హమ్లీస్‌: ముఖేశ్ అంబానీ చేతికి ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన బొమ్మల షాపు

శుక్రవారం, 10 మే 2019 (19:18 IST)
ఫోటో క్రెడిట్: HAMLEYS
ప్రపంచంలోనే అతిపెద్దదైన, పురాతనమైన బొమ్మల విక్రయశాల హమ్లీస్‌ను భారత్‌లోనే అత్యంత ధనిక వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కొనుగోలు చేశారు. అయితే, హమ్లీస్ సొంతం చేసుకునేందుకు ఎంత మొత్తం చెల్లించారన్నది బయటకు వెల్లడి కాలేదు. చైనాకు చెందిన సి బ్యానర్ ఇంటర్నేషనల్ నుంచి హమ్లీస్‌ను కొనుగోలు చేసే ఒప్పందంపై సంతకం చేసినట్టు రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ పేర్కొంది.
 
''అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన హమ్లీస్‌ సంస్థను ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకోవాలన్న మా చిరకాల స్వప్నం నేడు నెరవేరింది" అని రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ సీఈఓ దర్శన్ మెహత్ పేర్కొన్నారు. 1760లో స్థాపించిన బొమ్మల విక్రయ సంస్థ హమ్లీస్‌ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైంది.
 
ఆ సంస్థకు 18 దేశాల్లో 167 దుకాణాలున్నాయి. దీన్ని 2015లో సి బ్యానర్ ఇంటర్నేషనల్ కొనుగోలు చేసింది. తాజాగా రిలయన్స్‌కు విక్రయించింది. ఇప్పటికే రిలయన్స్ భారత్‌లోని 29 నగరాల్లో 88 హమ్లీస్‌ను దుకాణాలను నడుపుతోంది.
 
ఫోర్బ్స్ పత్రిక అంచనా ప్రకారం 62 ఏళ్ల ముఖేశ్ అంబానీ ఆస్తుల విలువ సుమారు రూ.3.6 లక్షల కోట్లు. కిందటి సంవత్సరం హమ్లీస్‌ సుమారు రూ.84 కోట్ల నష్టాన్ని చవి చూసింది. బ్రెగ్జిట్, అంతర్జాతీయ తీవ్రవాదం దీనికి ప్రధాన కారణాలని ఆ సంస్థ పేర్కొంది. బ్రిట‌‌న్‌లో ప్రారంభించిన నాలుగు దుకాణాల్లో రెండిటిని మూసివేసింది.
 
కానీ, లండన్‌లోని రీజెంట్ స్ట్రీట్‌లో 1881లో ప్రారంభించిన హమ్లీస్ ప్రధాన దుకాణం ఇప్పటికీ ప్రముఖ పర్యాటక ఆకర్షణగా కొనసాగుతోంది. ఏడు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ దుకాణంలో 50వేల రకాలకుపైగా బొమ్మలు అమ్మకానికి ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు