ఇక నాతో ట్విట్టర్‌లో ఎవరు యుద్ధం చేస్తారు : సుష్మా మరణంపై పాక్ మంత్రి ట్వీట్

బుధవారం, 7 ఆగస్టు 2019 (11:01 IST)
భారత మాజీ విదేశాంగ మంత్రి, బీజేపీ సీనియర్ మహిళా నేత సుష్మా స్వరాజ్ మృతిపట్ల పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాజ్ హుస్సేన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇకపై తనతో ఎవరు ట్విట్టర్ యుద్ధం చేస్తారంటూ ప్రశ్నిస్తూ, సుష్మా స్వరాజ్ కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 
 
సుష్మా స్వరాజ్ మంగళవారం అర్థరాత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఆమెకు గుండెపోటు రాగానే ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌కు కుటుంబ సభ్యులు తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సుష్మా మృతిపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, ఇతర రాజకీయ పార్టీల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
అలాగే, దాయాది దేశం పాకిస్థాన్ మంత్రి ఫవాజ్ హుస్సేన్ కూడా సుష్మా స్వరాజ్ మృతిపై తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. "సుష్మా స్వరాజ్‌గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆమెతో ట్విట్టర్ యుద్ధాన్ని నేను మిస్ అవుతా. సుష్మ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం గట్టిగా పోరాడే వ్యక్తి' అంటూ ప్రశంసించారు. 
 
పాకిస్థాన్‌లో మైనారిటీలైన హిందూ యువతులను ఎత్తుకెళ్లి బలవంతంగా మాతమార్పిడి చేపట్టి వివాహం చేసుకుంటున్నారని సుష్మ ట్విట్టర్‌లో విమర్శించారు. ఫవాజ్ దాన్ని ఖండించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ట్విట్టర్‌లో చిన్నస్థాయి యుద్ధం నడిచింది. దాన్నే తాజాగా ఫవాద్ ప్రస్తావించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు