ఆ పొలం నిండా కుళ్లిపోతున్న మృతదేహాలు... ఐనా జాగ్రత్తగా కాపాడుతున్నారు.. ఎందుకు?

సోమవారం, 24 జూన్ 2019 (18:06 IST)
ఒక బహిరంగ ప్రదేశం. దూరం నుంచి ఏపుగా పెరిగిన గడ్డి కనిపిస్తోంది. వాకింగ్‌ చేయడానికి అదొక మంచి పార్కులా అనిపిస్తోంది. కానీ చుట్టుపక్కల ఉన్న మొక్కల కంటే అక్కడి గడ్డి దాదాపు మీటరు ఎత్తు పెరగడం వెనుక ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఎన్నో వారాల నుంచీ కుళ్లుతున్న మనుషుల మృతదేహాలు ఆ గడ్డికి ఎరువుగా మారాయి. ఆ గడ్డి లోపలికి వెళ్తే, మనిషి చనిపోయిన తర్వాత వచ్చే దుర్గంధం ఎంత దారణంగా ఉంటుందో మనకు తెలుస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది.
 
అది దాదాపు రెండున్నర ఎకరాలున్న పొలం. అందులో అక్కడక్కడా 15 మృతదేహాలు కనిపిస్తున్నాయి. అవన్నీ నగ్నంగా ఉన్నాయి. కొన్ని ఇనుప బోనుల్లో ఉన్నాయి. కొన్ని మృతదేహాలకు ప్లాస్టిక్ కవర్లు కప్పారు. కొన్నింటిని తక్కువ లోతున్న గుంటలో పూడ్చిపెట్టారు. కానీ వాటిలో చాలా మృతదేహాలు బయటకు కనిపిస్తున్నాయి. ప్రతి మృతదేహం చుట్టూ కొంత గడ్డి చచ్చిపోయింది. కానీ కొన్నిరోజుల్లోనే ఆ గడ్డి మళ్లీ ఏపుగా పెరగబోతోంది. అదనపు పోషకాలు అందుకుని పచ్చగా కళకళలాడబోతోంది. ఇది ఒక బహిరంగ ఎయిర్ ఫోరెన్సిక్ ఆంత్రొపాలజీ లాబ్. దీనిని దక్షిణ ఫ్లోరిడాలో తంబా బయట గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
 
కొంతమంది దీనిని 'బాడీ ఫార్మ్స్' (శరీరాల పొలాలు) అని పిలిచినా శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని 'ఫోరెన్సిక్ స్మశానం' లేదా 'టఫోనమీ లాబరేటరీ' అంటున్నారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనిషి శరీరం ఏమవుతుందోనని వీరంతా ఒక అధ్యయనం చేస్తున్నారు. మరణం తర్వాత మనిషి దేహానికి ఏమవుతుందోనని రకరకాల నమ్మకాలు ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో దానిని సైన్స్ దృష్టిలోనే చూస్తారు.
 
ఈ మృతదేహాల పొలాన్ని 2017లో ప్రారంభించారు. దీనిని నిజానికి మొదట హిల్స్‌బరోకు దగ్గరగా ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ మృతదేహాల వల్ల రాబందులు వస్తాయని, దుర్గంధం ఉంటుందని, తమ ఆస్తుల ధరలు తగ్గిపోతాయని భయపడిన స్థానికులు దానిని వ్యతిరేకించారు. అలా బహిరంగంగా మృతదేహాలను ఉంచడంపై స్థానికులే కాదు, కొంతమంది ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాబందులు లాంటివి తినేయకుండా కొన్ని మృతదేహాలను ఇనుప బోనుల్లో ఉంచుతారు.
 
కుళ్లుతున్న మృతదేహాలు
ఇలా 'మృతదేహాల పొలాలు' అమెరికాలోనే మరో ఆరున్నాయి. ఆస్ట్రేలియా, కెనెడా, బ్రిటన్ కూడా ఈ ఏడాది చివర్లో సొంతంగా ఇలాంటివి ప్రారంభించాలని చూస్తున్నాయి. యూఎస్ఎఫ్( యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా)లో కుళ్లుతున్న మృతదేహాల్లో చాలావరకూ మరణించడానికి ముందు వారు స్వయంగా దానం చేసినవి, మృతుల కుటుంబ సభ్యులు దానం చేసినవి ఉన్నాయి. మనిషి శరీరం ఎలా శిథిలమవుతుంది, తర్వాత వెంటనే వాతావరణంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ 'బాడీ ఫార్మ్స్' ఏర్పాటు చేశారు.
 
ఇలా చేయడం వల్ల లభించే కీలకమైన గణాంకాలు నేరాలను పరిష్కరించడానికి సహకరిస్తాయని, ఫోరెన్సిక్ గుర్తింపు పద్ధతులను మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు. ఎవరైనా చనిపోగానే చాలా ప్రక్రియలు జరుగుతాయి అని డాక్టర్ ఎరిన్ కిమ్మెర్లె బీబీసీకి చెప్పారు. "కుళ్లిపోవడం అనే సహజ ప్రక్రియ నుంచి అది పురుగులు పట్టడం, చుట్టుపక్కల జీవావరణాన్ని మార్చేవరకూ అనేక ప్రక్రియలు ఉంటాయి" అన్నారు. వాస్తవ సమయంలో కుళ్లుతున్న నిజమైన మృతదేహాలను అధ్యయనం చేయడం చాలా ముఖ్యం అని యూఎస్ఎఫ్‌లో ఫోరెన్సిక్ ఆంత్రొపాలజీ డైరెక్టర్ కిమ్మెర్లే, ఆమె టీమ్ భావిస్తున్నారు.
 
కుళ్లే ప్రక్రియ గురించి తెలుసుకోవడం
మనిషి మృతదేహం కుళ్లిపోవడం అనేది సాధారణంగా వివిధ దశలుగా జరుగుతుందని డాక్టర్ కిమ్మెర్లే చెప్పారు. 

తాజాస్థితి- గుండె కొట్టుకోవడం ఆగిపోగానే, శరీర ఉష్ణోగ్రతలు పడిపోతాయి. శరీరమంతా రక్తం ప్రవహించడం ఆగిపోయి, కొన్ని చోట్ల అది గడ్డకట్టడం మొదలవగానే శరీరం కుళ్లడం ప్రారంభమవుతుంది.

ఉబ్బడం- సూక్ష్మజీవులు శరీరంలోని సున్నితమైన అవయవాలను తినడం ప్రారంభిస్తాయి. చర్మం రంగు మారడం కనిపిస్తుంది. లోపల వాయువులు పెరగడంతో శరీరం ఉబ్బుతుంది. దాంతో మృదు కణజాలం పగులుతుంది.

కుళ్లడం- ఈ దశలో ఎక్కువ శరీరం శిథిలం అవుతుంది. మృదు కణజాలంలో ఎక్కువ భాగాన్ని పురుగులు తినేయడం లేదా ద్రవీకృతమై చుట్టుపక్కల వాతావరణంలో కలిసిపోవడం జరుగుతుంది.

మరింత పాడవడం- ఈ దశలో మృదు కణజాలం ఎక్కువగా తినేసి ఉంటుంది. బ్యాక్టీరియా, పురుగులు, కీటకాలు తగ్గుతాయి. శవం మట్టిలో ఉంటే చుట్టుపక్కల పచ్చదనం చచ్చిపోతుంది. అక్కడ మట్టి ఆమ్లత్వంలో మార్పులు వస్తాయి.

పొడి అవశేషాలు- శరీరంలో మిగిలినవి అస్థిపంజరం రూపంలోకి రావడం మొదలవుతుంది. మొదటి ఆనవాలు సాధారణంగా ముఖం, చేతులు, కాళ్లపై కనిపిస్తుంది. వాతావరణం చల్లగా ఉంటే మృతదేహం పెద్దగా చెడదు. దానిలోని పోషకాలన్నీ చుట్టుపక్కల మట్టిలోకి చేరడం వల్ల అక్కడి మొక్కల్లో పునరుజ్జీవం వస్తుంది.
 
కానీ, ఈ దశలు స్థిరంగా ఉండవు. వీటిపై వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే కిమ్మెర్లీ మిగతా శాస్త్రవేత్తలు ఇలా పొలాల్లో మృతదేహాలపై పరిశోధనలు చేయాలని భావించారు.
 
ఈ పరిశోధనల్లో భాగంగా కొన్ని మృతదేహాలను ఇనుప బోనుల్లో, కొన్నింటిని బయట ఉంచారు. పురుగుపట్టి, చర్మం, ఎముకలు మాత్రమే మిగిలేవరకూ మృతదేహాలను కుళ్లబెట్టారు. కానీ బోనులో లేని మృతదేహాలను రాబందులు, తోడేలు, చిన్న ఎలుకలు లాంటి వాటిని కూడా ఆకర్షించాయి. అలా ఒక్కొక్క మృతదేహం కుళ్లేకొద్దీ వాటి నుంచి వీలైనంత సమాచారం సేకరించామని కిమ్మెర్లీ చెప్పారు.
 
ఈ పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు రోజూ పొలానికి వెళ్లేవారు. ఒక్కో మృతదేహం పరిస్థితి ఎలా ఉందో పరిశీలిస్తారు. వాటిని ఫొటోలు తీసుకుని వివరంగా ఒక నోట్స్ రూపొందిస్తారు. మృతదేహాలు ఉన్న ప్రాంతం, అక్కడి పరిస్థితులు కూడా నమోదు చేస్తారు. అది నీటికి దగ్గరగా ఉందా, భూమి లోపల ఉందా, లేక పైనుందా. బోనులో ఉందా, బయటుందా అన్నీ చూస్తారు. వారితోపాటు భూవిజ్ఞానవేత్తలు, భూభౌతిక శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో భాగమయ్యారు.

మృతదేహాల చుట్టుపక్కల మట్టి, నీరు, గాలి, మొక్కలకు ఏం జరుగుతోందో విశ్లేషించారు. మృతదేహాల్లోంచి వస్తున్న పదార్థాలు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో గమనించారు. మృతదేహాలు అస్థిపంజరాలుగా మారినపుడు, శాస్త్రవేత్తలు వాటిని అక్కడి నుంచి 'డ్రై లాబరేటరీ'కి తరలిస్తున్నారు. అక్కడ ఎముకలను శుభ్రం చేసి విద్యార్థులు, పరిశోధకులకు ఉపయోగపడేలా వాటిని నిల్వచేస్తుంటారు.
 
అపరిష్కృత నేరాలకు అండ
మృతదేహం కుళ్లిపోవడంపై చేసిన ఈ పరిశోధనల్లో సేకరించిన గణాంకాల వల్ల ఫోరెన్సిక్, వైద్య పరిశోధనలకు చాలా ఉపయోగం ఉంటుంది. హత్యలు లాంటివి జరిగినపుడు, ఆ మృతదేహం ఎంత సేపటి నుంచి అక్కడ ఉంది. అక్కడ దాన్ని ఎప్పుడు వదిలి వెళ్లారు అనేది కూడా వివరంగా తెలుసుకోడం సాధ్యమవుతుంది. ఈ గణాంకాలు వ్యక్తి మూలాల గురించి ముఖ్యమైన ఆధారాలు అందిస్తాయి. జన్యు గణాంకాలు, ఎముకల విశ్లేషణతోపాటు ఈ సమాచారాన్ని నేర పరిశోధనల్లో, పరిష్కారం దొరకని హత్య కేసుల్లో ఉపయోగించవచ్చు.
 
మృతదేహాలతో పనిచేయడంలో సవాళ్లు
ఇలా మృతదేహాలతో పనిచేయడం కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ డాక్టర్ కిమ్మెర్లీ మాత్రం ఇందులో తనకు ఎలాంటి తేడా కనిపించలేదని చెప్పారు. ఒక సైంటిస్టుగా అది తన పనిలో భాగం అన్నారు. "మేం చాలా హత్య కేసులను పరిష్కరించాలి. అవి ఒక మనిషి మరో మనిషికి ఎంత హాని చేయగలడనేది మాకు చూపిస్తాయి" అన్నారు. తన పరిశోధనలు 1980 నుంచీ జరిగిన రెండున్నర లక్షలకు పైగా హత్య కేసులను వెలుగులోకి తీసుకురావడానికి సహకరించాయని ఆమె చెప్పారు.
 
ఇప్పటివరకూ ఈ పొలంలో దాతలు ఇచ్చిన 50 మృతదేహాలు ఉన్నాయి. మరణించిన తర్వాత ఈ అధ్యయనం కోసం తమ మృతదేహాలను ఇచ్చేందుకు మరో 180 మంది అంగీకరించారు. వీరిలో చాలా మంది పెద్దవయసు వారే. తీవ్రమైన వ్యాధులతో చనిపోయిన వారి మృతదేహాలను ఈ పరిశోధనలకు ఉపయోగించడం లేదు.
 
మృతదేహాల పరిశోధన, నైతికతపై వివాదం
మృతదేహాలున్న ఈ పొలాలు శాస్త్రవేత్తలకు చాలా విలువైన గణాంకాలను అందించవచ్చు. కానీ దాని ఉపయోగంపై కొన్ని పరిమితులు ఉంటాయి. పొలంలో బహిరంగంగా ఇలాంటి పరిశోధనలు చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయని బ్రిటన్ ఫోరెన్సిక్ ఆంత్రొపాలజీ నిపుణుడు పాట్రిక్ రాండోల్ఫ్-క్విన్నీ అన్నారు. "అక్కడ జరిగే చర్యలు మన నియంత్రణలో ఉండవు. వాటి ఆధారంగా లభించే గణాంకాలను విశ్లేషించడం చాలా కష్టం. ఈ పరిశోధనల ద్వారా సేకరించిన డేటాను ప్రామాణికంగా, శాస్త్రీయంగా ఎలా ఉపయోగించగలం అనేది చాలా సవాలుతో కూడుకున్నది" అని ఆయన చెప్పారు.
 
బాడీ ఫార్మ్స్ గురించి కొందరు శాస్త్రవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు బ్రిటన్‌ ప్రముఖ ఫోరెన్సిక్ ఆంత్రొపాలజిస్ట్ సూబ్లాక్ తనకు ఈ కాన్సెప్ట్ చాలా భయంకరంగా, దారుణంగా అనిపించిందని 2018లో రాసిన తన 'ఆల్ దట్ రిమైన్స్' అనే పుస్తకంలో రాశారు."అలాంటి పొలాన్ని పర్యాటకులను ఆకర్షించే ఒక ప్రాంతంగా చూడాలని నన్ను ఆహ్వానించినపుడు నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది" ఆమె అన్నారు. కానీ డాక్టర్ కిమ్మెర్లీ మాత్రం ఇలాంటి బహిరంగ ప్రయోగశాలలకు ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి ఇంకా చాలా ప్రారంభిస్తామన్నారు. "ఇలాంటి పరిశోధనలను, ఇక్కడ మా అధ్యయనాలను అర్థం చేసుకోగలిగిన ఎవరైనా ఇవి ఎంత అవసరం అనేది తెలుసుకోగలరు" అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు