Monkeypox: మంకీపాక్స్ వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయిందా? ఇది బయోలాజికల్ ఆయుధమా? లాక్‌డౌన్లు తప్పవా?

సోమవారం, 30 మే 2022 (21:46 IST)
కర్టెసి-ట్విట్టర్
మంకీపాక్స్ కేసులు యూరప్‌లో బయటపడుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కోవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పుడు వచ్చినట్లే చాలా వార్తలు, మీమ్‌లు దీనిపై వస్తున్నాయి. వీటిలో కొన్నింటిపై నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

 
లాక్‌డౌన్‌ విధిస్తారా?
కోవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పుడు విధించినట్లే.. ఇప్పుడు కూడా లాక్‌డౌన్ విధిస్తారని ఆన్‌లైన్‌లో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మంకీపాక్స్ లాక్‌డౌన్‌లు’’, ‘‘మంకీపాక్స్ ఆంక్షలు’’కు సిద్ధంగా ఉండాలని కొన్ని మీడియా సంస్థలు వార్తలు కూడా ప్రచురిస్తున్నాయి. మంకీపాక్స్‌పై వస్తున్న ఆందోళనలను అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇది కోవిడ్-19 లాంటి వైరస్ కాదని, దీని వ్యాప్తిని తేలిగ్గానే నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

 
కోవిడ్-19లా అంత తేలిగ్గా ఇది వ్యాప్తి చెందదు. దీనికి సంబంధించి మనకు వ్యాక్సీన్లు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. లక్షణాలు కనిపించిన తర్వాతే, వారి నుంచి ఇన్ఫెక్షన్ సోకే ముప్పుంటుంది. దీని వల్ల ఈ వైరస్ సోకినవారిని గుర్తించడం, ఐసోలేట్ చేయడం చాలా తేలిక. కాబట్టి భారీ స్థాయిలో లాక్‌డౌన్‌లు, పెద్దయెత్తున వ్యాక్సినేషన్‌లు దీనికి అవసరం కాకపోవచ్చని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని పాండెమిక్ సైన్సెస్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీటర్ హార్బీ చెప్పారు.

 
ముఖ్యంగా ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారిని ఐసోలేట్ చేయడం, చికిత్స అందించడం, వారితో దగ్గరగా ఉండేవారికి వ్యాక్సీన్లు ఇవ్వడం లాంటి చర్యలను తీసుకొచ్చని పీటర్ హార్బీ వివరించారు. మరోవైపు భారీ స్థాయిలో వ్యాక్సీన్లు ఇవ్వాల్సిన అవసరంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎమర్జెన్సీ ప్రోగ్రామ్‌కు చెందిన డాక్టర్ రోస్మండ్ లూయిస్ కూడా ధ్రువీకరించారు. ప్రయాణీకులపై ఆంక్షలు విధించకూడదని డబ్ల్యూహెచ్‌వో కూడా సూచిస్తున్నట్లు లూయిస్ వివరించారు.

 
ల్యాబ్ నుంచి లీక్ అయిందా?
ఏదైనా అనుకోని వైరస్ వ్యాప్తి మొదలైనప్పుడు కోవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పటిలానే ప్రజలు ఆలోచించడంలో కొత్తేమీ లేదు. ఈ వైరస్‌ను కూడా చాలా మంది కోవిడ్-19తో పోలుస్తున్నారని ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ డైలాగ్‌ పేర్కొంది. ముఖ్యంగా కోవిడ్-19 వ్యాప్తి సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించిన వార్తలే మళ్లీ ఇప్పుడు కూడా తెరపైకి వస్తున్నట్లు వివరించింది. యుక్రెయిన్, రష్యా, చైనా, అమెరికాలకు చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు, వార్తా సంస్థలు.. మంకీపాక్స్ వైరస్ ఒక ల్యాబ్ నుంచి లీక్ అయిందని చెబుతున్నాయి. మంకీపాక్స్‌ను ఒక బయోలాజికల్ వెపన్‌గా అభివర్ణిస్తున్నాయి.

 
అయితే, ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో దాని డీఎన్‌ఏను పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎలా భిన్నవ్యక్తులకు ఈ వైరస్ వ్యాపించిందో దీని జన్యు సమాచారాన్ని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చని జెనిటిక్ సైంటిస్ట్ ఫాతిమా టోఖమప్షాన్ చెప్పారు. ప్రస్తుతం తెలుసుకున్న జన్యు సమాచారాన్ని పరిశీలిస్తే పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తి చెందే వేరియంట్‌తో దీనికి దగ్గరి సంబంధాలున్నాయి. దీని ప్రకారం ఈ వైరస్‌ను ల్యాబ్‌లో తయారుచేయలేదని చెప్పొచ్చని ఫాతిమా అన్నారు.

 
2018లో బ్రిటన్‌లో కొన్ని మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 2021లోనూ ఇక్కడ కొత్త కేసులు వచ్చాయి. ఆ తర్వాత అమెరికాలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడం లేదా జంతువులను దిగుమతి చేయడం లాంటి కారణాల వల్లే ఈ వైరస్ వ్యాపించినట్లు ఈ కేసులను పరిశీలిస్తే తెలుస్తోంది. ‘‘ఈ కేసులు ఎలా వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోవడం చాలా తేలిక’’అని ప్రొఫెసర్ హార్బీ అన్నారు. బ్రిటన్‌లో నమోదైన తొలి కేసు కూడా నైజీరియా వెళ్లి వచ్చిన వ్యక్తి వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మంకీపాక్స్ ఒక ల్యాబ్ నుంచి లీకయిందని చెప్పడంలో ఎలాంటి నిజమూలదేని హార్బీ వివరించారు.

 
ప్రణాళిక ప్రకారమే జరిగిందా?
పక్కా ప్రణాళిక ప్రకారమే, మంకీపాక్స్ మహమ్మారి వ్యాపించేలా కొందరు కుట్రపన్నారని కూడా ఆన్‌లైన్‌లో ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా బెల్ గేట్స్ లేదా ఆంటొనీ ఫాసీలవైపు అన్ని వేళ్లూ చూపిస్తున్నారు. కోవిడ్-19 వ్యాప్తి సమయంలోనూ ఇలాంటి కుట్ర సిద్ధాంతానే వ్యాపించాయి. రష్యా మీడియాలో, చైనా సోషల్ మీడియా సైట్ వీబో, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ వార్తలు కనిపిస్తున్నాయి. మరోవైపు రొమేనియా, జర్మన్, బ్రిటన్, సౌదీ అరేబియా, స్లోవేనియా, హంగరీ, భారత్, ఫ్రాన్స్‌లలోని ఫేస్‌బుక్ పేజీల్లోనూ ఇవి వైరల్ అవుతున్నాయి.

 
అమెరికాకు చెందిన బయోసెక్యూరిటీ ఆర్గనైజేషన్ ద న్యూక్లియర్ థ్రెడ్ ఇనీషియేటివ్ (ఎన్‌టీఐ) సిద్ధంచేసిన ఒక డాక్యుమెంట్‌ను దీనికి ఆధారంగా చూపిస్తున్నారు. భవిష్యత్‌లో ఎదురయ్యే మహమ్మారులను అడ్డుకునే దిశగా ప్రపంచ నాయకులను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2021లో ఎన్‌టీఐ ఒక వర్క్‌షాప్ నిర్వహించింది. ఒకవేళ మహమ్మారులు వ్యాపిస్తే ఎలా స్పందిస్తారో వివరించారని దీనిలో ప్రపంచ నాయకులకు సూచించారు. దీనిలో ఉదాహరణగా మంకీపాక్స్ వైరస్‌ను పేర్కొన్నారు. మంకీపాక్స్‌పై ఎదురయ్యే ముప్పుపై ఇప్పటికే పరిశోధకులకు అవగాహన ఉండటంతో.. ప్రాణాంతక మంకీపాక్స్ వైరస్‌ను ఎన్‌టీఐ ఉదాహరణగా తీసుకుంది. అప్పటికి ఈ కేసులు కూడా కొన్ని దేశాల్లో పెరుగుతుండటంతో దీన్ని ఎంచుకున్నారు. కాబట్టి ఆ వర్క్‌షాప్‌లో పాల్గొన్న నాయకులే ఈ వైరస్ వ్యాప్తికి కారణమని ఆరోపించడం కూడా సరికాదు.

 
కోవిడ్-19 వ్యాక్సీన్లతో మంకీపాక్స్‌కు సంబంధముందా?
ఈ ఆరోపణల్లో రెండు కోణాలున్నాయి. వీటిలో మొదటిది ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌లో చింపాంజీల్లో వ్యాపించే వైరస్‌ను ఉపయోగించడం. అయితే, ఆ వైరస్‌ను అచేతనం చేశారు. కాబట్టి అది వ్యాపించే అవకాశం ఉండదు. అయితే, చింపాంజీల వైరస్ వల్లే ప్రస్తుతం మంకీపాక్స్ వ్యాపిస్తోందని సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు చేస్తున్నారు. మంకీపాక్స్ పూర్తి భిన్నమైన వైరస్ వల్ల వ్యాపిస్తోందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రాజెనెకాలో ఉపయోగించిన వైరస్‌తో దీనికి ఎలాంటి సంబంధమూ లేదు.

 
ఇక రెండో వాదన ఏమిటంటే.. కోవిడ్-19 వ్యాక్సీన్ల వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడిందని, అందువల్లే ఇతర ఇన్ఫెక్షన్లు చాలా తేలిగ్గా సోకుతున్నాయని చెబుతున్నారు. ఈ ఆరోపణలకు కూడా ఎలాంటి ఆధారాలూ లేవు. రోగ నిరోధక వ్యవస్థను వ్యాక్సీన్లు మెరుగుపరుస్తాయి. వీటి వల్ల సదరు వ్యాధితో పోరాడే శక్తి పెరుగుతుంది. అయితే, వ్యాధి నిరోధక శక్తి సమస్యలుండే కొద్దిమంది మాత్రం ఈ వ్యాక్సీన్లతో ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఉంటుంది. అయితే, అలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవు.
 
(ఓల్గా రాబిన్‌సన్, బీబీసీ మానిటరింగ్ సాయం అందించారు)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు