మీ మాజీ లవర్‌ మీరు కోరుకునే 'టైప్' కాదా... మరి కొత్త భాగస్వామి ఎలా ఉంటారో తెలుసా?

శనివారం, 3 ఆగస్టు 2019 (18:32 IST)
''నా టైప్ కాదు. మా ఇద్దరికీ సెట్ కాలేదు''. విడిపోయిన ప్రేమికులు తమ బ్రేకప్ గురించి ఎక్కువగా చెప్పే కారణాల్లో ఇది కూడా ఒకటి. ఐతే 'టైప్' అంటే ఏంటి? అసలు అలాంటిది ఒకటి ఉంటుందా? చదువు, వయసు తేడా, జుట్టు రంగు, ఎత్తు వంటి లక్షణాల ఆధారంగా వ్యక్తులను ఇష్టపడటం సాధారణమే. మరి భాగస్వామి వ్యక్తిత్వం విషయంలోనూ ఇలా లక్షణాల కొలతలు పనిచేస్తాయా? ఇదే అంశంపై తాజాగా ఓ అధ్యయనం జరిగింది.
 
జర్మన్ ఫ్యామిలీ ప్యానెల్ రీసెర్చ్ డేటా సెంటర్ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా, ప్రధానంగా ఐదు వ్యక్తిత్వ లక్షణాలను ప్రాతిపదికగా తీసుకుని 12 వేల మందిపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. వారి బంధాలు ఎలా ఉన్నాయి? వాళ్ల వ్యక్తిత్వం గురించి భాగస్వాములకు ఉన్న అభిప్రాయాలు ఏంటి? అన్నవి తొమ్మిదేళ్లపాటు పరిశీలించారు.
 
ఈ తొమ్మిదేళ్ల కాలంలో వారిలో చాలామంది తామున్న బంధం నుంచి బయటపడి, కొత్త బంధాల్లో భాగమయ్యారు. అలాంటివారిలో 332 మంది పరిశోధకులు నిర్వహించిన సర్వేలో పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చారు. వారిని, వారి భాగస్వాములను ప్రశ్నించినప్పుడు ఓ ఆశ్చర్యకర విషయం వెల్లడైంది. చాలా మంది విషయంలో వారి ప్రస్తుత భాగస్వామి, మాజీ భాగస్వామి వ్యక్తిత్వ లక్షణాలు ఒకేలా ఉన్నాయి.
 
కాలం గడిచిన కొద్దీ వ్యక్తిత్వం విషయంలో తమ ఇష్టాలు మారుతుంటాయని వ్యక్తులు అనుకుంటున్నా, అలాంటి మార్పులేవీ ఉండటం లేదని వెల్లడైంది. రెండు కన్నా ఎక్కువ బంధాల్లో ఉన్నవారి విషయంలోనూ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. మాజీ భాగస్వామి, ప్రస్తుత భాగస్వామితోపాటు వారి వారి సొంత వ్యక్తిత్వ లక్షణాలు కూడా ఒకేలా ఉంటున్నాయన్న ఆశ్చర్యకర విషయాన్ని పరిశోధకులు గుర్తించారు.
 
వ్యక్తులు తమ లాంటి లక్షణాలను భాగస్వామిలోనూ ఉండాలని కోరుకుంటారని, అందుకే ఆ సారూప్యతలు ఉంటున్నాయని వారు చెప్పారు.
 
తమను తమలాగే ఉండనిచ్చే బంధాలను వ్యక్తులు సౌకర్యవంతంగా భావిస్తారని అన్నారు. ఎక్స్ట్రావర్ట్‌ల విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉంటోందని పరిశోధకులు చెప్పారు. అలాంటివారు తమ మనస్తత్వానికి భిన్నంగా ఉండే వ్యక్తులను భాగస్వాములుగా చేసుకునేందుకు ఇష్టపడుతున్నారని వివరించారు.
 
ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్‌లకు ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడే అవకాశం ఉంది. మనం ఇదివరకు విన్న పాటల ఆధారంగా మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ సాధారణంగా వినియోగదారులకు కొత్త పాటలను సూచిస్తుంటాయి. అలాగే, డేటింగ్ యాప్స్ కూడా వ్యక్తి ఇదివరకటి భాగస్వాముల లక్షణాల ఆధారంగా కొత్త స్నేహితులను సూచించవచ్చు. కొత్త భాగస్వామి కూడా పాత భాగస్వామి తరహా వ్యక్తే అయితే, బంధం త్వరగా బలపడే ఆస్కారం కూడా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
 
అయితే, ఈ వ్యూహం సరిగ్గా పనిచేస్తోందని పూచీ ఏమీ లేదు. ఇదివరకు వద్దనుకున్న లక్షణాలే కొత్త భాగస్వాముల్లోనూ కనిపిస్తే, వ్యక్తుల్లో నిరాశ, నిస్పృహ కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి బంధాలు ఎక్కువ కాలం కొనసాగుతాయని కూడా చెప్పలేమని పరిశోధకులు అంటున్నారు. అందుకే, మీరు మీ టైప్ కాదనుకుని దూరం చేసుకున్న వ్యక్తిలాగే, మీ కొత్త భాగస్వామి కూడా ఉంటే ఆశ్చర్యపోకండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు