Kakinada District-Royal Bengal Tiger: ‘చీకటి పడితే ఈ గ్రామాలన్నీ ఖాళీ.. గుమ్మం దాటి ఎవరూ రావట్లేదు’
శనివారం, 11 జూన్ 2022 (13:15 IST)
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కనుమల వెంబడి పలు ప్రాంతాల్లో ఇటీవల పులి జాడలు స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఆ పులి పలు జీవులను వేటాడడంతో సమీప పల్లెల్లో కలకలం కనిపిస్తోంది. రాత్రి వేళల్లో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
పులి సమాచారం తెలిసిన నాటి నుంచి దాదాపు 15 రోజులుగా కాకినాడ జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ కొనసాగుతోంది. వివిధ ప్రయత్నాలు చేసినా పులి పట్టుబడడం లేదు. రాయల్ బెంగార్ టైగర్‌గా అధికారులు దీనిని నిర్ధరించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో పులి భయంతో కనిపిస్తున్న కొన్ని గ్రామాల్లో బీబీసీ పర్యటించింది. పులి కోసం చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగుతోందన్నది తెలుసుకునే ప్రయత్నం చేసింది.
నిర్మానుష్యంగా పొలాలు
సమీపంలోని కొండలు. దానికి తోడుగా ఏలేరు కాలువ ద్వారా ప్రవహించే నీటితో ఆ ప్రాంతం నిత్యం పచ్చదనంతో ఉంటుంది. సరుగుడు తోటలతో పాటుగా వరి సహా వివిధ పంటల సాగు విస్తారంగా జరుగుతుంది. ఇప్పటికే తొలకరి కురవడంతో, మృగశిర కార్తెలో మొదలెట్టాల్సిన సాగు పనుల సన్నాహాలు చాలా వరకూ నిలిచిపోయాయి. అందుకు ప్రధాన కారణం పులిభయంతో అత్యధికులు పొలాల్లో అడుగుపెట్టే ప్రయత్నం చేయకపోవడమే. పశువులు, వాటి కాపలాదారులు, మేకలు మేపుకునే వారితో కనిపించే వందల ఎకరాల పొలాల్లో బీబీసీ బృందానికి జనం జాడే కనిపించలేదు. సరుగుడు తోటల్లో కూడా జనం అడుగుపెట్టకపోవడంతో నిర్మానుష్యంగా మారిపోయాయి. వ్యవసాయ పనులకు ఆటంకంతోపాటు అనేక ఇతర రోజువారీ కార్యకలాపాలకు పులి భయం ఆటంకంగా మారింది.
దాదాపు నెల క్రితం తొలుత ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి, శరభవరం గ్రామాల సమీపంలో పులి ఆనవాళ్ళు కనిపించాయని ఒమ్మంగి గ్రామ వాసి కొప్పన సత్తిబాబు బీబీసీకి తెలిపారు. "మొదట ఏదో జంతువు వచ్చి మా పశువుల మీద దాడి చేస్తోందనుకున్నాం. రాత్రిళ్లు వచ్చి మా దూడను తీవ్రంగా గాయపరిచింది. పొలంలో మకాం దగ్గర కట్టేసి ఉన్న దూడ మీద దాడి చేయడంతో మరుసటి రోజు అది చనిపోయింది. మా ప్రాంతంలో ఎప్పుడూ పులి వచ్చిన జాడ లేదు. దాడి చేస్తున్న జంతువు ఏమిటా అని మాకు మొదట తెలియలేదు. చివరకు మాకు దగ్గరలో చెరువు దగ్గర పులి అడుగు జాడలు కనబడడం, రోజూ ఎవరో ఒకరి పొలంలో ఆవులు, గేదెల మీద దాడి జరుగుతుండడంతో పులి అని నిర్ధరించుకున్నాం. ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆనవాళ్లతోపాటు సీసీ కెమెరాలతో తీసిన ఫొటోలు, విజువల్స్‌లో పులి కనిపించడంతో మా ప్రాంతంలో కంగారు పెరిగింది. అప్పటి నుంచి పగలు కూడా ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లడానికి సిద్ధం కాలేకపోతున్నారు" అంటూ వివరించారు. ఈ పులి భయంతో ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగు సన్నాహాలు కూడా ఆలస్యం అవుతున్నాయని సత్తిబాబు చెప్పారు.
ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడే ఎందుకు మకాం వేసింది?
మే 27వ తేదీన ఫారెస్ట్ అధికారులకు పులి గురించి సమాచారం అందింది. అదే రోజు వారు రంగంలోకి దిగారు. తొలుత పులి చంపిన ఓ ఆవు దగ్గర కెమెరా ఉంచారు. చెరువు వద్ద పులి అడుగుజాడలతో నిర్ధరించుకున్న అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారులు, ఆ తర్వాత లభించిన ఫోటో ఆధారంగా దానిని రాయల్ బెంగాల్ టైగర్‌గా ఖరారు చేశారు. మే 29 నుంచి పులి కోసం ఆపరేషన్ ముమ్మరం చేశారు. శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి. జూన్ 10 వరకూ ఆ పులి పట్టుబడలేదు. 11 రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. మొదట ఆ పులి ఆనవాళ్లు విజయనగరం జిల్లా ఎస్ కోటలో లభించాయని జిల్లా అటవీశాఖ అధికారి సి సెల్వం బీబీసీకి తెలిపారు.
"ఎస్ కోట సమీపంలో ఒక ఆవుని చంపింది. అయితే అప్పటికి అది పులి అని తెలియదు. ఆ తర్వాత అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతంలోనూ పశువులపై దాడి జరిగింది. కొద్దిరోజుల గ్యాప్‌లో ప్రత్తిపాడు సమీపంలో ఆవులు, గేదెలపై దాడి చేసింది. కాకినాడ జిల్లాలో లభించిన ఆనవాళ్లతో అది రాయల్ బెంగాల్ టైగర్‌గా నిర్ధారించిన తర్వాత నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీతో మాట్లాడాం. ఫోటోలు పంపించాం. ఆ పులి ఎక్కడి నుంచి వచ్చిందనే సమాచారం కోసం ప్రయత్నించాం. కానీ వాళ్ల దగ్గర ఉన్న శాంపిళ్లలో ఆ పులి ఆనవాళ్లు లేవు. దాంతో ఒడిశాలోని మల్కాన్ గిరి వైపు నుంచి వచ్చిందా, లేక చత్తీస్ ఘడ్ లోని టైగర్ రిజర్వ్ జోన్ నుంచి వచ్చిందా అన్నది స్పష్టత రాలేదు. కానీ అది మగ పులి. యుక్తవయసులో ఉన్నట్టుగా తేలింది" అంటూ ఆయన వివరించారు. ఎస్ కోట, నర్సీపట్నం ప్రాంతాల కన్నా ప్రత్తిపాడు సమీపంలో సులువుగా ఆహారం లభించడం, నీటి వనరులు అందుబాటులో ఉండడం, పగలంతా అటవీ ప్రాంతంలో దాక్కోవడానికి అవకాశం ఉండడంతో ఈ ప్రాంతంలో ఎక్కువ రోజులు పాగా వేసినట్టుగా భావిస్తున్నామని డీఎఫ్ఓ సెల్వం చెప్పారు.
ఆపరేషన్ ఎలా సాగుతోంది?
ఈ పులిని కాపాడేందుకు వన్యప్రాణి విభాగం అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో రైతులు, కొన్ని గ్రామాల ప్రజల్లో ఉన్న ఆందోళనలు తొలగించే యత్నంలో ఉన్నామని వారు చెబుతున్నారు. "మొదటి దశలో పులి అని నిర్ధరించుకున్నాం. రెండో దశలో దానిని పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేశాము. ఐదు చోట్ల పెట్టాం. వాటిలో పశుమాంసం పెట్టి పులిని ఆకర్షించాలని చూశాం. దాని దగ్గరగా వచ్చి కూడా తప్పించుకుంది. దాంతో మూడో దశలో ఆ పులిని రిజర్వ్ ఫారెస్ట్ వైపు మళ్లించాలని చూశాం. అన్ని వైపులా మార్గాలను మూసేసి రిజర్వ్ ఫారెస్ట్ వైపు అది వెళ్ళేందుకు వీలుగా ఏర్పాటు చేశాం" అని అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారి సి.సెల్వం చెప్పారు.
"రాజవొమ్మంగి నుంచి అటు పాపికొండలు రిజర్వ్ ఫారెస్ట్ వైపు వెళితే స్థానికులకు సమస్య లేకుండా పోతుందని ఆశించాం. కానీ అది రిజర్వ్ ఫారెస్ట్ లోకి కూడా కొంత దూరం వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చేసింది. దాంతో ఇప్పుడిక చివరి దశలో ప్రత్యేక నిపుణుల బృందాన్ని రంగంలో దింపాం. వెటర్నరీ అధికారులను కూడా సిద్ధం చేశాం. ట్రాంక్విలైజ్ చేసి దానిని పట్టుకోవాలని భావిస్తున్నాం. రిజర్వ్ ఫారెస్ట్ లోకి అది మళ్లితే ప్రజలకు సమస్య తీరుతుంది. లేదంటే మాత్రం మత్తుమందు ఇచ్చి పట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నాం" అని ఆయన చెప్పారు. సులువుగా ఆహారం లభిస్తుండడంతో అది అటవీమార్గం పట్డడానికి సిద్ధపడడం లేదనే అభిప్రాయం కలుగుతోందని ఆయన బీబీసీతో అన్నారు. స్థానికులకు జరిగిన నష్టానికి వెంటనే పరిహారం చెల్లించాలని చెప్పారు.
రాత్రయితే ఏం జరుగుతుందో?
ప్రత్తిపాడు మండలంతో పాటుగా ఏలేశ్వరం మండలంంలోని కొన్ని గ్రామాల్లో పులి ఆనవాళ్లు లభించడంతో అధికార యంత్రాంగం అందరినీ అప్రమత్తం చేసింది. అనేక జాగ్రత్తలు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు. పశువులను పొలాల్లో వదిలి రావద్దని, సురక్షితంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, గ్రామాల్లో రాత్రి వేళ ఒంటరిగా ఉండకూదని, పలు సూచనలతో ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నించారు.
"రాత్రయితే చాలు భయం వేస్తోంది. అందులోనూ కొండకు ఆనుకుని ఇళ్లున్న వాళ్లం వణికిపోతున్నాం. పిల్లలందరినీ గదిలో పడుకోబెట్టి, మగాళ్లు మాత్రం గుమ్మంలో గుంపుగా ఉంటున్నారు. ఓవైపు వేసవి వేడి, రెండో వైపు పులి భయం వెంటాడుతున్నాయి. పులి వల్ల పనులకు కూడా వెళ్లలేకపోతున్నాం. చీకటి పడడంతోనే ఊరంతా ఖాళి అయిపోతుంది. ఎవరూ గుమ్మం దాటి రావడం లేదు. మా చుట్టు పక్కల ఆరేడు ఊళ్లలో ఇదే పరిస్థితి. అందరికీ అవస్థలే" అంటున్నారు ఒమ్మంగి గ్రామానికి చెందిన కాసులమ్మ. ఒమ్మంగి చెరువు సమీపంలో నివసిస్తున్న ఆమె.. పులి భయం వల్ల చాలా సమస్యగా ఉందని బీబీసీకి వివరించారు. త్వరగా పులి దొరికితే తమకు మళ్లీ కొంత ఉపశమనం కలుగుతుందని ఆమె తెలిపారు.
మేకలకు మేత కూడా లేదు
పశు పోషకులకు పులి భయం వెంటాడుతుండడం పెద్ద సమస్యగా మారింది. పశు గ్రాసం అందుబాటులో లేకపోవడం, మేకలకు మేత దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నామని తంగెళ్ల అప్పన్నబాబు తెలిపారు. "పులి జాడ లేకముందు మేకలను సరుగుడు తోటల్లోకి తోలుకెళ్లేవాడిని. సాయంకాలం వరకూ కడుపునిండా మేసి వచ్చేవి. ఇప్పుడు తోటల్లోకి వెళ్లాలంటేనే భయం వేస్తుంది. జాగ్రత్త కోసం ఇంటి చుట్టూనే తిప్పుకోవాల్సి వస్తోంది. మాకు ఎప్పుడూ ఇలా లేదు. పులి కొంచెం దూరం పోయిందని చెబుతున్నారు. కానీ ఎవరూ పొలాలు, తోటల్లోకి వెళ్లలేకపోతున్నారు. అందుకే మేము కూడా దగ్గర దగ్గరే మేకలను తిప్పుతున్నాం." అంటూ విరించారు.
ఆవులు, గేదెలను రాత్రి సమయంలో జాగ్రత్తగా ఉంచుకునేందుకు అదనపు ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సి వస్తుందని అప్పన్నబాబు అన్నారు. పులి సంచారం ఉంది జాగ్రత్త అనే బోర్డులతో పాటుగా పులి కోసం ఏర్పాటు చేసిన బోనులు కూడా బీబీసీ బృందానికి కనిపించాయి. పొదురుపాక, భైరివాక, తిమ్మాపురం వంటి గ్రామాల్లో పులి జాడ కోసం తొలుత ఫారెస్ట్ అధికారులు ఎక్కువగా ప్రయత్నాలు చేశారు. జూన్ 7న ఏలేశ్వరం మండలం తిమ్మరాజు చెరువు ప్రాంతంలో పులి ఇక అడవి వైపు వెళుతుందా లేదా అనేది స్పష్టత రావడం లేదు. మరోవైపు రెస్క్యూ బృందాలు మాత్రం రోజుల తరబడి ఎండ వేడిలో ఆపరేషన్ సాగించడంతో అలసిపోతున్నాయి.
సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వారికి సేదతీరేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అటు అటవీ ప్రాంతానికి సమీపంలోని ఉన్న వివిధ గ్రామాల ప్రజలను ఇటు వన్యప్రాణి విభాగం సిబ్బందిని సతమతం చేస్తున్న ఈ పులి అటు అడవిలోకి మళ్లడం లేదా బోనులో చిక్కడం వంటివి జరిగితే తప్ప ఈ భయాందోళనలకు ముగింపు కనిపించదని స్థానికులు అంటున్నారు. పులి ఆనవాళ్ల కన్నా, అదిగో పులి, ఇదిగో పులి అంటూ వాట్సాప్‌లో చేస్తున్న ప్రచారం కూడా చాలా మందిలో భయం పెంచుతోంది. పుకార్లతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారంటూ ఉత్తరకంచికి చెందిన ఎస్.రమేష్ బీబీసీతో అన్నారు. రెవెన్యూ యంత్రాంగం, పంచాయతీ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ప్రజలకు సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారాలను నమ్మవద్దని చెబుతున్నట్టు ప్రత్తిపాడు రెవెన్యూ అధికారులు బీబీసీకి తెలిపారు.