పవన్‌ కల్యాణ్ టు పాస్వాన్: బీజేపీ చిన్న చిన్న పార్టీలను ఎన్డీయేలోకి ఎందుకు ఆహ్వానిస్తోంది?

గురువారం, 20 జులై 2023 (19:50 IST)
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎక్కువ సంఖ్యలో చిన్న పార్టీలను తనతో కలుపుకునేపోయేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మంగళవారం నాటి తరహా సమావేశాల ద్వారా, కొత్త పార్టీలను తమ కూటమిలో చేర్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ సంకేతాలు ఇస్తోంది. ఈ సమావేశానికి ఒక రోజు ముందుగా చిరాగ్ పాస్వాన్ కూడా ఎన్‌డీఏలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణించడంతో లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జేపీ నడ్డాతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో చిరాగ్ పాస్వాన్ తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
చిరాగ్ పాస్వాన్‌తోపాటు బిహార్‌లోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన ఉపేంద్ర కుశ్వాహా, వికాస్‌ శీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముఖేశ్ సాహ్నీ, జీతన్ రాం మాంఝీ కూడా సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లోని అజిత్ పవార్ పక్షం ప్రతినిధులు కూడా మంగళవారంనాటి సమావేశానికి వచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ నుంచి జనసేన పార్టీ (ఎన్‌ఎస్‌పీ) నాయకుడు పవన్ కల్యాణ్ కూడా. ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న పార్టీలలో చాలా పార్టీల సంఖ్యాబలం ఒకట్రెండుగానే ఉంది. ఒక్క ఎంపీ కూడా లేని జనసేనను ఎన్టీయే సమావేశానికి బీజేపీ ఆహ్వానించింది. మరి ఇలాంటి సంఖ్యాబలం లేని పార్టీలను సైతం బీజేపీ ఎందుకు ఎన్డీయేలోకి పిలుస్తోంది. దీని వెనకున్న రాజకీయ వ్యూహమేంటి.
 
చిన్న పార్టీలతో..
1998లో ఎన్‌డీఏ ఏర్పడినప్పుడు దీనిలో 24 పార్టీలు చేరాయి. అయితే, అప్పటి ఎన్‌డీఏకు నేటి ఎన్‌డీఏకు చాలా తేడా ఉంది. ఒకప్పటి మిత్రపక్షాలైన శివసేన (విడిపోవడానికి ముందు), అకాలీ దళ్ ప్రస్తుతం బీజేపీతో లేవు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్‌డీఏను మరోసారి విస్తరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఉత్తర్ ప్రదేశ్‌లో ఫలితాలను కూడా ఇచ్చాయి. పూర్వాంచల్‌లోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరైన ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కూడా మళ్లీ ఎన్‌డీఏ గూటికి వచ్చేశారు.
 
వెనుకబడిన వర్గాలకు చెందిన రాజ్‌భర్‌కు ఉత్తర్ ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతంలో మంచి ప్రాబల్యముంది. మరోవైపు ఇదే ప్రాంతానికి చెందిన సంజయ్ నిషాద్ ఇప్పటికే ఎన్‌డీఏలో కొనసాగుతున్నారు. రాజ్‌భర్‌కు చెందిన సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నాలుగేళ్ల క్రితం ఎన్‌డీఏతో సంబంధాలను తెంచుకుంది. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందుగా మళ్లీ ఆ పార్టీని ఎన్‌డీఏలోకి తీసుకురావడంలో బీజేపీ విజయం సాధించింది. ఎన్‌డీఏలోకి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ రాకతో ఇక్కడి కుల సమీకరణాలతోపాటు చిన్న పార్టీలను మళ్లీ బీజేపీ ఎలా తమ గూటికి తెచ్చుకుంటోందనే అంశంపైనా చర్చ జరుగుతోంది.
 
ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో కొన్ని చిన్న పార్టీలతో బీజేపీ కలిసి పనిచేయాలని భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇలాంటి పార్టీల మద్దతు ఎంత అవసరమో పార్టీకి అర్థమైందని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాదితో పోలిస్తే, దక్షిణాన బీజేపీ కాస్త బలహీనంగా ఉంది. అక్కడ ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. దక్షిణ భారత దేశంలో మొత్తంగా 130 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. తమిళనాడులో బీజేపీకి ప్రధాన మిత్రపక్షంగా అన్నాడీఎంకే కనిపిస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ(టీడీపీ)ని కూడా ఎన్డీయేలో కలవడానికి సంకేతాలు పంపుతోంది.
 
గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 303 సీట్లు వచ్చాయి. పార్టీ ఓటింగ్ కూడా 37 శాతం వరకూ ఉంది. అలాంటప్పుడు ప్రస్తుతం చిన్న పార్టీలతో జత కట్టాలని బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తోంది? ఈ ప్రశ్నపై సీనియర్ జర్నలిస్టు నీరజా చౌధరి మాట్లాడుతూ.. ‘‘బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితే ప్రస్తుతం కనిపిస్తోంది. కానీ, నేడు ప్రతిపక్షాలు ఏకం అవుతున్న నేపథ్యంలో.. ఎలాంటి రిస్కూ తీసుకోకూడదని భావిస్తోంది. ఇక్కడ నరేంద్ర మోదీ లాంటి నాయకుడు విపక్షాల దగ్గర లేరనీ బీజేపీకి తెలుసు. అయినప్పటికీ ఎన్‌డీఏను పునర్‌వ్యవస్థీకరించి ప్రజల్లోకి కొత్తగా తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది. దిల్లీలో జరిగిన సమావేశానికి హాజరైన చాలా పార్టీలకు లోక్‌సభలో ఒకటి లేదా రెండు స్థానాలు మాత్రమే ఉన్నాయి. కొన్నింటికి అసలు లోక్‌సభలో ప్రాతినిధ్యమే లేదు’’ అని ఆమె అన్నారు.
 
‘‘దిల్లీలో సమావేశానికి 38 పార్టీలు హాజరుకాబోతున్నాయని ముందుగానే బీజేపీ ప్రకటించింది. ఈ విషయంపై మీడియాలో చర్చ జరిగేలా పార్టీ చూసుకుంది. రాజకీయం అంటేనే చదరంగం లాంటి ఆట. ఇక్కడ మనకు ఎంత బలం ఉందో ప్రజలకు తెలియజేయడం చాలా ముఖ్యం. ఈ నంబర్లను చూపిస్తూ ప్రజలకు బీజేపీ సందేశం ఇవ్వాలని భావిస్తోంది’’ అని ఆమె చెప్పారు. ‘‘విపక్షాల సమావేశానికి 26 పార్టీలు హాజరైతే తమ సమావేశానికి 38 పార్టీలు వచ్చాయని దీని ద్వారా బీజేపీ చెప్పాలని భావిస్తోంది’’ అని ఆమె అన్నారు.
 
చిన్న పార్టీలు బీజేపీ దగ్గరకు ఎందుకు వస్తున్నాయి?
అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఒంటరిగానే ముందుకు వెళ్తామనే సంకేతాలనూ బీజేపీ ఇస్తోంది. దీనికి ఉదాహరణగా హరియాణాను చెప్పుకోవచ్చు. ‘‘మొత్తం పది సీట్లలోనూ బీజేపీకే విజయాన్ని ఇవ్వండి’’ అని తాజాగా ఒక ఎన్నికల ర్యాలీలో ఇక్కడ అమిత్ షా చెప్పారు. ఇక్కడి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కానీ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీతో జేడీఎస్ కూడా కలిసి పని చేయొచ్చనే వార్తలు వస్తున్నాయి.
 
గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌లలోని చాలా పార్టీలు ఎన్‌డీఏలో భాగంగా పోటీ చేశాయి. కానీ, వీటిలో కొన్ని పార్టీలు ఆ తర్వాత విపక్షాల కూటమిలో చేరాయి. లేదంటే విడిగా పోటీ చేసేందుకు మొగ్గు చూపాయి. జేడీయూను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు కొన్ని పార్టీలు ఎన్‌డీఏ నుంచి దూరంగా వెళ్లాయనే అంశంపై లోక్‌నీతి-సీఎస్‌డీఎస్‌ డైరెక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ ఎన్‌డీఏ నుంచి దూరంగా వెళ్లిన పార్టీలకు సైద్ధాంతికంగా ఎలాంటి విభేదాలు లేవు. ఉదాహరణకు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ పార్టీని తీసుకోండి. ఆయన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారు. ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్‌ గెలిస్తే, తనకు మంచి పదవి వస్తుందని ఆయన ఆశించారు. కానీ, అలా జరగలేదు’’ అని సంజయ్ కుమార్ చెప్పారు.
 
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఇలాంటి కూటముల నుంచి బయటకు వచ్చి పోటీ చేయడం మామూలే. ఇక్కడ సీట్లు ఎక్కువగా ఉంటాయి. పైగా కుల, ఐడెంటిటీ పాలిటిక్స్ ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనం 30 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే, ప్రాంతీయ పార్టీల ఓటింగ్ శాతం అసెంబ్లీ ఎన్నికల్లో పెరుగుతుందని, లోక్‌సభ ఎన్నికల్లో తగ్గుతుందని తెలుస్తుంది’’ అని ఆయన అన్నారు. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు నరేంద్ర మోదీని చూసి ఓటు వేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఇదే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్‌డీఏలో చేరి నరేంద్ర మోదీ ప్రజాదరణను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నాయని చెప్పారు.
 
‘‘చిన్న పార్టీలను నియంత్రించడం తేలిక’’
ఈ ఏడాది మే నెలలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ‘‘ప్రాంతీయ పార్టీలను మిత్రపక్షాలుగా బీజేపీ చూడటం లేదనే భావన కొందరిలో ఉంది. దీన్ని తొలగించేందుకు మనం కృషి చేయాలి’’ అని ఈ భేటీలో సీఎంలకు మోదీ సూచించారు. అంతేకాదు, ప్రాంతీయ పార్టీలను మళ్లీ ఎన్‌డీఏలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వాస్తవానికి కొన్ని పెద్ద, పాత ప్రాంతీయ పార్టీలు 2014 నుంచి ఎన్‌డీఏకు దూరం అవుతూ వచ్చాయి. శిరోమణి అకాలీ దళ్, తెలుగుదేశం పార్టీ, శివసేన (విడిపోవడానికి ముందు), జేడీయూలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 
అసలు ఈ పార్టీల్లో బీజేపీ విషయంలో ఉన్న ఆందోళనల గురించి నీరజా చౌధరి మాట్లాడుతూ.. ‘‘బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే తమను పట్టించుకోరనే భయం చాలా పార్టీల్లో ఉంది. గతంలో ఇది నిజమైన సందర్భాలు చాలా ఉన్నాయి కూడా’’ అని ఆమె చెప్పారు. ‘‘అయితే, చిన్న పార్టీలను ఒకే తాటిపైకి తీసుకురావడంతో బీజేపీతోపాటు ఈ పార్టీలకూ ప్రయోజనాలు ఉంటాయి. ఇలాంటి చిన్నచిన్న పార్టీలను నియంత్రించడం బీజేపీ తేలిక. మరోవైపు ఈ చిన్న పార్టీలకు బీజేపీ రూపంలో జాతీయ వేదిక దొరుకుతుంది’’ అని ఆమె చెప్పారు.
 
ప్రస్తుతం కనిపిస్తున్న, భవిష్యత్‌లో కనిపించే ఇలాంటి కూటములన్నీ సైద్ధాంతికపరమైన కూటములు కాదని, ఇవి కేవలం అవకాశవాద రాజకీయ కూటములని సంజయ్ కుమార్ భావిస్తున్నారు. ఈ చిన్న పార్టీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూటములు మారుతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. పట్నా, బెంగళూరులలోని విపక్షాల సమావేశాల తర్వాత బీజేపీ కూడా వేగంగా పావులు కదుపుతోంది.
 
అయితే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి విజయం సాధించడం అంత కష్టమేమీ కాకపోవచ్చనీ, కానీ, సీట్లు తగ్గిపోకుండా చూసుకోవడమనేదే పార్టీకి ప్రస్తుత ప్రధాన సమస్యని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘’40 నుంచి 50 సీట్లు తగ్గిపోయినా.. 2014, 2019 తర్వాత ఉన్నట్లు కొత్త ప్రభుత్వం ఉండకపోవచ్చు. అందుకే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు బీజేపీ చాలా ప్రయత్నిస్తోంది’’ అని నీరజా అన్నారు. ‘‘అదే విపక్షాల విషయానికి వస్తే, ఇది జీవన్మరణ పోరాటం లాంటిది. ఇక్కడ మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే, కొన్ని ప్రాంతీయ పార్టీల ఉనికికే ముప్పు’’ అని ఆమె చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు