'సుఖ' వివాహాలు, అక్కడ అర్థగంటకి ఓ అమ్మాయిని పెళ్లాడవచ్చు...
శనివారం, 5 అక్టోబరు 2019 (16:51 IST)
ఏమిటీ సుఖ వివాహం? సుఖ వివాహం - 'నికా ముత్తా' అనేది షియా ముస్లింలు మహిళలకు కొంత డబ్బులు చెల్లించి తాత్కాలికంగా పెళ్లి చేసుకునే వివాదాస్పద మతాచారం. సున్నీ మెజారిటీ దేశాల్లో 'మిశ్యా' పేరుతో జరిగే పెళ్లిళ్లు కూడా ఇలాంటివే.
ఒక పురుషుడు ప్రయాణ సమయంలో ఒక భార్యను తోడు తీసుకెళ్లటానికి వీలుగా ఈ ఆచారం మొదలైందని చెప్తారు. కానీ ఇప్పుడు పరిమిత కాలంలో తాత్కాలిక లైంగిక సంబంధాల కోసం దీనిని వాడుకుంటున్నారు. ఈ ఆచారం గురించి ముస్లిం మేధావుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది వ్యభిచారానికి చట్టబద్ధత కల్పిస్తోందని కొందరు అంటుంటే.. తాత్కాలిక పెళ్లిళ్ల గడువు ఎంత ఉండాలనే దాని మీద ఇంకొందరు చర్చిస్తుంటారు.
ఈ ఆచారం మీద బీబీసీకి చెందిన ఇరాకీ, బ్రిటిష్ జర్నలిస్టుల బృందం 11 నెలల పాటు రహస్యంగా పరిశోధన నిర్వహించింది. మత గురువులను సంప్రదించింది. లైంగిక దోపిడీకి గురైన మహిళలను కలిసింది. 'సుఖ వధువుల'ను తెచ్చి పెళ్లి చేయాలంటూ మత గురువులకు డబ్బులు చెల్లించిన పురుషులతో మాట్లాడింది. వీటన్నిటినీ రహస్యంగా వీడియో చిత్రీకరించింది.
ఇరాక్‌లో 15 సంవత్సరాల యుద్ధం తర్వాత దాదాపు పది లక్షల మంది ఈ దేశ మహిళలు భర్తలను కోల్పోయి వితంతువులుగా మారారని, అంతకన్నా ఎక్కువ మంది నిర్వాసితులయ్యారని అంచనా. ఈ నేపథ్యంలో పేదరికంలో కూరుకుపోయిన చాలా మంది మహిళలు, బాలికలు.. సుఖ వివాహాలకు అంగీకరించే పరిస్థితులు నెలకొన్నాయని బీబీసీ బృందం గుర్తించింది.
''అరగంటకో మహిళను పెళ్లిచేసుకోవచ్చు''
ఇరాక్‌లో అత్యంత పవిత్రమైన రెండు మసీదులు గల ప్రాంతాల్లో సుఖ వివాహాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని బీబీసీ బృందం పరిశోధనలో వెల్లడైంది. షియా ముస్లింలకు అత్యంత ముఖ్యమైన మసీదుల్లో ఒకటైన బాగ్దాద్‌లోని ఖదీమియాలో 10 మంది మత గురువులను బీబీసీ బృందం సంప్రదించింది. వారిలో ఎనిమిది మంది తాము సుఖ వివాహాలు జరుపుతామని చెప్పారు. సగం మంది అయితే.. 12 లేదా 13 సంవత్సరాల వయసు గల బాలికతో ఈ సుఖ వివాహం జరిపిస్తామని ముందుకొచ్చారు.
ప్రపంచంలో అతిపెద్ద షియా తీర్థ కేంద్రమైన కర్బలాలో నలుగురు మత గురువులను బీబీసీ బృందం సంప్రదించింది. వారిలో ఇద్దరు.. చిన్నవయసు బాలికలతో సుఖ వివాహాలు జరిపించటానికి అంగీకరించారు. నలుగురు మత గురువులతో సంప్రదింపులను రహస్యంగా వీడియో చిత్రీకరించారు. ఈ పెళ్లిళ్ల కోసం తాము మహిళలను తెచ్చిపెడతామని ముగ్గురు చెప్తే.. బాలికలను కూడా సరఫరా చేస్తామని వారిలో ఇద్దరు చెప్పారు.
సుఖ వివాహాలకు షరియా చట్టంలో ఎటువంటి కాల పరిమితీ లేదని బాగ్దాద్‌లోని ఒక మత గురువు సయ్యిద్ రాద్.. బీబీసీ రహస్య ప్రతినిధితో పేర్కొన్నారు. ''ఒక పురుషుడు తను కోరుకున్నంత మంది మహిళలను పెళ్లి చేసుకోవచ్చు. ఒక మహిళను అర గంట సేపు పెళ్లి చేసుకోవచ్చు. అది పూర్తయిన వెంటనే మరొక మహిళను పెళ్లి చేసుకోవచ్చు'' అని చెప్పారు.
''బాలికతో కోరుకున్నట్లు చేసుకోవచ్చు''
ఒక చిన్నారితో సుఖ వివాహం చేసుకోవటం ఆమోదనీయమేనా అని బీబీసీ రహస్య ప్రతినిధి అడిగినపుడు.. ''ఆమె కన్యత్వం కోల్పోకుండా జాగ్రత్తగా ఉంటే చాలు'' అని సయ్యిద్ రాద్ బదులిచ్చారు. ''ఆ చిన్నారితో ఫోర్ ప్లే చేయొచ్చు. ఆమెతో పడుకోవచ్చు. ఆమె శరీరాన్ని, వక్షోజాలను తాకవచ్చు. కానీ ముందు నుంచి అంగ ప్రవేశం చేయకూడదు. కానీ ఆనల్ సెక్స్ చేయవచ్చు'' అని చెప్పుకొచ్చారు. ఆ బాలిక గాయపడితే ఏమవుతుందని అడిగితే.. ''ఆమె ఆ నొప్పిని భరించగలదా లేదా అన్నది.. నీకు, ఆ బాలికకు మధ్య జరిగే విషయం'' అని తేల్చేశారు.
ఓ 12 ఏళ్ల బాలికను సుఖ వివాహం చేసుకోవటానికి అనుమతి ఉంటుందా అని కర్బలాకు చెందిన మరో మత గురువు షేక్ సలావిని బీబీసీ రహస్య ప్రతినిధి అడిగారు. ''ఉంది. తొమ్మిది సంవత్సరాలు దాటితే సమస్య అనేదే లేదు. షరియా ప్రకారం సమస్యే లేదు'' అని ఆయన సమాధానం చెప్పారు. అయితే.. సయ్యిద్ రాద్ తరహాలో సలావీ కూడా ఆ బాలిక కన్యనా కాదా అన్నది మాత్రమే ఏకైక అంశమని పేర్కొన్నారు. ''ఫేర్ ప్లే చేయొచ్చు.. ఆ బాలిక అంగీకరిస్తే ఆనల్ సెక్స్ చేయొచ్చు'' అంటూ ''నువ్వు కోరుకున్నట్లు చేసుకోవచ్చు'' అని సలహా ఇచ్చారు.
ఫోన్‌లో పెళ్లి.. కలయిక చట్టబద్ధం...
ఒక చిన్నారితో ఈ సుఖ వివాహం జరిపించే ప్రక్రియను పరీక్షించటానికి బీబీసీ ప్రతినిధి.. 'షైమా' అనే ఒక 13 ఏళ్ల బాలిక ఉందని.. ఆమెతో తనకు సుఖ వివాహం జరిపించాలని సయ్యిద్ రాద్‌తో చెప్పారు. నిజానికి అటువంటి బాలిక ఎవరూ లేరు. బీబీసీ బృందంలోని మరొక జర్నలిస్టు ఆ బాలికగా నటిస్తూ ఫోన్‌లో మాట్లాడారు. బీబీసీ ప్రతినిధి కల్పించి చెప్పిన బాలిక కుటుంబాన్ని కలవాలని కానీ, వారితో కనీసం మాట్లాడాలని కానీ సయ్యిద్ రాద్ అడగలేదు. బీబీసీ ప్రతినిధితో కలిసి ఒక ట్యాక్సీలో కూర్చుని ఫోన్‌లోనే ఆ కల్పిత బాలికతో పెళ్లి జరిపించటానికి అంగీకరించాడు.
''షైమా, ఇతడిని పెళ్లి చేసుకోవటానికి నువ్వు సమ్మతిస్తున్నావా? ఇతడు ఒక రోజుకు 1,50,000 దీనార్లు చెల్లిస్తాడు'' అని ఫోన్‌లో ఆ కల్పిత బాలికను అడిగాడు. ''ఇప్పుడు మీ ఇద్దరికీ పెళ్లయింది. మీరిద్దరూ కలవటం చట్టబద్ధం'' అని చెప్పాడు. అతడు కొన్ని నిమిషాలు పట్టిన ఈ తంతు కోసం బీబీసీ ప్రతినిధి నుంచి 200 డాలర్లు వసూలు చేశాడు. కల్పితమైన 13 ఏళ్ల బాలిక బాగోగుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు
''మతపరంగా చట్టబద్ధం.. పాపం కాదు''
మత గురువులు అందించే అపరిచితులతో సెక్స్ కోసం తరచుగా సుఖ వివాహాలు చేసుకునే ఒక వివాహితుడితో బీబీసీ బృందం మాట్లాడింది. ''పన్నెండేళ్ల బాలిక అంటే ఖరీదైన వ్యవహారం. ఎందుకంటే ఆమె ఇంకా 'ఫ్రెష్' కనుక. మత గురువులకే 500 డాలర్ల నుంచి 800 డాలర్ల వరకూ ఆదాయం వస్తుంది'' అని అతడు చెప్పాడు. తన ప్రవర్తనకు మతం ఆమోదం ఉందని అతడి నమ్మకం. ''సుఖ వివాహం మతపరంగా చట్టబద్ధమని ఒక మత గురువు చెప్తే.. అది పాపం కిందకు రాదు'' అని పేర్కొన్నాడు.
బాలికలను మనుషులుగా కాకుండా అంగడి వస్తువులుగా పరిగణిస్తున్నారని మహిళా హక్కుల ఉద్యమకారిణి యానార్ మొహమ్మద్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇరాక్ వ్యాప్తంగా మహిళా ఆశ్రయాల వ్యవస్థను ఆమె నిర్వహిస్తున్నారు. ''ఈ అంగడి వస్తువులను నిర్దిష్ట పద్ధతుల్లో ఉపయోగించటానికి అనుమతి ఉంది. అయితే.. కన్యత్వాన్ని అలాగే ఉంచుతారు. భవిష్యత్తులో 'పెద్ద విక్రయం' కోసం'' అని వ్యాఖ్యానించారు. ఆమె చెప్తున్న 'పెద్ద విక్రయా'నికి అర్థం పెళ్లి.
ఒకవేళ బాలిక కన్యత్వాన్ని కోల్పోయినట్లయితే ఆమెను పెళ్లికి పనికిరానిదానిగా పరిగణిస్తారు. అంతేకాదు.. తమ పరువుకు భంగం కలిగించిందంటూ ఆమె కుటుంబమే ఆమెను చంపేసే ప్రమాదం కూడా ఉంది. ''ఇక్కడ మూల్యం చెల్లించేది ఎల్లప్పుడూ బాలికలు లేదా మహిళలే...'' అని యానార్ చెప్పారు.
''ఈ బాలిక వద్దంటే మరో బాలికను తెచ్చిపెడతా..''
సుఖ వివాహాల కోసం బాలికలను తెచ్చిపెడతామని చెప్తున్న మత గురువులతో సంభాషణలను బీబీసీ పరిశోధన బృందం రహస్యంగా వీడియో చిత్రీకరించింది. ఒక మత గురువు తనను ఇలాంటి ఒక సుఖ వివాహం పేరుతో లైంగిక దోపిడీకి గురిచేశాడని ఆరోపించిన ఒక మైనర్ బాలిక వాంగ్మూలాన్ని కూడా బీబీసీ బృందం రికార్డు చేసింది. ఆమె చెప్తున్న దానిని మరికొందరు సాక్షులు సమర్థించారు కూడా.
బీబీసీ ప్రతినిధి సంప్రదించిన ఒక మత గురువు ఒక బాలికను తీసుకువచ్చి 24 గంటల సుఖ వివాహానికి ప్రతిపాదించాడు. ఈ దృశ్యాన్ని కూడా బీబీసీ బృందం రహస్యంగా చిత్రీకరించింది. వాస్తవానికి సదరు మత గురువు తార్పుడు పనిచేస్తున్నట్లే (పింప్‌గా వ్యవహరిస్తున్నట్లే) ఉంది. బీబీసీ ప్రతినిధి ఆ సుఖ వివాహానికి తిరస్కరించగా.. ఆ బాలికను వద్దనుకుంటే టీనేజీ బాలికను తీసుకువస్తానని కూడా సదరు మత గురువు ఆఫర్ చేశాడు.
అలా చేస్తుంటే అది నేరం.. శిక్షించి తీరాలి''
ఇరాక్‌లో ఉన్నత శ్రేణి షియా మత గురువుగా ఉన్న ఘాయిత్ తామిమి.. ఛాందసత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు దేశం విడిచి పెట్టి లండన్‌లో తలదాచుకోవాల్సి వస్తోంది. మహిళలను దోపిడీ చేయటానికి సుఖ వివాహాలను వాడుకుంటున్న మత గురువులను.. ముఖ్యంగా బాలికలతో ఇలాంటి వివాహాలకు ఆమోదం తెలుపుతున్న వారిని తామిమి ఖండించారు. ''ఆ వ్యక్తి చెప్తున్న మాటలు ఓ నేరం.. చట్టం కింద శిక్షించి తీరాలి'' అని ఆయన పేర్కొన్నారు.
పిల్లలతో లైంగిక చర్యలకు ఇస్లామిక్ చట్టం అనుమతిస్తోందని కొందరు షియా మత పెద్దలు రాశారు. ఈ ఆచారాలను ఖండించాలని షియా పెద్దలకు తామిమి పిలుపునిచ్చారు. బీబీసీ బృందం రహస్య పరిశోధనలో వీడియో చిత్రీకరించిన మత గురువుల్లో ఇద్దరు.. తాము షియా ఇస్లాంకు అత్యంత ప్రముఖుల్లో ఒకరైన అయతొల్లా సిస్తానీ అనుచరులమని చెప్పారు.
అయితే అయతొల్లా సిస్తానీ బీబీసీకి ఇచ్చిన ఒక ప్రకటనలో.. ''మీరు చెప్తున్న పద్ధతిలో ఈ ఆచారాలు జరుగుతున్నట్లయితే మేం వీటిని నిర్మొహమాటంగా ఖండిస్తున్నాం. మహిళల గౌరవాన్ని, మానవీయతను చిన్నచూపు చేసే విధంగా సెక్స్‌ను విక్రయించటానికి తాత్కాలిక వివాహాలను ఒక సాధనంగా ఉపయోగించుకోవటానికి అనుమతి లేదు'' అని పేర్కొన్నారు. ఇరాకీ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీ అరబిక్‌తో మాట్లాడుతూ, ''మత గురువుల మీద మహిళలు పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయకపోతే, అధికారులు చర్యలు తీసుకోవటం కష్టం'' అని చెప్పారు.