జో బైడెన్: ఫేస్‌బుక్‌ను ముక్కలు చేస్తారా? జుకర్‌బర్గ్ అంటే అంత కోపమెందుకు?

బుధవారం, 27 జనవరి 2021 (17:06 IST)
కేంబ్రిడ్జ్ అనలిటికా ఘటనకు ముందు, మయన్మార్‌లో జాతి హననానికి తమ ఫ్లాట్‌ఫామ్‌‌ ఉప‌యోగ‌ప‌డింద‌ని ఒప్పుకోక ముందు, ఇండియాలో మూక దాడులకు వాట్సప్‌ కారణమైందన్న ఆరోపణలకు ముందు, క్యూఆనన్, ప్రౌడ్ బాయ్స్‌ ఘటనల‌కు ముందు... ప్రపంచం జుకెర్‌బర్గ్‌ పాదాల చెంత ఉండేది.

 
2017 ఆరంభంలో జుకర్‌బర్గ్‌ అమెరికావ్యాప్తంగా యాత్ర చేయాలని భావించారు. అమెరికాలో నిజ‌మైన‌ జీవితం ఎలా ఉంటుందో ఎక్కువమందితో మాట్లాడి తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఆయన తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు. అసలైన అమెరికన్‌ సమాజం గురించి తెలుసుకోవడానికి 50 రాష్ట్రాల ప్రజలతో మాట్లాడాలని ఆయన అప్ప‌ట్లో ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. 2020 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్ధి అయ్యేందుకు ప్రయత్నించారని ప్రచారం జరిగినా జుక‌ర్‌బ‌ర్గ్ దాన్ని ఖండించారు. డబ్బు, శక్తి, యుక్తి అన్నీ ఉన్నాయంటూ అమెరికా అధ్యక్ష పదవికి ఆయన అర్హతలపై మీడియాలో భారీ ఎత్తున చర్చ జరిగింది. అయితే జుకర్‌బర్గ్ మ‌న‌సులో ఉన్న ఆ పీఠం మీద ఇప్పుడు జో బైడెన్ కూర్చున్నారు.

 
జుకర్‌బర్గ్ ప్రాధాన్యం తగ్గిందా?
ప్రస్తుతం జుకర్‌బ‌ర్గ్‌ రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చింది. ‘‘ఆయన ఇప్పుడు కాక్‌టెయిల్ పార్టీలకు పిలిపించుకునే స్థాయి వ్యక్తి ఏమీ కాదు. ఇప్పటికీ శక్తివంతుడు అన్న మాటను నేను ఒప్పుకోను’’ అన్నారు అమెరికన్ ఎకనామిక్ లిబర్టీస్ ప్రాజెక్ట్ డైరక్టర్‌గా పనిచేస్తున్న సారా మిల్లర్. జో బైడెన్ అధికార బృందంలో ఆమె కూడా సభ్యురాలు. “ఆయన మీద అభిమానం ఉన్నవారెవరూ లేరిక్కడ. గుత్తాధిప‌త్యానికి ప్ర‌య‌త్నించే టెక్ కంపెనీల్లో ఎక్కువ‌మందికి ఫేస్‌బుక్కే పెద్ద విలన్’’ అన్నారు సారా.

 
ఒకప్పుడు ఒబామా ప్రభుత్వం కూడా ఫేస్‌బుక్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించింది. అప్పట్లో బైడెన్ కూడా జుకర్‌బర్గ్‌తో స్నేహం కోరుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. బైడెన్ తాను పక్కనబెట్టాల‌ని కోరుకునే వ్య‌క్తులు, కంపెనీల‌ లిస్టులో ఫేస్‌బుక్‌, జుకర్‌బర్గ్‌ కూడా ఉన్నారు. ‘‘నేనెప్పుడూ ఫేస్‌బుక్‌ అభిమానిని కాను. అలాగే జుకర్‌బర్గ్‌ ఫ్యాన్‌ను కూడా కాదు. నాకు తెలిసి అతనే ఒక పెద్ద సమస్య’’ అని ఏడాది కిందట న్యూయార్క్ టైమ్స్‌తో జో బైడెన్ అన్నారు.

 
ఒక్క బైడెనే కాదు, ఆయన టీమ్‌లో కమ్యూనికేషన్స్ హెడ్‌గా పనిచేస్తున్న బిల్ రుస్సో కూడా జుకర్‌బర్గ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ‘‘ఎన్నికల సమయాన ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారం ఒక సమస్య అని మీరు అనుకుంటే, అది మ‌న‌ ప్రజాస్వామ్యపు ముఖ్యచిత్రాన్ని ఎలా ముక్కలు చేసిందో కొన్నిరోజుల తర్వాత స్వ‌యంగా చూస్తారు’’ అన్నారు రుస్సో.
2016నాటి ఘటనల విషయంలో డెమొక్రాట్‌లు ఫేస్‌బుక్‌ను తప్పుబట్టారు. ఓటర్ల మనస్తత్వాన్ని తెలుసుకునేందుకు రిపబ్లికన్‌లు కేంబ్రిడ్జ్ అనలిటికాను ఉపయోగించుకున్నారు. తద్వారా ట్రంప్ విజయం సాధించారు.

 
అంతకు ముందు కూడా రిపబ్లికన్‌ల‌కు ఫేస్‌బుక్ సాయపడిందన్న ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి మొదలైన ఆగ్రహం ఇప్పటికి తీవ్రంగా మారింది. జో బైడెన్ సహా డెమొక్రాట్లకు ఫేస్‌బుక్ అన్నా, అందులో కనిపించే కంటెంట్ అన్నా అంటే ఒకరకమైన వ్యతిరేకత ఏర్పడింది. ‘‘వారు చేసే పని మనమెవరం చేయలేము. వారికి ఏమీ చెప్పలేం. అది అబద్ధమైనా కూడా వారికి వివరించలేం. వారు ఎప్పుడో చేయిదాటి పోయారు’’ అని 2019లో సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్ అన్నారు.

 
ఫేస్‌బుక్‌కు ఎదురు దెబ్బ
బిలియనీర్ అయినంత మాత్రాన అమెరికా అధ్యక్షుడు ఎవ‌రినైనా మన్నించాలని, గౌరవించాలని ఏమీ లేదు. ఇప్పుడు జో బైడెన్ చేయగలిగిన పని ఒకటి ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, టెక్‌ కంపెనీలకు వారి కస్టమర్లు, యూజర్లతో ఉన్న రిలేషన్ల విషయంలో చట్టాలను, నియమాలను తిరగ రాయగలగ‌డం. ఫేస్‌బుక్‌ను దెబ్బతీయడానికి అది చాలు. ఈ చట్టాలలోని సెక్షన్ 230ని జో బైడెన్‌ ఉపసంహరించుకుంటే అది ఫేస్‌బుక్‌కు శరాఘాతం కాగలదు. ఇది చూడ‌టానికి చిన్న చ‌ట్ట‌మే అయినా ప్రభావం మాత్రం చాలా పెద్దది.

 
ప్రజల నుంచి వచ్చే పోస్టుల విషయంలో ఫేస్‌బుక్‌లాంటి సంస్థలను కోర్టులు, విచారణల నుంచి ఈ చ‌ట్టం మినహాయింపులు ఇస్తుంది. ఈ నిబంధ‌న‌ల గురించి బైడెన్ ఎప్ప‌టి నుంచో చెబుతూ వ‌స్తున్నారు.‘‘ఈ చట్టాన్ని వెంటనే తొలగించాలి’’ అని ఏడాది కిందట న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఒకరకంగా ఇది జుకర్ బ‌ర్గ్‌కు ప్రమాద సూచన. అంటే ఫేస్‌బుక్‌లో యూజర్‌లు రాసే పోస్టులు, పరువు నష్టం వ్యాఖ్యలు, తప్పుడు సమాచారాలన్నింటికీ ఫేస్‌బుక్‌ బాధ్యత వహించాల్సి ఉంటుంది.

 
సెక్షన్‌ 230లాంటి రక్షణ లేకుండా ఫేస్‌బుక్ మనుగ‌డ సాగించగలగడం ప్రస్తుత కాలంలో అత్యంత కష్టమైన పని. దీనికి తోడు ఫేస్‌బుక్ మీద పెత్తందారి ఆరోప‌ణ‌లు ఉండనే ఉన్నాయి. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్యాపార‌ గుత్తాధిపత్యం కోసం ఫేస్‌బుక్ ప్ర‌య‌త్నిస్తోందంటూ అమెరికాలోని 46 రాష్ట్రాల నుంచి ఫెడరల్‌ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) ఎదుట ఫిర్యాదులు ఉన్నాయి.

 
ఫేస్‌బుక్ వ్యాపారంపై ప్రభావం పడుతుందా?
గతంలో ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సా‌ప్ కొనుగోళ్ల వ్యవహారాన్ని కూడా పున:పరిశీలించే ఆలోచనలో ఉన్నట్లు ట్రేడ్‌ కమిషన్ సూచనప్రాయంగా తెలిపింది. అంటే ఫేస్‌బుక్ నుంచి ఆ రెండు కంపెనీలను విడదీస్తారని అర్ధం. అయితే ఫేస్‌బుక్ దీనిపై పోరాడవచ్చు. కానీ దానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నవారిలో జో బైడెన్ ఉన్నారు. ‘‘ఫేస్‌బుక్‌లాంటి సంస్థలను విడదీయడం అనే కష్టమైన పని మీద మనం దృష్టి పెట్టాలి’’ అని బైడెన్ 2019లో వ్యాఖ్యానించారు.

 
‘‘యాంటీ ట్రస్ట్ చట్టాలను కఠినంగా అమలు చేయడంపై బైడెన్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుందని నేను అనుకుంటున్నాను. అది డెమొక్రాట్ల కోసం కాకపోయినా యూజర్ల ప్రైవసీ, సంక్షేమం కోసమైనా ఆయన ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టవచ్చు’’ అని కొలంబియాలో మీడియా లీగల్ నిపుణుడిగా పని చేస్తున్న జమీల్‌ జాఫర్‌ వ్యాఖ్యానించారు.

 
టెక్ కంపెనీల మధ్య పోటీ నియంత్రణ విషయంలో ‘యాంటీ ట్రస్ట్ జార్’ అనే కొత్త వ్యవస్థను తీసుకువచ్చే ఆలోచనలో బైడెన్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ట్రంప్ కాలంలో ఫేస్‌బుక్ మీద పెద్దగా విమర్శలు లేవు. పైగా ట్రంప్‌, ఆయన సహచరుల ఫేస్‌బుక్ పోస్టులు విరివిగా షేర్‌ అవుతుండేవి. అయితే ఇటీవల ట్రంప్‌ను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లు పూర్తిగా సస్పెండ్ చేశాయి. ఆ తర్వాత ఆయన వారం రోజులే పదవిలో ఉన్నారు. సంవత్సరం ముందు ఫేస్‌బుక్‌ ఇలా చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.

 
అయితే ట్రంప్‌ను నిషేధించడం ద్వారా డెమొక్రాట్‌ల‌కు తనపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ఫేస్‌బుక్‌ ప్రయత్నించిందని అనుకోవాలి. అధ్యక్షుడిని ఫేస్‌బుక్‌ నుంచి నిషేధించడంకన్నా జో బైడెన్‌ను మంచి చేసుకునే ఉపాయం ఏముంటుంది ? ఇప్పటికైతే బైడెన్ ఫేస్‌బుక్‌నుగానీ, దాని అధినేత జుకర్ బర్గ్‌నుగానీ ఇష్టపడటం లేదు. ఆయన ఏం చేయాలనుకున్నారో ఆ ప‌నిని ఇప్ప‌టికే మొదలుపెట్టార‌ని చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు