనివారం, 14 మార్చి 2020 (16:25 IST)
వైరస్ పుట్టి ప్రజలకు సోకడం, భారీ సంఖ్యలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కాదని, ప్రతి వందేళ్లకు ఒకసారి ఏదో ఒకరకమైన వైరస్ ప్రపంచాన్ని ప్రబలుతోందని కేసీఆర్ అన్నారు. స్పానిష్ ఫ్లూ వల్ల కూడా కోట్లాది మంది చనిపోయారని చెప్పారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలనూ తీసుకుంటోందని తెలిపారు.
ఇటలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి వైరస్ సోకిందని, ఆ వ్యక్తిని గాంధీ ఆసుపత్రిలో పెట్టి చికిత్స అందిస్తున్నామన్నారు. మరో ఇద్దరికి వైరస్ సోకినట్లు అనుమానం ఉందని, వారి రక్త నమూనాలు సేకరించి పరీక్ష కోసం పూణే పంపించామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారివల్లనే ఈ వైరస్ సోకుతోందని చెప్పారు. ప్రపంచమంతా ఉత్పాతం సంభవించినప్పుడు బాధ్యతగల రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించబోదని, ఒకవేళ అలా ఏమీ చేయకుండా ఉంటే అదొక నేరం అవుతుందన్నారు.
దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలో విమాన, మెట్రో ప్రయాణీకులు అంచనాలను మించి పెరిగారని, ఇప్పుడు శంషాబాద్‌కు రోజుకు 500 విమానాలు ప్రయాణిస్తున్నాయని, 57 వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి ప్రయాణీకులు హైదరాబాద్‌కు వస్తున్నారని చెప్పారు. అయితే, విదేశీయులు భారత్ రాకుండా కేంద్ర ప్రభుత్వం వీసాలు రద్దు చేసిందని, భారతీయులు ఎవరైనా వస్తే 14 రోజుల పాటు ఇతరులతో కలవకుండా నిర్బంధిస్తున్నారని తెలిపారు.
200 మంది ఆరోగ్య శాఖ అధికారులను విమానాశ్రయంలో నియమించామని, వారితో పాటు పలువురు ఉన్నతాధికారులను కూడా పెట్టామని, వారంతా తగిన చర్యలు తీసుకుంటున్నారన్నారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఏ ఆపదా సంభవించకపోయినప్పటికీ.. వెర్రిబాగులవాళ్లలాగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అది నేరం అవుతుందన్నారు.
అందుకే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లు, సమావేశాలు మొదలైనవాటిపై ఉన్నతాధికారులతో కూడిన హైలెవల్ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. దీనికితోడు సాయంత్రం 6 గంటల సమయంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నామని, అందులో కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడం, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చిస్తామన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తక్కువగానే ఉందని, అయినప్పటికీ ఒకవేళ ప్రబలితే తీసుకోవాల్సిన అన్ని చర్యలకూ సంసిద్ధంగా ఉన్నామన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రజలకు ఇబ్బంది రాకుండా చూస్తామని, అవసరమైతే రూ.5 వేల కోట్లు అయినా ఖర్చు చేస్తామన్నారు. ఉత్పాతం లేకపోయినా, ఎటువంటి రిస్క్ తీసుకోదల్చుకోలేదని, ఇతర రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలను కూడా సమీక్షించి క్యాబినెట్‌లో నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
నాగ్‌పూర్ ఆసుపత్రి నుంచి ఐదుగురు కోవిడ్-19 అనుమానితులు పరార్
కరోనావైరస్ సోకిందేమోనన్న అనుమానిస్తున్న ఐదుగురు వ్యక్తులు ఆసుపత్రి నుంచి పారిపోయిన సంఘటన నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని మాయో ఆసుపత్రిలో కరోనావైరస్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఈ వార్డు నుంచి ఐదుగురు కోవిడ్-19 అనుమానితులు పారిపోయారని నాగ్‌పూర్ పోలీసు స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్ సూర్యవంశీ చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
‘ఈ ఐదుగురికీ వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో ఒకరికి కరోనావైరస్ సోకలేదని నిర్థరణ అయ్యింది. మిగతా నలుగురి రిపోర్టులు రావాల్సి ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు. ఆసుపత్రి నుంచి పారిపోయిన ఐదుగురినీ గుర్తించామని, వారిని పట్టుకుని తిరిగి ఆసుపత్రికి తీసుకువస్తామని సూర్యవంశీ వెల్లడించారు.
ఆఫీసు భవనం ఖాళీ చేయిస్తున్న ఇన్ఫోసిస్
బెంగళూరులోని తమ శాటిలైట్ బిల్డింగుల్లో ఒకదానిని ఖాళీ చేయించాలని నిర్ణయించినట్లు ప్రముఖ ఐటీసేవల సంస్థ ఇన్ఫోసిస్ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ భవనాన్ని ఖాళీ చేయిస్తున్నామని వెల్లడించింది. తమ ఉద్యోగుల్లో ఒకరు కోవిడ్-19 సోకినట్లుగా అనుమానిస్తున్న ఒక పేషెంట్‌ను కలిశారని, ఈ నేపథ్యంలోనే బిల్డింగ్ ఖాళీ చేయించాల్సి వస్తోందని ఇన్ఫోసిస్ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
కరోనావైరస్‌ను జయించిన వారు భారత్‌లో 10 మంది, కోవిడ్-19 సోకినవారు 83 మంది - కేంద్ర ఆరోగ్య శాఖ
భారతదేశంలో మొత్తం 11,71,061 మంది ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు జరిపామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. మార్చి 13వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాధి సోకిన 10 మంది చికిత్స తీసుకుని, ఆ వ్యాధిబారి నుంచి బయటపడ్డారని ప్రకటించింది. ఇలా కరోనావైరస్ సోకి, చికిత్స పొంది, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినవారిలో అత్యధికంగా ఐదుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కాగా, ముగ్గురు కేరళకు చెందినవారు. మిగతా ఇద్దరు దిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల వారు అని కేంద్రం ప్రకటించింది.
భారత్‌లో శుక్రవారం నాటికి ఇద్దరు వ్యక్తులు కోవిడ్-19 కారణంగా మరణించారు. వీరిలో ఒకరు దిల్లీకి చెందిన 69 ఏళ్ల మహిళ కాగా, కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు మరొకరు. దేశవ్యాప్తంగా మొత్తం 83 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్థరణ అయ్యింది. వీరిలో 65 మంది భారతీయులు కాగా, 17 మంది విదేశీయులు.
భారతీయుల్లో అత్యధికంగా కేరళలో 19 మంది ఉండగా, మహారాష్ట్రలో 14 మంది, ఉత్తరప్రదేశ్‌లో 12 మంది, దిల్లీలో ఏడుగురు, కర్ణాటకలో ఆరుగురు, లద్దాఖ్‌లో ముగ్గురు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్, జమ్మూ కశ్మీర్‌ల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. 17 మంది విదేశీయుల్లో హర్యానా రాష్ట్రంలో 14 మంది, రాజస్థాన్‌లో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు చికిత్స పొందుతున్నారు.