నాసా: చంద్రుడి మీదకు మళ్లీ మనిషిని పంపించటం కోసం కొత్త స్పేస్‌సూట్ ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే
సోమవారం, 21 అక్టోబరు 2019 (12:51 IST)
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. చంద్రుడి మీదకు మళ్లీ మనిషిని పంపించటం కోసం సరికొత్త స్పేస్‌సూట్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త తరం స్పేస్‌సూట్ నమూనా క్లోజప్ లుక్‌ను నాసా చీఫ్ జిమ్ బ్రిడెన్‌స్టైన్ విడుదల చేశారు. ఎక్స్ఈఎంయూ (ఎక్స్‌ప్లొరేషన్ ఎక్స్ట్రావెహిక్యులార్ మొబిలిటీ యూనిట్) సూట్ అని పిలుస్తున్న ఈ కొత్త స్పేస్‌సూట్.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉపయోగించే స్పేస్‌సూట్ లాగానే కనిపిస్తోంది.
అయితే.. చంద్రుడి మీద కదలటానికి అనువుగా సౌకర్యవంతంగా ఉండేలా దీనిని మెరుగుపరచినట్లు నాసా పేర్కొంది. ఒరియాన్ క్రూ సర్వైవల్ సిస్టమ్‌ను కూడా జిమ్ ప్రదర్శించారు. ఈ ఆరెంజ్ ఫ్లైట్ సూట్, హెల్మెట్‌ను.. ఒరియాన్ అంతరిక్షనౌక ప్రయోగానికి, తిరిగి భూమి మీదకు రావటానికి అందులోని సిబ్బంది ఉపయోగిస్తారు.
ఇప్పటివరకూ ఉపయోగించిన అంతరిక్ష నౌక స్థానంలో ఓరియాన్‌ను కొత్తగా ప్రవేశపెట్టారు. పాత అంతరిక్ష నౌక వ్యవస్థకు భిన్నంగా చంద్రుడి మీదకు, అంతరిక్షంలోని ఇతర లక్ష్యాల మీదకు వ్యోమగాములను తీసుకువెళ్లి, తీసుకురావటం కోసం దీనిని డిజైన్ చేశారు. కొత్త మూన్ సూట్ ఎక్స్‌ఈఎంయూను.. దానిని తొడిగేవారి కొలతలు ఎలా ఉన్నాకూడా సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేశారు.
దీనివల్ల ప్రస్తుత పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. గత మార్చిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పూర్తిగా మహిళలతో అంతరిక్ష నడక నిర్వహించాలన్న ప్రణాళికను.. నాసా వ్యోమగామి ఆన్ మెక్‌క్లైన్ సైజుకు తగిన స్పేస్‌సూట్ అందుబాటులో లేకపోవటంతో రద్దు చేయాల్సి వచ్చింది.
వాషింగ్టన్ డీసీలోని నాసా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వేదిక మీద.. ఎరుపు, తెలుపు, నీలి రంగుల్లోని ఎక్స్‌ఈఎంయూ సూట్‌ను హూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు చెందిన అంతరిక్షనౌక ఇంజనీర్ క్రిస్టీన్ డేవిస్ ధరించి ప్రదర్శించారు. ''క్రిస్టీన్ ధరించిన స్పేస్‌సూట్.. మనం చంద్రుడి మీదకు వెళ్లినపుడు మన వ్యోమగాములందరికీ సరిపోతుంది'' అని జిమ్ ప్రేక్షకులకు తెలిపారు.
కొత్త సూట్ ధరించిన వ్యోమగాములకు భుజాల వద్ద మరింత ఎక్కువ కదలికలకు వీలుంటుందని.. తలపైకి కూడా చేతులను కదిలించవచ్చునని స్పేస్‌క్రాఫ్ట్ ఇంజనీర్ అమీ రాస్ చెప్పారు. అపోలో శకం నాటి స్పేస్‌సూట్లకు ఈ సామర్థ్యం లేదు. అలాగే.. నడుము దగ్గర కూడా బేరింగ్ అనే పరికరం ద్వారా వ్యోమగాములు మరింత ఎక్కువగా కదిలే వెసులుబాటు లభిస్తుంది. కాళ్ల మీద కూడా మరో మూడు బేరింగ్స్ ఉండటంతో.. నడుము కింది శరీర భాగం మరింతగా కదిలించేందుకు వీలుంటుంది.
డేవిస్.. చేతులు గుండ్రంగా తిప్పటం, కాళ్ల మీద కూర్చుని లేవటం, వేదిక మీద ఒక రాయిని తీసుకోవటానికి వెనక్కు వంగటం ద్వారా తాను ధరించిన స్పేస్‌సూట్‌తో శరీర కదలికలకు ఎంత వెసులుబాటు ఉందో ప్రదర్శించారు. అపోలో మిషన్ల సమయంలో చంద్రుడి మీద ధూళి వ్యోమగాముల స్పేస్‌సూట్‌లకు అంటుకుని లోపలివరకూ చేరిందని.. ఈ కొత్త స్పేస్‌సూట్‌లలో బేరింగ్స్‌లోని సీల్స్.. ఆ ధూళి లోపలికి రాకుండా అడ్డుకుంటుందని అమీ రాస్ వివరించారు. ధూళిని దూరంగా ఉంచే కొత్త పదార్థాలను ఈ సూట్ తయారీకి ఉపయోగించారు.
ఈ సూట్‌లో 100 శాతం ఆక్సిజన్ వాతావరణం ఉంటుంది. పాత స్పేస్‌సూట్లు ధరించినపుడు వ్యోమగాములు తమ శరీరాల్లోని నైట్రోజన్‌ను బయటకు పంపించటానికి ''శ్వాసకు ముందు సమయం'' గడపాల్సి వచ్చేది. కొత్త సూట్లలో ఆ అవసరం ఉండదు. వీటిని ధరించిన వెంటనే పనిలోకి దిగవచ్చు.
ఈ సూట్‌లో వ్యోమగామికి సుమారు ఎనిమిది గంటల పాటు గాలి అందుతుంది. అత్యవసర పరిస్థితిలో ఉపయోగించటానికి అదనంగా మరో గంట సేపటికి సరిపడా గాలి కూడా ఉంటుంది. ఓరియాన్ క్రూ సర్వైవల్ సిస్టమ్ గురించి జేఎస్‌సీ ప్రాజెక్ట్ మేనేజర్ డస్టిన్ గోమర్ట్ వివరించారు.
''అంతరిక్షంలోని లక్ష్యానికి తీసుకువెళ్లి, మళ్లీ ఇంటికి క్షేమంగా తీసుకువచ్చే సూట్ ఇది. ఇది మానవ శరీరానికి, (ఓరియాన్ క్రూ మాడ్యూల్) సీటుకు తగిన విధంగా రూపొందించాం'' అని చెప్పారు. అంతరిక్షనౌక శూన్యంలో లేదా శూన్యానికి దగ్గరగా ఉండే పరిస్థితుల్లో ప్రయాణించేటపుడు నౌక అంతర్భాగం.. వాయు పీడనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలా ప్రమాదవశాత్తూ సంభవించే వాయుపీడన లోపం నుంచి వ్యోమగాములకు రక్షణ కల్పించటం ఈ సూట్ల ప్రధాన లక్ష్యం.
''ఈ సూట్‌లో మనం సురక్షితంగా ఉండొచ్చు. ఇందులో ఆశ్రయం పొందొచ్చు. అనూహ్య పరిస్థితులు తలెత్తినపుడు ఇది మన శరీరాన్ని నిర్దిష్ట సమయం పాటు 8 పీఎస్ఐ (చదరపు అడుగుకు పౌండ్ శక్తి) మేర ఉండేలా చూస్తుంది. ఆ తర్వాత మన శరీరం 4.3 పీఎస్‌ఐకి తగ్గుతుంది. ఆ పరిస్థితుల్లో ఆరు రోజుల పాటు ఉండవచ్చు'' అని ఆయన తెలిపారు.
''మన శరీరం కన్నా కేవలం రెండు అంగుళాలే పెద్దదైన ప్రాంతం (స్పేస్ సూట్)లో ఆరు రోజుల పాటు ఉండగలగటం మామూలు విషయం కాదు'' అని పేర్కొన్నారు.