భారత్‌‌లో డోనల్డ్ ట్రంప్ పర్యటనపై పాకిస్తాన్ మీడియా ఎలా స్పందించింది?

మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (14:30 IST)
మోదీ-ట్రంప్-ఇవాంకా
ప్రభుత్వానికి చెందినవైనా, ప్రైవేట్ అయినా పాకిస్తాన్ మీడియా నుంచి మంచి వార్తలు రావడం ఎప్పుడూ కనిపించదు. ప్రభుత్వ కోరిక ప్రకారం ఇక్కడ దానిపై అప్రకటిత నిషేధం ఉంటుంది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ ట్విటర్‌లో "india hiding corona virus" టాప్ ట్రెండ్‌లో ఉంది. #TrumpinIndia అనేది దాని తర్వాత స్థానంలో ఉంది.

 
ట్విటర్‌ ట్రోల్‌ 'భారత్‌లో కరోనా వైరస్ దాగుంది' అనే వార్తను వ్యాపించేలా చేస్తున్నాయి. షఫీక్ చౌధరి అనే ఒక యూజర్ దీనికి నేరుగా మతం రంగు పులుముతూ "కరోనాకు ప్రభావితమైనవారిని హిందూయేతర ప్రాంతాల్లో ఉంచుతున్నారు" అని రాశారు. ఇలాంటి వాటి ద్వారా, అమెరికా అధ్యక్షుడి పర్యటనను కనీసం సోషల్ మీడియాలో అయినా కరోనా వైరస్‌తో దెబ్బ కొట్టాలని పాకిస్తాన్‌లోని కొంతమంది చూస్తున్నట్లు తెలుస్తోంది.

 
అయినా పాకిస్తాన్‌లో ఈమధ్య పీఎస్ఎల్ ఫీవర్ ఎక్కువగా ఉంది. రాజకీయాలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ట్రంప్ అఫ్గానిస్తాన్ పర్యటన గురించి కూడా పాకిస్తాన్‌లో ఎప్పుడూ పెద్దగా కవరేజ్ ఇవ్వలేదు. ట్రంప్ భారత పర్యటన గురించి సానియా సయీద్ అనే ఒక యూజర్ "మోదీ ఒక మాంసం తినే వ్యక్తిని ఆలింగనం చేసుకున్నప్పుడు, మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు" అన్నారు.

 
మరొక యూజర్ ట్రంప్, ఇవాంక ఉన్న ఫొటోను పోస్ట్ చేసి "మఫ్లర్, మీసాలు ఉన్న ఎవరైనా మిమ్మల్ని కలవడానికి వస్తే మీ హ్యాండ్ శానిటైజర్ సిద్ధంగా ఉంచుకోండి" అని రాశారు. ట్రంప్ భారత్‌లో ఏం చేయాలి అనేదానిపై ప్రభుత్వ స్థాయిలో కొన్ని చెబుతున్నారు. కానీ పాకిస్తాన్‌కు ఈ పర్యటన ఎంత ముఖ్యం అనేదాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు.

 
కశ్మీర్ అంశం లేవనెత్తాలని పాకిస్తాన్ ఆశ
ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన వీడియోను పీటీవీ ఇప్పటికీ చూపిస్తోంది. అందులో ఇమ్రాన్ భారత్‌తో ఉన్న అణుయుద్ధం ప్రమాదం గురించి చెబుతూ ప్రపంచాన్ని భయపెడుతుంటారు. ఇమ్రాన్ ఖాన్ చివరి ట్వీట్ కూడా కశ్మీర్ మహిళల గురించే చేశారు. కానీ అంతకు ముందు ట్రంప్ భారత్‌లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతారని పాకిస్తాన్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక బ్రీఫింగ్‌లో ఆ విషయం చెప్పారు.
అదే విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికారి కూడా ఒకరు చెప్పారు. దానికి పాకిస్తాన్‌లో చాలా కవరేజ్ లభించింది. మీడియా అంతా దానిని హెడ్‌లైన్స్‌ చేసింది. ట్రంప్ పర్యటన నుంచి పాకిస్తాన్ ఏదైనా కోరుకుంటుంది అంటే, ఆయన కశ్మీర్ అంశాన్ని గట్టిగా లేవనెత్తడమే అని చెప్పారు.

 
ట్రంప్‌ను మూడుసార్లు కలిసిన ఇమ్రాన్ ఖాన్ ఈ విషయం గురించి మాట్లాడి వచ్చారు. పాకిస్తాన్ వాదనంతా దాని గురించే. భారత్‌ను మళ్లీ చర్చలకు రప్పించాలంటే, అది అమెరికా ఒత్తిడితోనే సాధ్యం అవుతుందని పాక్ భావిస్తోంది. పాకిస్తాన్‌కు వేరే పరిష్కారం కనిపించడం లేదు. ట్రంప్ ఆ అంశంపై ఎంత ఒత్తిడి తెస్తారు అనేది చాలా కీలకం అని దేశంలో అందరూ భావిస్తున్నారు.

 
ట్రంప్ పర్యటన తర్వాత భారత్-పాక్ చర్చలు ఏమవుతాయి?
ఇదే ఏడాది అమెరికా ఎన్నికలు ఉన్నాయి. అందుకే ట్రంప్‌కు ఏవైనా పెద్ద విజయాలు కావాలి. అఫ్గానిస్తాన్‌తో శాంతి ఒప్పందాన్ని కూడా ఆయన తన ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని చూస్తారా? అయితే, ఆ ఒప్పందం కోసం అమెరికాకు సాయం చేసిన పాకిస్తాన్.. ఎప్పటివరకూ మద్దతు ఇస్తుంది అనేదానిపై ఆధారపడుతుంది.

 
అఫ్గానిస్తాన్‌లో ఫిబ్రవరి 29 తర్వాత పూర్తిగా ప్రశాంతత వస్తుందా? చెప్పడం కష్టమే. భారత్, పాకిస్తాన్ చర్చలకు సిద్ధమైతే అది ట్రంప్ విదేశాంగ విధానంలో రెండో అతిపెద్ద విజయం అవుతుంది. ప్రముఖ అమెరికా మేధావి మోమ్ చోమ్‌స్కీ.. ట్రంప్ దృష్టి నోబెల్ బహుమతిపై ఉందని చెప్పారు. అయితే ఆయన కోరిక నెరవేరడానికి మోదీ సాయం చేస్తారా అనేది చూడాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.
కానీ ఈ ట్రంప్ పర్యటనతో కశ్మీర్‌పై మోదీ సర్కారుకు వ్యతిరేకంగా వినిపించే గళాలు ఎక్కడ బలహీనం అయిపోతాయో అని పాకిస్తాన్‌కు ఒక పెద్ద ఆందోళన కూడా ఉంది. పాకిస్తాన్ ప్రయత్నాలతో అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం, మరో ముగ్గురు సెనేటర్లతో కలిసి గతంలో విదేశాంగ మంత్రి మైక్ పాంపేయోకు ఓ లేఖ రాశారు.

 
భారత పాలిత కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కానీ ట్రంప్ కశ్మీర్ గురించి ఏం మాట్లాడకపోతే, పాకిస్తాన్, ఈ సెనేటర్ల ప్రయత్నాలు పనికిరాకుండాపోతాయి. పాకిస్తాన్ మీడియాలో దీనిపై ప్రత్యేక కవరేజీ లేనప్పటికీ, ఈ పర్యటన ద్వారా ప్రపంచానికి తమ విధానాలు, అహ్మదాబాద్ స్టేడియం లాంటి వాటిని చూపించాలని భారత్ కోరుకుంటోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు