ఎన్నికలు 2019: మీ ఓటు మరొకరు వేస్తే ఏం చేయాలి?

బుధవారం, 10 ఏప్రియల్ 2019 (20:49 IST)
తొలి విడత లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోడానికి సంబంధించి చాలా అనుమానాలు ఉంటాయి. వాటిని ఇక్కడ నివృత్తి చేసుకోండి.
 
ప్రశ్న: నాకు ఓటరు గుర్తింపు కార్డు లేదు. నేను ఓటు వేయవచ్చా?
సమాధానం: ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే మీకు సంబంధించిన, ప్రభుత్వం గుర్తించిన వేరే గుర్తింపు కార్డులను పోలింగ్ అధికారికి చూపించి ఓటు వేయొచ్చు.
 
ప్రశ్న: పోలింగ్ బూత్ ఎక్కడుందో ఎలా తెలుసుకోవచ్చు?
సమాధానం: ఎన్నికల తేదీ కంటే ముందే అధికారులు మీకు ఓటరు స్లిప్‌లను అందిస్తారు. అందులో మీకు సంబంధించిన పోలింగ్ కేంద్రం వివరాలు ఉంటాయి.
 
ప్రశ్న: ఓటర్ల జాబితాలో నా పేరు ఉందా లేదా ఏలా తెలుసుకోవాలి?
సమాధానం: ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు అలాగే, స్థానిక ఎన్నికల కార్యాలయంలో కూడా తెలుసుకోవచ్చు.
 
ప్రశ్న: ఈవీఎంలో ఎలా ఓటు వేయాలి?
సమాధానం: ఈవీఎం మీద అభ్యర్థుల పేరు, ఫొటోతో పాటు పార్టీ గుర్తు ఉంటుంది. మీకు నచ్చిన అభ్యర్థికి సంబంధించిన గుర్తు పక్కన ఉండే మీట నొక్కడం ద్వారా ఓటు వేయవచ్చు.
 
ప్రశ్న: నేను ఎవరికి ఓటు వేశానని తెలుసుకునే అవకాశం ఉందా?
సమాధానం: ఈవీఎంకు అనుసంధానమై ఉన్న వీవీప్యాట్ ద్వారా మీరు ఎవరికి ఓటు వేశారో చూసుకోవచ్చు.
 
ప్రశ్న: నా ఓటరు ఐడీ కార్డు పోయింది. కొత్తది ఎక్కడ తీసుకోవాలి?
సమాధానం: మొదట పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలి. రూ. 25 డిపాజిట్ చేయాలి. అప్పుడు కొత్త కార్డును తీసుకోవచ్చు.
 
ప్రశ్న: వేరే వాళ్లు నా ఓటు వేశారు. ఆ ఓటును రద్దు చేసి నా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందా?
సమాధానం: ఉంది. మీకు బదులుగా వేరే వ్యక్తి ఓటు వేస్తే ఎన్నికల సంఘం నిబంధన 49 (పీ) అనుసరించి మీకు సంబంధించిన గుర్తింపు కార్డులను ప్రిసైడింగ్ అధికారికి చూపి మీ ఓటు హక్కును పొందవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు