కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకట్టకు రూ.2 కోట్లతో హెఫా ఫిల్టర్లు

గురువారం, 12 మార్చి 2020 (13:16 IST)
శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం హై ఎఫిషియన్సీ పర్టిక్యులేట్ ఎయిర్ ఫిల్టర్లు (హెఫా ఫిల్టర్లు)ను కొనుగోలు చేయనుంది. ఒక్కో ఫిల్టర్ ధర రూ.2 కోట్ల మేరకు ఉంది. వీటిని గాంధీ ఆస్పత్రిో సహా కరోనా అనుమానితులు అధికంగా ఉండే ప్రాంతాల్లో అమర్చేలా ప్లాన్ చేస్తున్నారు. 
 
ఈ ఫిల్టర్లు వ్యాధిగ్రస్థులు, అనుమానితులు అధికంగా వచ్చి పోతుండే ప్రాంతాల్లో పెట్టడం ద్వారా, వారు తుమ్మినా, దగ్గినా గాల్లోకి వచ్చే వైరస్‌ను ఒడిసిపట్టి, స్వచ్ఛమైన గాలిని బయటకు వదులుతూ ఉంటుంది. వీటిని గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుల వద్ద ఉంచాలని భావిస్తున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాధి లేదని, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, వైరస్ వ్యాపించకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
 
విశాఖ వాసుల్లో కరోనా గుబులు 
విశాఖపట్టణం వాసుల్లో కరోనా గుబులు ఎక్కువైంది. ఇక్కడ ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి అనేకమంది విదేశీయులు వచ్చి పోతున్నారు. వీరి నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో వణికిపోతున్నారు. 
 
తాజాగా ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి, సింగపూర్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనా వైరస్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే, వారికి జరిపిన పరీక్షల్లో వ్యాధి లక్షణాలు లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. 
 
అయితే, ఇళ్లకు వచ్చాక కొన్నాళ్లకు ఇద్దరికీ దగ్గు తగ్గక పోవడంతో అనుమానంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అంతే.. ఈ వార్త కాస్త అటూఇటూ వ్యాపించడంతో ప్రస్తుతం విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలో కలకలం మొదలయ్యింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు