కోవిడ్ దెబ్బకు ఇండియాలో 3.2 కోట్ల మంది మధ్య తరగతి నుంచి పేదరికంలోకి వెళ్లిపోయారు

శనివారం, 20 మార్చి 2021 (15:47 IST)
కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా భారతదేశంలో కోట్లాది మంది మధ్యతరగతి ప్రజల జీవితాలపై ప్రభావం పడిందని, వీరిలో కోట్లాది మంది పేదరికంలోకి వెళ్లిపోయారని, యూఎస్‌ కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు నవతెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం.. దాదాపు 3.2 కోట్ల మంది మధ్యతరగతి భారతీయులు పేదరికంలోకి వెళ్లిపోయారు. కరోనా కాలంలో దేశంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య 6.6 కోట్లకు తగ్గి పేదరికంలోకి వెళ్లినవారి సంఖ్య పెరిగిపోయింది.
 
ప్రమాదకర కరోనాకు ముందున్న అంచనా ప్రకారం దేశంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య 9.9 కోట్లు. భారతదేశ మధ్యతరగతిలో గణనీయమైన తగ్గుదలను, పేదరికంలో చాలా పెరుగుదలను అంచనా వేసిందని ప్రపంచబ్యాంకు ఆర్థిక వృద్ధి అంచనా నివేదికను ఉటంకిస్తూ యూఎస్‌ పరిశోధనా సంస్థ వెల్లడించింది. 2011-2019 మధ్య దాదాపు 5.7 కోట్ల మంది ప్రజలు మధ్యతరగతి ఆదాయ గ్రూపులోకి వెళ్లిపోయారని పేర్కొన్నది.
 
ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసులు తగ్గాయని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులు ఆందోళనను కలిగిస్తున్నాయి. యూఎస్‌, బ్రెజిల్‌ దేశాల తర్వాత అత్యధిక కరోనా కేసులతో భారత్‌ మూడో స్థానంలో ఉన్నది. కరోనా మహమ్మారి ప్రవేశానికి ముందే భారత్‌ ఆర్థికంగా తీవ్ర కుంగుబాటులో ఉన్నది. అయితే, మహమ్మారి ప్రవేశంతో ఆర్థిక మాంద్యం మరింతగా ఎక్కువైంది. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధికి దూరమయ్యారు. దీంతో పేద, దిగువ, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కనీసం తిండికి కూడా నోచుకోని పరిస్థితులు ఎదురయ్యాయి.
 
కాగా, మహమ్మారి తీసుకొచ్చిన పరిస్థితుల కారణంగా రోజుకు రూ. 150 లేదా అంతకంటే తక్కువగా సంపాదించే పేద ప్రజల సంఖ్య 7.5 కోట్లకు పెరిగిందని యూఎస్‌ సంస్థ అంచనా వేసింది. దేశంలో కరోనా మహమ్మారి తెచ్చిన కష్టాలకు తోడు ఈ ఏడాది ఇంధన ధరలను కేంద్రం తీవ్రంగా పెంచింది. దాదాపు 10శాతం వరకు ధరలు పెరిగాయి.
 
అంతేకాదు, నిరుద్యోగం, జీతాలలో కోతలు వంటి అంశాలు దేశంలోని ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయనీ, ఇలాంటి కారణాలతో ఉద్యోగాల కోసం దేశ ప్రజలు విదేశాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు అన్నారని ఈ కథనంలో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు