కేకేది సహజ మరణం కాదా? సహచరుల ఫిర్యాదుతో కోల్‌కతా పోలీసుల దర్యాప్తు

బుధవారం, 1 జూన్ 2022 (13:18 IST)
కోల్‌కతాలో మంగళవారం అర్ధరాత్రి హఠాత్తుగా చనిపోయిన ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కేకే (53) ఉదంతంలో పోలీసులు అసహజ మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేకే అని సుపరిచితుడైన కృష్ణకుమార్ కున్నథ్.. ఒక ప్రదర్శన నిర్వహిస్తూ అనారోగ్యానికి గురికావటంతో దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

 
కేకేది అసహజ మరణమంటూ ఆయన సహచరులు ఫిర్యాదు చేశారు. కేకే బసచేస్తున్న హోటల్ సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. కేకే మరణానికి కారణం గుండెపోటు కావొచ్చనే ప్రాథమిక అంచనాకు వైద్యులు వచ్చినట్లు వెస్ట్ బెంగాల్ మంత్రి అరుప్ బిశ్వాస్ తెలిపారు. కేకేను రాత్రి 10 గంటల సమయంలో ఆస్పత్రికి తీసుకువచ్చారని అప్పటికే ఆయన చనిపోయారని ప్రైవేటు ఆస్పత్రి అధికారి ఒకరు చెప్పారు. కేకే తల మీద, ముఖం మీద స్వల్పంగా దోక్కుపోయిన గాయాలు ఉన్నాయని.. హోటల్ గదిలో పడిపోయినపుడు ఆ గాయాలై ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు.

 
ఇదిలావుంటే.. కేకే కుటుంబ సభ్యులు బుధవారం నాడు కోల్‌కతా చేరుకున్నారు. ఆయన భార్య జ్యోతి కృష్ణ, కుమారుడు నకుల్, కుమార్తె తామర దిల్లీ నుంచి విమానంలో కోల్‌కతా వచ్చారు. కేకే మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు. సంగీత ప్రపంచంలో కేకేగా సుపరిచితులైన కృష్ణ కుమార్ కున్నథ్... హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మళయాళం, బెంగాలీ, గుజరాతీ వంటి అనేక భాషల్లో పాటలు పాడారు.

 
తెలుగులో పవన్ కల్యాణ్, చిరంజీవి, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, గోపీ చంద్, రవితేజ వంటి నటుల సినిమాల్లో పాడారు. ఖుషి, బాలు, గుడుంబా శంకర్, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఘర్షణ, అతడు, సైనికుడు, డార్లింగ్, జయం, మనసంతా నువ్వే, నా ఆటోగ్రాఫ్ వంటి సినిమాల్లో పాడారు కేకే. ఏ మేరా జహా...(ఖుషి), మై హార్ట్ ఈజ్ బీటింగ్...(జల్సా), అవును నిజం నువ్వంటే నాకిష్టం...(అతడు), గుర్తుకొస్తున్నాయి...(నా ఆటోగ్రాఫ్) వంటి హిట్ పాటలున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు