రాష్ట్రపతి ఎన్నికలు: మోదీ-అమిత్ షాలు బీజేపీని దళిత, గిరిజన, ఓబీసీ పార్టీగా మారుస్తున్నారా?

మంగళవారం, 19 జులై 2022 (19:00 IST)
భారత్‌లో ప్రధానమంత్రి ఓబీసీ వ్యక్తి. రాష్ట్రపతి పదవి కోసం వారు ప్రకటించిన అభ్యర్థి ఆదివాసీ. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి కోసం కూడా ఎన్డీయే, ఓబీసీ వ్యక్తినే తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. గతేడాది జరిగిన కేంద్ర క్యాబినెట్ విస్తరణ తర్వాత ప్రస్తుతం మంత్రివర్గంలో 27 మంది ఓబీసీ, 12 మంది ఎస్సీ, 11 మంది మహిళా మంత్రులు ఉన్నారు. దేశంలోని అగ్ర నాయకత్వానికి సంబంధించిన ఈ కుల విశ్లేషణను స్వయంగా బీజేపీనే ప్రకటించింది.

 
బీజేపీ ఎప్పుడూ ఇలా లేదని ఈ పార్టీ గురించి దశాబ్దాలుగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులు నమ్ముతున్నారు. వాజ్‌పేయి, అడ్వాణీ కాలంలో బీజేపీని 'ఉన్నత తరగతి', 'ఉన్నత కులాల' పార్టీగా పరిగణించేవారు. అయితే, మోదీ-షా హయాంలో ఈ ఉన్నత కులాల పార్టీ అనే ముసుగును తీసివేసి, ఓబీసీ-దళిత్-ఆదివాసీ పార్టీ అనే ట్యాగ్‌ను ధరించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ రెండు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఒకవేళ బీజేపీలో ఓబీసీ, దళితులకు అధిక ప్రాధాన్యం లభిస్తుంటే అగ్రనాయకుల పరిస్థితి ఏంటి? బీజేపీతో అనుబంధం ఉన్న అగ్రవర్ణాలకు ఇది కోపం తెప్పించదా? పార్టీ, ప్రభుత్వ రూపురేఖల్ని మార్చేందుకు ప్రయత్నించడం వల్ల బీజేపీకి కలిగే లాభమేంటి?

 
రూపు రేఖలు మార్చేందుకు బీజేపీ ప్రయత్నం
సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) ప్రొఫెసర్, విశ్లేషకుడు సంజయ్ కుమార్ దీని గురించి మాట్లాడారు. ''బ్రాహ్మణ బనియా వంటి నాయకుల పార్టీగా మారడం ద్వారా బీజేపీ, 24-28 శాతం మాత్రమే ఓట్లు పొందే పార్టీగా ఉంటుంది. వాజ్‌పేయి హయాంలో ఆ పార్టీకి ఇంతే శాతం ఓట్లు దక్కాయి. ఒకవేళ బీజేపీ సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, భారత రాజకీయాల్లో ఆధిపత్యాన్ని ఇలాగే కొనసాగించాలంటే ఆ పార్టీ దళితులు, ఓబీసీలు, వెనకబడిన ముస్లిం( దళిత ముస్లింలు లేదా పస్మాంద ముస్లింలు) వర్గాలలోకి అడుగుపెట్టాలి. బీజేపీ ఉద్దేశం స్పష్టంగా అర్థం అవుతుంది. సంఖ్యను పెంచుకోవడమే వారి ఉద్దేశమని తెలుస్తోంది'' అని అన్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల్లోకి పార్టీని తీసుకెళ్లడంపైనే బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది.

 
అనేక మీడియా కథనాల ప్రకారం, బీజేపీ అగ్ర నాయకత్వం ఎక్కువగా వెనకబడిన ముస్లింలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌లో చాలా ఏళ్లుగా కులగణన జరగలేదు. కానీ, అంచనాల ప్రకారం జనాభాలో ఓబీసీలు 45-48 శాతం, దళితులు-గిరిజనులు సుమారుగా 22.5 శాతం, పస్మాంద ముస్లింలు దాదాపుగా 8.5 శాతం ఉంటారు. అగ్రవర్ణాల జనాభా సుమారు 15-18 శాతం ఉంటుంది. సీఎస్‌డీఎస్ గణాంకాల ప్రకారం, అటల్-అడ్వాణీ (1999-2004) కాలంలో బీజేపీ మొత్తం ఓటు శాతం 28గా ఉండేది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇది 31 శాతానికి పెరిగింది. 2019 నాటికి ఇది మరింత పెరిగి 37 శాతానికి చేరుకుంది.

 
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో బీజేపీ ఇలా విస్తరించడానికి ఆయన అనుసరించిన దళిత్-ఓబీసీ అనే రాజకీయ వ్యూహం దాగి ఉందని సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇదే కారణంతో క్యాబినెట్ విస్తరణ దగ్గర నుంచి రాష్ట్రపతి అభ్యర్థి, ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక వరకు అన్నిచోట్లా బీజేపీ, ఓబీసీ-దళితుల ప్రస్తావన తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. ''ఒక్కసారి దళితుల, ఓబీసీలతో కూడిన పార్టీగా అవతరిస్తే, వచ్చే పదేళ్ల వరకు ఎలాంటి ఢోకా ఉండదని బీజేపీకి తెలుసు'' అని సంజయ్ కుమార్ అన్నారు.

 
కుల గుర్తింపు రాజకీయాలు
ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌ఖడ్, రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మూ... పదవుల్లోని వచ్చాక తమ కులాల సమస్యల కోసం గళమెత్తరు. మరి, అలాంటప్పుడు వారి కులాలకు చెందిన నిర్దిష్ట ఓటు బ్యాంకు, బీజేపీ వైపు ఎలా మళ్లుతుంది? గుజరాత్ యూనివర్సిటీలో సోషియాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గౌరంగ్ జానీ దీనికి వివరణ ఇచ్చారు. ''ఒక కులానికి చెందిన పెద్ద నాయకుడిని, ఉన్నత పదవి కోసం ఎంపిక చేసుకుంటే, ఆ పార్టీకి సవాళ్లు పెరుగుతాయి. కేవలం సింబాలిక్ కోసమే వారిని ఎంపిక చేసుకుంటారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రతీకాత్మక ప్రాతినిధ్యం వేగంగా పెరిగింది. 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్' అని చూపెట్టుకోవడం కోసం దీన్ని వాడుకుంటున్నారు. మా క్యాబినెట్‌లో ఇంతమంది ఓబీసీలు ఉన్నారు, దళితులు ఉన్నారు అని పదే పదే బీజేపీ చెప్పుకోవడం కూడా ఇందుకే. తొలిసారిగా రాష్ట్రపతి పదవి ఆదివాసీ మహిళకు దక్కనుంది. ఉపరాష్ట్రపతి పదవికి ఓబీసీ వ్యక్తిని అభ్యర్థిగా ఎన్నుకున్నారు.

 
కుల రాజకీయాలపై బీజేపీ ఎందుకు శ్రద్ధ పెట్టింది?
కుల సమీకరణాల పట్ల బీజేపీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిన్న పార్టీలతో పొత్తులు, రాజ్యసభ టిక్కెట్ల పంపకాలను కారణంగా చెప్పొచ్చు. రానున్న రోజుల్లో గుజరాత్‌తో పాటు ఆదివాసీలు ఎక్కువగా ఉన్న పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని... రాష్ట్రపతి పదవికి ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించినట్లు నిపుణులు భావిస్తున్నారు. అలాగే, ఉపరాష్ట్రపతి పదవిగా అభ్యర్థిగా జగ్‌దీప్ ధన్‌ఖ‌ఢ్‌ను ఎంచుకోవడాన్ని, వచ్చే ఏడాది రాజస్థాన్, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో ముడిపెడుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో జాట్‌ల జనాభా ఎక్కువగా ఉంటుంది.

 
ధన్‌ఖడ్, రాజస్థాన్‌లోని ఝుంఝునూకు చెందినవారు. ఇక్కడ జాట్‌లు, ఓబీసీ పరిధిలోకి వస్తారు. ''జాతీయ స్థాయిలో అగ్రవర్ణ రాజకీయాలు బాగానే ఉన్నాయి. కానీ, రాష్ట్రాల్లో పాగా వేయాలనుకుంటే మాత్రం కులం అనేది ముఖ్యం'' అని గౌరాంగ్ జానీ అన్నారు. ''గత కొన్నేళ్లుగా ప్రజలు హిందుత్వతో పాటు తమ కుల గుర్తింపు పట్ల కూడా జాగ్రత్తగా ఉంటున్నట్లు కనిపిస్తున్నారు. భారత్‌లో చాలా కులాలకు సొంత సమూహాలు, వెబ్‌సైట్‌లు ఉన్నాయి. కులాల వారీగా వార్షిక సమావేశాలు కూడా జరుగుతాయి. హిందుత్వ గుర్తింపుతో పాటు కుల అస్తిత్వంతో ప్రజలు ముడిపడి ఉన్నారు. హిందుత్వ రాజకీయాల నుంచి బీజేపీ సాధించాల్సిన దానికంటే చాలా ఎక్కువ సాధించింది. హిందుత్వ అనే గొడుగును తీసేస్తే హిందువులు కులాలుగా చీలిపోయి కనిపిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఓట్ల పరంగా చూస్తూ ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు చాలా ముఖ్యం'' అని ఆయన వివరించారు.

 
అగ్రవర్ణాలకు బీజేపీలో పూర్వ వైభవం లేదా?
అలాగని మోదీ-షాల కేబినెట్‌లో అగ్రవర్ణాలకు చోటు లేదని కాదు. రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ లాంటి వారు అగ్రకులస్తులే. స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు స్వయంగా బాహ్మణుడు. ప్రస్తుతం కేబినెట్ లో 27మంది ఓబీసీలు ఉంటే, 30మంది అగ్రవర్ణాలకు చెందిన వారు ఉన్నారు. "ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి, మురళీ మనోహర్ జోషి, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ వంటి బ్రాహ్మణ నేతలంతా బీజేపీ పార్లమెంటరీ పార్టీలో ఉండేవారు. బీజేపీకి అగ్రవర్ణాల పార్టీ అన్న ఇమేజ్ ఉండేది. మోదీ దేశానికి తొలి ఓబీసీ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన వచ్చిన తర్వాత అమిత్ షా యూపీకి ఇంచార్జ్ అయ్యారు. సోషల్ ఇంజినీరింగ్‌ పై చాలా కృషి చేశారు. దాని ఫలితం 2014, 2017లో స్పష్టంగా కనిపించింది. నరేంద్ర మోదీ రాక తర్వాత బీజేపీ వ్యూహంలో పెద్ద మార్పు వచ్చింది'' అని జర్నలిస్ట్ విజయ్ త్రివేది అన్నారు.

 
త్రివేది కొన్ని దశాబ్దాలుగా బీజేపీ వార్తలను కవర్ చేస్తున్నారు. బీజేపీపై ఆయన నాలుగు పుస్తకాలు రాశారు. ''బీజేపీలోని అగ్రవర్ణాల్లో ఆగ్రహం ఉన్న మాట వాస్తవమే. దానికి మరో కోణం కూడా ఉంది. ఇప్పుడు భారత రాజకీయాల్లో అగ్రవర్ణాల ఓటుకు అంత విలువ లేదు. ఓబీసీలు 45-48 శాతం ఉన్నారు. దళితులు ఆదివాసీలు 22 శాతం ఉన్నారు. అగ్రవర్ణం అనేది ప్రత్యేక ఓటు బ్యాంకు కాదు. బ్రాహ్మణులు, బనియాలు వేరు వేరు పార్టీలకు ఓటు వేస్తారు. నాయకత్వం ఓబీసీల చేతిలో ఉన్నప్పుడు మార్పు తప్పకుండా కనిపిస్తుంది'' అన్నారు త్రివేది. అలాగని బీజేపీలోని అగ్రవర్ణాలు చిన్నబోవాల్సిన అవసరం లేదంటారు త్రివేది.

 
''ఇంతకు ముందు మీరు నాలుగు బెట్‌రూమ్‌ ఫ్లాట్‌లో ఒక్కళ్లే ఉండేవాళ్లనుకుందాం. తర్వాత ఒక్కొక్కళ్లుగా ఆ ఇంట్లోకి వచ్చి చేరారు. ఉన్న నాలుగు రూముపై మీ హక్కు తగ్గింది అంతే'' అన్నారు త్రివేది. అగ్రవర్ణాలకు ఇదే సూత్రం వర్తిస్తుందని త్రివేది అన్నారు. బీజేపీలో వారికి రాజకీయంగా బలంగానీ, హోదాగానీ తగ్గలేదు. మొత్తం మంత్రివర్గంలో దాదాపు 30 మంది అగ్రవర్ణాల మంత్రులు ఉన్నారు. అంటే కేబినెట్‌లో వారి వాటా దాదాపు 40 శాతం. కానీ కులాల పరంగా అగ్రవర్ణాలది మొత్తం జనాభాలో 15-20 శాతమేనని త్రివేది విశ్లేషించారు. భారత దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాల చరిత్ర మండల్‌కు ముందు, మండల్‌కు తర్వాత అన్నట్లుగా మారింది. మండల్‌కు ముందు ఓబీసీలు, దళిత ఆదివాసీలు అందరూ కాంగ్రెస్‌తో ఉండేవారు. మండల్ కమిషన్ ఏర్పాటు తర్వాత ఈ ఓటు బ్యాంకు ప్రాంతీయ పార్టీలకు చీలిపోయింది.

 
ఇప్పుడు అగ్రవర్ణాలకు మరో ఆప్షన్ లేదని సంజయ్‌కుమార్‌ అన్నారు. వారు కాంగ్రెస్‌లోకి వెళ్లలేరు. ఇక ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా కులాల ప్రాతిపదికన ఏర్పడతాయి. దీని కారణంగా, బీజేపీ ప్రధాన ఓటు వారి నుంచి వస్తోంది. దళిత, గిరిజనులు ఓబీసీ ఓటు బ్యాంకుకు అదనంగా చేరుస్తోంది బీజేపీ. ఇప్పుడే ఈ వర్గాలను బీజేపీ ఆకట్టుకుంటున్నా, వాటిని సంఘటిత పరచడం ఇంకా మొదలు కాలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు