ఈ ఉగాదితో మనం 2019లోకి కాదు... 1941లోకి వెళ్తున్నాం...
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (18:42 IST)
ఉగాది అంటే తెలుగువారికి కొత్త సంవత్సరం అనే తెలుసు. ఈ ఉగాది తెలుగువారిని 1941వ సంవత్సరంలోకి ఉత్తరాది వారిని 2076వ సంవత్సరంలోకి తీసుకువెళుతోంది. అదేంటీ..? 2019, 1941, 2076 సంవత్సరాల లెక్కేంటి?
మనుషులు కాలాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టిన తరువాత కేలండర్ తయారు చేసుకుని సంవత్సరాలు లెక్కించడం మొదలుపెట్టారు. ప్రతి నాగరికతా సంస్కృతీ తనదైన పద్ధతిలో కాలాన్ని లెక్కపెట్టేది. కాలాన్ని శకాలు, యుగాలు, సంవత్సరాలు, నెలలు, పక్షాలు.. ఇలా విభజించుకున్నారు. లెక్కించే విధానాన్ని బట్టి ఆయా కాలాల్లో అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి అది సాగింది.
సంవత్సరానికి సరిగ్గా 365 రోజులు కాకుండా ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి లీపు సంవత్సరాలు, అధిక మాసాలు వచ్చాయి. ఇదంతా కేలండర్ సంగతి. మరి అసలు ఇది ఎన్నో సంవత్సరం? ఈ సంవత్సరాల లెక్క మొదలైంది క్రీస్తు పుట్టుకతోటేనా?
విశ్వం పుట్టుక, భూమి పుట్టుక, మనిషి పుట్టుక ఎప్పుడనే దానిపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అవి తేలే వరకూ సంవత్సరాలు లెక్కపెట్టకుండా ఉండలేం కదా. అందుకోసం, సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిట్కా ఉపయోగించారు పూర్వీకులు. బాగా గుర్తుండిపోయే పెద్ద సంఘటన నుంచి, అంటే ప్రవక్తల పుట్టక, యుద్ధంలో విజయాలు, పట్టాభిషేకాల నుంచి సంవత్సరాలను లెక్క వేయడం మొదలుపెడతారు. దాన్నే శకం అంటారు.
ఎవరి సంస్కృతికి తగ్గట్టు వారు శకాన్ని లెక్కపెట్టడం మొదలుపెట్టారు. దానికి అనుగుణంగా వారి కేలండర్‌లో నెలలు ఉంటాయి. అలా జీసస్ క్రైస్ట్ పుట్టిన ఏడాది నుంచి లెక్కబెడితే క్రీస్తు శకం అయింది. అంటే ఇంగ్లిష్ కేలండర్ ప్రకారం ఇప్పుడు మనం క్రీస్తు శకం 2019లో ఉన్నాం.
ప్రాచీన భారతదేశంలో ఈ శకాన్ని కలియుగం మొదలైనప్పటి నుంచి లెక్కేసేవారు. హిందువుల నమ్మకం ప్రకారం శ్రీకృష్ణుడు చనిపోయినప్పటి నుంచి ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభం అవుతుంది. కాబట్టి, శ్రీకృష్ణుడు చనిపోయాడని హిందువులు నమ్మే ఏడాది నుంచి.. అంటే ఇంగ్లిష్ కేలండర్‌లో క్రీస్తు పూర్వం 3102 లేదా 3104వ సంవత్సరం నుంచి కలియుగాబ్దిగా భారతీయ హిందువులు లెక్కపెడుతూ వచ్చారు.
అంటే ఇప్పుడు కలియుగం 5120 వ సంవత్సరం. కానీ ఇప్పుడా శకం పెద్దగా ప్రాచుర్యంలో లేదు. దాని స్థానంలో మరో రెండు శకాలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. ఒకటి విక్రమాదిత్య శకం, రెండు శాలివాహన శకం. ఆంధ్రలోని అమరావతి కేంద్రంగా పాలించిన గౌతమీ పుత్ర శాతకర్ణి పట్టాభిషిక్తుడైన నాటి నుంచీ శాలివాహన శకం ప్రారంభం అయింది. అలా ఇప్పటికి 1940 ఏళ్లు గడిచి 1941 లోకి అడుగుపెడుతున్నాం. తెలుగు, కన్నడ, మరాఠీ ప్రజలు ఈ కేలండర్ వాడతారు.
ఇక ఉత్తర భారతీయులు విక్రమాదిత్యుడు అనే రాజు పట్టాభిషిక్తుడైన నాటి నుంచి సంవత్సరాలు లెక్కపెడుతున్నారు. అలా ఇప్పటికి 2075 ఏళ్లు గడిచి 2076లోకి అడుగుపెడుతున్నాం. ఇంగ్లిష్ కేలండర్ డిసెంబర్ 31న మారినట్టుగా ఈ శాలివాహన, విక్రమ శకాలు ఉగాది రోజున మారతాయి. అంటే ఇది తెలుగు వారికి 1941వ సంత్సరం కాగా.. ఉత్తరాది వారికి 2076వ సంవత్సరం అన్నమాట. ఈ శాలివాహన శకం, క్రీస్తు శకం కంటే 79 సంవత్సరాలు ఆలస్యం. విక్రమాదిత్య శకం, క్రీస్తు శకం కంటే 58 సంవత్సరాలు ముందు ఉంది.
ఈ నంబర్లతో పాటూ సంవత్సరాలను గుర్తు పెట్టకోవడానికి ప్రతి ఏడాదికీ ఒక్కొక్క పేరు చొప్పున 60 పేర్లు ఎంపిక చేసి వాటిని రొటేషన్‌లో వాడతున్నారు. అవే ఈ హేవళంబి, విళంబి వంటి పేర్లు. ఇక జనవరి నుంచి డిసెంబర్ వరకూ నెలలుండే ఇంగ్లిష్ కేలెండర్ అసలు పేరు గ్రెగొరియన్ కేలండర్. ఇప్పుడు గ్రెగొరియన్ కేలండర్‌లో 2019వ సంవత్సరం నడుస్తోంది. అంటే క్రీస్తు పుట్టి 2019 ఏళ్ళు.
అంతకుముందు యూరోపియన్లు జూలియన్ కేలండర్లు వాడేవారు. అది క్రీస్తు కంటే 47 ఏళ్లు పాతది. ఇప్పటికీ కొన్ని చర్చిలు ఆ కేలండర్ వాడతాయి. రోమన్లు ఈజిప్టును జయించినప్పటి నుంచీ ఈ జూలియన్ కేలండర్ వచ్చింది. 1582లో చాలా యూరోప్ దేశాలు జూలియన్ కేలండర్ నుంచి గ్రెగొరియన్ కేలండర్ కి వచ్చాయి. మన దేశానికి బ్రిటిష్ వారితో పాటూ ఈ గ్రెగొరియన్ కేలండర్ వచ్చింది. ఇప్పుడు భారతీయలంతా, ఆ మాటకొస్తే ప్రపంచమంతా గ్రెగొరియన్ కేలండర్ వాడుతున్నారు.
బౌద్ధులు గౌతమ బుద్ధుడి నిర్యాణం నుంచి శకాన్ని లెక్కిస్తారు. ప్రస్తుత 2019 సంవత్సరం బౌద్ధ కేలండర్ ప్రకారం 2560-61 అవుతుంది. క్రీస్తు పుట్టడానికి బుద్ధుడు చనిపోవడానికి మధ్య ఉన్న 543 సంవత్సరాల తేడా ఆ కేలండర్‌లో కనిపిస్తుంది. (బౌద్ధ కేలండర్ లెక్కింపు విషయంలో బౌద్ధ సంప్రదాయాల మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.) ఇక ముస్లింల హిజ్రీ కాలెండర్ ప్రకారం ఇది 1440వ సంవత్సరం. మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు వెళ్లిన ఏడాది నుంచి దీన్ని లెక్కిస్తున్నారు. ఇది క్రీస్తు శకం కంటే 623 సంవత్సరాలు తరువాత వస్తుంది.
జైన మతస్తులు ఉత్తరభారతీయలు వాడే విక్రమాదిత్య శకాన్నే ఉపయోగిస్తారు. గతంలో సిక్కులు కూడా విక్రమాదిత్య శకమే వాడేవారు.కానీ 1998 నుంచీ సిక్కులు కొత్తగా నానక్ సాహీ కేలండర్ ఉపయోగిస్తున్నారు. క్రీ.శ.1469లో గురునానక్ పుట్టారు. అప్పటి నుంచి లెక్కవేస్తే ఇది 550వ సంవత్సరం. చైనా వాళ్లకి సొంత కేలండర్, పంచాంగం, జ్యోతిష్యం చాలా ఉన్నాయి. ఇది చైనా వాళ్ళకు 4717వ సంవత్సరం.
మనకు ఏది అఫీషియల్ కేలండర్?
భారతీయులతో సహా ప్రపంచమంతా ఇప్పుడు ఇంగ్లిష్ వారు పరిచియం చేసిన గ్రెగొరియన్ కేలండర్ మాత్రమే నడుస్తోంది. కానీ ప్రాచీన నాగరికత ఉన్న దేశాలు, వివిధ మతాలను అధికారికంగా అనుసరించే దేశాలు మాత్రం ఇంగ్లిష్ కేలండర్‌తో పాటు తమ సొంత కేలండర్లు వాడుతున్నాయి. అలా భారత ప్రభుత్వం అధికారికంగా శాలివాహన శకాన్ని ఉపయోగిస్తుంది. అందుకే భారత ప్రభుత్వ గెజిట్లపై శాలివాహన తిథి ఉంటుంది. ఆల్ ఇండియా రేడియోలో ఉదయాన్నే ఆ కేలండర్ తేదీ చెబుతారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత జాతీయ కేలండర్ కమిటి ఒకటి వేశారు. ఆ కమిటి ఇచ్చిన నివేదికను1957లో ఆమోదించి శాలివాహన శకాన్ని భారత జాతీయ కేలండర్‌గా తీసుకున్నారు. ఆ కేలండర్ ఆమోదించడానికి ముందు, భారత రాజ్యాంగం హిందీ ప్రతిలో మాత్రం విక్రమాదిత్య శకాన్ని వాడారు. అందులో రాజ్యాంగం తీసుకున్న తేదీగా ఇంగ్లీషులో '1949 నవంబరు 26' నూ, హిందీలో '2006వ సంవత్సరం మార్గశిర శుక్ల సప్తమి' అని రాశారు.
వ్యవసాయం కోసం పంచాంగం.. వ్యాపారం కోసం శాలివాహన శకం...
వ్యవసాయ అవసరాల కోసం పంచాంగం తయారయింది అంటారు చరిత్రకారులు సాయి పాపినేని. శాలివాహన శకం పుట్టుక వాణిజ్య అవసరాల కోసం జరిగిందని ఆయన వివరిస్తారు. శాతవాహనుల చరిత్రపై సాయి పాపినేని అధ్యయనం చేసి ఆంధ్ర నగరి పుస్తకరం రాశారు.
"వ్యవసాయం ఎప్పుడు మొదలైందో అప్పుడు కేలండర్ మొదలైంది. ఋగ్వేదంలో ఆత్రేయ పరంపర సౌరమానం ప్రకారం కేలండర్ తయారుచేసింది. వ్యవసాయానికి సంబంధించిన కేలండర్లన్నీ సూర్యుడి ప్రకారం ఉంటాయి. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ సమీపంలోని మురారిదొడ్డి దగ్గర 3,500 సంవత్సరాల క్రితం కాలాన్ని లెక్కించడానికి పాతిన నిలువురాళ్లు ఉన్నాయి. వాటిని ఎంతో పక్కాగా అమర్చారు. వాటి నీడ ఆధారంగా ఉత్తరాయణం, దక్షిణాయణం లెక్కించేవారు.
ఆర్యభట్ట అశ్మకీయంలో క్రీస్తు పూర్వం 3102లో యుగారంభం అయింది అని చెప్పాడు. సింధునాగరికత (మొదటి హరప్పా) అప్పుడే మొదలైంది. ఆయన శిష్యులు కొందరు, ముఖ్యంగా చాళుక్య రాజు రెండో పులమావి దగ్గర కవి రవికీర్తి ఆ క్రీస్తు పూర్వం 3102 కలియుగారంభంగా చెప్పాడు. కర్ణాటకలోని అయ్యవోలు శాసనంలో ఈ విషయం ఉంది.
క్రీస్తు పూర్వం 57 లో విక్రమాదిత్యుడు శకం మొదలుపెట్టిన పదేళ్ల తరువాత, జూలియస్ సీజర్ క్రీస్తు పూర్వం 47లో కొత్త కేలండర్ మొదలుపెట్టాడు. అది యూరప్ మొత్తం అనుసరించింది. కానీ అది మనకు సరిపడలేదు. దీంతో గ్రేటర్ ఇండియాకు సింధ్ నుంచి ఆగ్నేయాసియా దేశాల వరకూ ఒకే కేలండర్ అవసరం పడింది. అది వాణిజ్య పరమైన అవసరం. ఆగ్నేయాసియా, తూర్పుదేశాల నుంచి ముడి సరుకు దిగుమతి చేసి, మధ్య, దక్షిణ భారతంలో దాన్ని తయారుచేసి, పశ్చిమ భారత తీరం నుంచి రోమ్‌కి ఎగుమతి చేసేవారు.
జూలియస్ సీజర్ ఈజిప్టును జయించి, ఎర్ర సముద్రం రోమన్ల కిందకి వచ్చాక భారత్‌కి వ్యాపారం ఇంకా పెరిగింది. వ్యాపారం లెక్కలు సుళువుగా సాగాలంటే, ఈ ప్రక్రియ మొత్తం ఒకే కలేండర్ ప్రకారం జరగాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడే ఆ అవసరం రిత్యా శాలివాహన శకం మొదలైంది. అందుకే మయన్మార్, ఫిలిప్పీన్స్, మలేసియా వంటి దేశాల్లో అప్పుడు శాలివాహన శకం ఉపయోగించేవారు. అప్పట్లో శాతవాహన ప్రభావం వల్ల జరిగింది. అదే సమయంలో విక్రమాదిత్య శకం కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది.
కొత్తగా వ్యవసాయం కిందకు వచ్చిన ప్రాంతాలకు బ్రాహ్మణులు పంచాంగం తీసుకువెళ్లారు. విత్తనాలు ఎప్పుడు చల్లాలి, భూమి ఎప్పుడు దున్నాలి వంటివి పంచాంగం ద్వారా రైతులకు వివరించారు. ఏరువాక పౌర్ణమి కూడా సౌరమానం కిందే లెక్కిస్తారు. ఇప్పటికీ రైతులు ఉపయోగించే కార్తెలు అలా వచ్చినవే'' అని వివరించారు సాయి.
జూలియన్ కేలండర్‌ను సంస్కరించి పోప్ గ్రెగరీ ప్రవేశపెట్టిన గ్రెగేరియన్ కేలండర్‌నే ఇప్పుడు ఇంగ్లిష్ కేలండర్‌గా ఉపయోగిస్తున్నాం. సంవత్సరాలు సరే మరి నెలలు పండుగల సంగతేంటి? సంస్కృతిని బట్టి సంవత్సరాల లెక్క మారినట్టే నెలలు, పండుగలు కూడా మారుతుంటాయి. దానికి కారణం కాలాన్ని లెక్కించే విధానంలో ఉన్న తేడాలే. సూర్యుడు, చంద్రుడు, భూమి గమనాన్ని బట్టి కేలండర్లు తయారు చేస్తారు. అందులో చాలా రకాలు పద్ధతులు, సంప్రదాయాలు ఉన్నాయి.
ప్రాచీన నాగరికతల నుంచి నాసా వరకూ ఒక్కొక్కరూ ఒక్కో సూత్రం చెప్పారు. ఉదాహరణకు గ్రెగొరియన్ కేలండర్ సూర్యుడి ఆధారంగా తయారయితే, తెలుగు వారి కేలండర్ చంద్రుడి ఆధారంగా తయారయింది. అందుకే ఇంగ్లిష్ తేదీలు, తెలుగు పండుగలు ఒక్కసారి రావు.
భారతీయులందరికీ కొత్త సంవత్సరం మార్చి - ఏప్రిల్ నెలల్లో వస్తుంది. తెలుగు, కన్నడ, మరాఠీ ప్రజలకు ఉగాది కొత్త సంవత్సరం కాగా.. మిగిలిన చాలా మంది భారతీయులకు ఏప్రిల్ 14 ప్రాంతంలో కొత్త సంవత్సరం వస్తుంది. గుజరాతీలకు మాత్రం దీపావళి కొత్త సంవత్సరం. భారతదేశంలో ఇలాంటివి 30కి పైగా కేలండర్లున్నాయి.
చంద్రుడి ఆధారంగా లెక్కవేసే భారతీయ కేలండర్లలో కూడా సూర్యుడికి సంబంధించిన పండుగలను మాత్రం సూర్యమానం ప్రకారమే లెక్కిస్తారు. అటు ఇంగ్లిష్ కేలండర్ కూడా సూర్యుడి ప్రకారమే కదా. అందుకే సూర్యుడితో సంబంధమున్న పండుగలు ఒకే ఇంగ్లిష్ తేదీల్లో వస్తాయి. సంక్రాంతి జనవరి 12 నుంచి 14 మధ్యన రావడం దీనికి ఉదాహరణ. అంతేకాదు, మేష రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు అంటే ఏప్రిల్ 14వ తేదీనే తమిళ, బెంగాలి, ఒడియాల ఉగాది, ఉత్తర భారతీయుల వైశాఖీ పండుగలు వస్తాయి.
ఇక బౌద్ధ కేలండర్లలో చాలా రకాలున్నప్పటికీ, వాటి నెలల కూడా భారతీయ నెలలను పోలి ఉంటాయి. ఎందుకంటే, అవి ప్రాచీన భారతీయ కేలండర్లను ఆధారం చేసుకుని తయారయినవే. మనిషికి కాలాన్ని లెక్కబెట్టే అవసరం వచ్చినప్పటి నుంచీ అందుబాటులో పరిజ్ఞానంతో ఆ పనిచేస్తూనే ఉన్నాడు అని వివరించారు రఘునందన్. రఘు ప్రస్తుతం ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్‌గా ఉన్నారు.
''మనిషి మొదటిసారి ఆకాశం వైపు చూసి అదేమిటి? అన్నప్పుడే ఆధునిక విజ్ఞానానికి పునాదులు పడ్డాయి. ఎప్పుడు విత్తనం వేయాలి? ఎప్పుడు కోత కోయాలి అన్న మనిషి ఆహార అవసరమే కాలగణనకు కారణం అయింది. మనిషి ఆకాశంలో ఎన్నో వింతలను గమనించాడు. వాటికి కొన్ని గుర్తులు పెట్టుకున్నాడు. దాని ద్వారా సమయం లెక్కించడం మొదలుపెట్టారు. మీరు భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా అక్కడి ముసలి వారు ఆకాశం చూసి సమయం చెప్పగలరు. పగలే కాదు. రాత్రివైపు కూడా ఆకాశం చూసి చెప్పగలిగిన నేర్పు వారికుండేది.
భూమి సూర్యుడి చుట్టే తిరిగే కాలం వంటి వాటిని చాలా నాగరికతలకు చెందిన వారు కచ్చితంగానే అంచనా వేశారు. గ్రహణాలు వంటి వాటిని కూడా లెక్కించారు. అది శాస్త్రీయంగానే జరిగంది. కానీ, దానికి కారణాలు - వివరణలు - పర్యవసానాలు లెక్కించేప్పుడు మాత్రం సైన్స్‌కి దూరంగా ఎవరికి తోచింది వారు చెప్పారు.
ఆయా దేశ సంస్కృతుల్లో సూర్యమాన కేలండర్లు, చంద్రమాన కేలండర్లు ఉన్నాయి. మనిషి సూర్యుడి గమనం చూశాడు. లెక్కపెట్టుకున్నాడు. చంద్రుడు పెరగడం తరగడం చూశాడు. లెక్కపెట్టుకున్నాడు. పౌర్ణమి అమావాస్యలు గమనించాడు. 30 రోజులు 12 నెలలు ఏవేవో లెక్కలు వేసుకున్నాడు. అలా సొంత అవసరాల రీత్యా కేలండర్ లేదా పంచాంగం తయారు చేసుకున్నాడు. కానీ ఏ లెక్క ప్రకారం కేలండర్ లేదా పంచాంగం తయారు చేసుకున్నా, అది గాల్లోంచి మాత్రం రాలేదు. తనకు అందుబాటులో ఉన్న సమాచారం విశ్లేషించి, పరిశీలించి ఆకాశం చూసి అధ్యయనం చేసి రాసుకున్నాడు.
పూర్వం రాజులు పంచాంగం విడుదల చేసేవారు. ప్రజలకు పండుగలు లెక్కపెట్టడానికీ, వ్యాపారాలకు, వ్యవసాయాలకు పంచాంగం అవసరం. భారతదేశంలో అనేక కేలండర్లున్నాయి. భారతదేశంలో సూర్యుడు ఉదయించే సమయంలో తేడాలున్నాయి. అందుకే ప్రభుత్వం ఒక జాతీయ కేలండర్ తీసుకోవాలనుకుని, కమిటీ వేసి శక సంవత్సరాన్ని తీసుకుంది. ప్రతీ ఏటా భారత ప్రభుత్వం ఆ వివరాలతో కూడిన ది ఇండియన్ ఆస్ట్రానిమకల్ ఎఫిమరీస్ విడుదల చేస్తుంది. అందులో ఉన్న సమాచారం ఆధారంగా పండుగలు ఇతర వివరాలు లెక్కిస్తారు.