ఫిరాయింపుల చరిత్ర: నేతలు పార్టీలు మారినా ప్రజలు ఎందుకు పట్టించుకోవట్లేదు?
శుక్రవారం, 21 జూన్ 2019 (20:39 IST)
నలుగురు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు- వైఎస్ చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు- నిన్న భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆరుగురు సభ్యులున్న రాజ్యసభలో నలుగురు మెజారిటీ కాబట్టి తమని ప్రత్యేక వర్గంగా గుర్తించి భారతీయ జనతాపార్టీలో విలీనమయ్యేందుకు అంగీకరించాలని వారు పెద్దల సభ ఛైర్మన్‌కు లేఖ రాశారు. విలీనం కావాలని రాజ్యసభ తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని కూడా లేఖలో పేర్కొన్నారు.
అయితే, ఇది మొత్తం ఏ సభయితే, పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు చట్టాన్ని తీసుకువచ్చిందో, అదేసభలో ఇది జరిగింది. ఫిరాయింపులు ఏ రూపంలో ఉన్నా నిరోధించాలని సవరణలు తీసుకువచ్చి కట్టుదిట్టం చేసిన సభలోనే మళ్లీ మళ్ళీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. తప్పు ఫిరాయించే వారిదయినా లేక ఫిరాయింపుదారులకు చేయూతనిస్తున్న పార్టీదా అనే విషయాన్నిపక్కన బెడితే ఈ వ్యవహారంలో ఓడి పోయింది మాత్రం 1985 ఫిరాయింపుల నిరోధక చట్టమే.
నలుగురు టిడిపి సభ్యులు బీజేపీలో చేరారనే వార్త బయటకు పొక్కగానే ఇది అనైతికం, అప్రజాస్వామికం, పార్లమెంటరీ వ్యవస్థకు ముప్పు అని రాజకీయ పండితుల నుంచి రకారకాలగా విమర్శ లు వెలువడినా, దేశాన్నది కుదిపేయలేదు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో, ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని ప్రజలెవరూ నిశ్చేష్టులు కాలేదు. నిజానికి ఇదంతా వూహించిందే అన్నట్లు మాట్లాడుతున్నారు. చర్చ ఫిరాయించిన వారికంటే తర్వాత ఎవరు ఫిరాయించబోతున్నారనే దాని మీదకు మళ్లింది. టిడిపి నుంచి ఇంకా ఎవరు వెళ్తారు? తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఎవరు ఉడాయిస్తారు, టిఆర్ఎస్ నుంచి వెళ్లేదెవరూ అంటూ పత్రికల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. చర్చ ఏ కుల నాయకులు ఎటుపోతారనేంత లోతుగా వెళ్లింది.
అంతేకాదు,సోషల్ మీడియా మరొక కోణం వెలికితీసింది-అసలు వీరిని బిజెపిలోకి పంపించింది తెలుగుదేశం పార్టీ నాయకత్వమేననేది ఈ కోణం. ఇప్పటికే ఇందులో కొందరి మీద బ్యాంకులను మోసగించారన్నకేసులున్నాయి. వారి ఇళ్ల మీద సిబిఐ దాడులు జరిగాయి. అందువల్ల వ్యాపార పరిరక్షణ కోసం వాళ్లు టిడిపిలో ఉండలేని పరిస్థితి వచ్చినందున పార్టీ నాయకత్వమే వారు బిజెపిలో చేరేందుకు అనుమతిచ్చిందనేది సోషల్ మీడియాలో చర్చ, రచ్చ.
ఒక్క మాటలో చెబితే వైఎస్ చౌదరి, సిఎంరమేష్, టిజివెంకటేశ్,గరికపాటి మోహన్ రావులు ఫిరాయించడం పెద్ద నైతిక విలువ చర్చకు తావీయడం లేదు. దీనికి కారణం, భారతదేశంలో ఫిరాయింపులు ప్రోత్సహించని పార్టీలు చాలా తక్కువగా ఉండటమే. కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీలు ఏదో విధంగా ఎపుడో ఒకసారి, ఎక్కడో ఒక చోట ఫిరాయింపుల నుంచి లబ్ది పొందేందుకు ప్రయత్నించాయి.
అధికారంలో లేనపుడు ఫిరాయింపుల గురించి ఆందోళన చెందాయి తప్ప అవపరమయినపుడు ఈపార్టీలన్నీ ఫిరాయింపుల మీదే బతికి బట్టగట్టాయి. ఫిరాయింపుల గురించి ఆందోళన 1967 ఆగస్టు11 న మొట్టమొదటి సారి లోక్‌సభలో మొదలయింది. అప్పటినుంచి దాదాపు ఎడతెరిపి లేకుండా ఫిరాయింపుల మీద పార్లమెంటులో అన్ని పార్టీల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇది ఉత్తుత్తి ఆందోళనగా భావించి ప్రజలు తాము ఆందోళన చెందడం మానేశారు. రోజూ చచ్చే చావుకు ఏడుపెందుకు అనే సామెత గుర్తుందిగా.
నిజానికి ఇది తెలుగుదేశం పార్టీకేమీ చావు దెబ్బ కాదు. ఇలాంటి మొదటి దెబ్బ పార్టీకి 1992,మార్చి 12 న తగిలింది. ఇపుడు టీడిపి సభ్యులు బిజెపిలోకి విలీనమవ్వాలనుకుంటున్నట్లు అపుడు కాంగ్రెస్‌లో విలీనమయ్యారు. అపుడు పివి నరసింహారావు మైనారిటీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆ ప్రభుత్వం మీద వచ్చిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్ సమయంలో 13 టిడిపి సభ్యులలో ఎనిమిది మంది మాయమయ్యారు. వీరంతా తర్వాత భూపతిరాజు విజయకుమార్ రాజు నేతృత్వంలో ఒక వర్గంగా ఏర్పడి తమని ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని అప్పటి స్పీకర్ శివరాజ్ వి పాటిల్‌కు లేఖ ఇచ్చారు.
తర్వాత తాము కొత్త పార్టీ ఏర్పాటుచేసుకున్నామని దాని పేరు తెలుగుదేశం పార్టీ (వి)అని, అలా గుర్తించాలని కోరారు. స్పీకర్ అంగీకరించారు. తర్వాత ఆగస్టు 20,1992న తమ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవ్వాలని నిర్ణయించిందని, దీనికి అంగీకరించాలని స్పీకర్‌ని కోరారు. ఆగస్టు 24న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి టిడిపి (వి) సభ్యులు కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రకటించారు.
తర్వాత ఆగస్టు 27న స్పీకర్ శివరాజ్ పాటిల్ ఈ విలీనాన్ని ఆమోదించారు. ఆ రోజు జరిగిందానికి, నిన్న అంటే జూన్ 20,2019 న జరిగిందానికి ప్రొసీజర్ లో తేడా లేదు. ఆ రోజు పివి నరసింహరావు ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఫిరాయింపులు ప్రోత్సహించారు. ఇపుడు రాజకీయాలు స్వభావాన్ని మార్చుకున్నాయి. ప్రత్యర్థి పార్టీని ఓడించడం కాదు, నిర్మూలించాలనుకుంటున్నారు. దీనికి ఫిరాయింపులు ఒక మార్గంగా ఎంచుకున్నారు. తేడా అదే.
నిన్న నలుగురు టిడిపి సభ్యులు ఫిరాయించి బిజెపిలో చేరడం ఆ పార్టీలో శుభకార్యం జరిగినట్లు ఆనందించారు. బిజెపి బలపడుతూ ఉందని సంతోషించారు. ఇలాగే తెలుగుదేశం అసెంబ్లీ విభాగం 2016లోటిఆర్ ఎస్ విలీనమయినపుడు,2019లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ టిఆర్ ఎస్ లో విలీనమయినపుడు ఆ పార్టీ ఘనవిజయంగా ప్రచారం చేసుకుని సంబరపడింది తప్ప తాను అనుభవిస్తున్నది దొంగసొత్తు అని భావించలేదు. ఇదే విధంగా 2014-18 మధ్య వైసిపి సభ్యులును తెలుగుదేశంపార్టీ ఎలాంటి జంకు గొంకులేకుండా ట్రెజరీ బెంచెస్ లోకి లాక్కుంది. మంత్రులను చేసింది. ఎక్కువ మంది ఓటర్లు ఈ పార్టీల సానుభూతి పరులయినపుడు ఫిరాయింపుల గురించి ఆందోళన చెందేదెవరు? అందుకే నైతిక విలువ గురించి పెద్ద చర్చ జరగడం లేదు. చట్టం భద్రంగా ఉంటుంది. ఫిరాయింపులు అంతే భద్రంగా సాగుతున్నాయి.
బహుళ పార్టీ పార్లమెంటరీ వ్యవస్థలో ఫిరాయింపులు మామూలే. పార్టీల ఆందోళనా మామూలే. ఫిరాయింపులను నిరోధించేందుకు తీసుకువచ్చిన చట్టాన్ని సవరిస్తూ ఎప్పటికప్పుడు పకడ్బందీ చేస్తారు. సభ్యులూ కొత్త మార్గం కనుక్కుని ఫిరాయింపులను కొనసాగిస్తారు. అన్ని చట్టప్రకారమే జరుగుతుంటాయి. ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించారని సభ నుంచి అనర్హులయిన వారు చాలా చాలా తక్కువ. ఫిరాయించిన వారి మీద చర్య తీసుకునేందుకు స్పీకర్ కార్యాలయాలు ఎన లేని జాప్యం చేస్తాయి. కోర్టులు ఒక తాయాన ఈ విషయాన్ని తేల్చలేవు. అందువల్ల ఫిరాయింపుల్లో నైతికత మీద చర్చ బాగా బలహీన పడింది.
ఫిరాయింపుల స్వర్ణయుగం
అంతెందుకు జాతీయ విలువలు అంతోఇంతో బలంగా ఉన్నజాతీయోద్యమ కాలంలోకూడా ఫిరాయింపులు జరిగాయి. ఆ నాటి ఫిరాయింపుల గురించి రెండు ఉదాహరణలను ప్రముఖంగా పేర్కొంటారు. ఇందులో సెంట్రల్ లెజిస్లేచర్ లో కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న శ్యామ్ లాల్ నెహ్రూ పార్టీ వదిలేసి బ్రిటిష్ పక్షంలోకి వెళ్లారు. తర్వాత హఫీజ్ మొహమ్మద్ ఇబ్రహీం 1937లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ముస్లింలీగ్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి మారారు. కాకపోతే, స్వాతంత్ర్యానంతరం, ఫిరాంయిపులు 1967 నుంచి ఉపందుకున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీనపడటంతో ఫిరాయింపులను టానిక్ లాగా వాడుకుంది. పదిహేను రోజుల్లో మూడు సార్లు పార్టీ మారి రికార్డు సృష్టించిన హర్యానా గయాలాల్ ఈ కాలం వాడే. ఆయారాం-గయారాం అనే వ్యంగ్యోక్తి పుట్టేందుకు కారణమీయనే.
1969లో ఈ అంశాన్ని అధ్యయంన చేసిన వైబి చవాన్ కమిటీ నివేదిక ప్రకారం 1967 మార్చి 1968 ఫిబ్రవరి మధ్య 12 నెలల కాలంలో 438 మంది శాసన సభ్యులు దేశంలో పార్టీ లు ఫిరాయించారు. పదవీ వ్యామోహమే ఫిరాయింపులకు ఆ రోజుల్లో ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే, ఆ సమయంలో పార్టీ ఫిరాయించిన 210 శాసన సభ్యులలో 116 మంది మంత్రులయ్యారు. వీరి సహకారంతోనే ఆ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. విచిత్రమేమిటంటే ఈ పార్టీల ప్రభుత్వాలే ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకురావాలని పట్టుబట్టాయి.
ఇపుడు ఎన్నికల్లో గెలుస్తున్నవారిలో ఎక్కువ మంది పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు, లిక్కర్ మహరాజాలు, గనుల యాజమానులు, రియల్ ఎస్టేట్ వాళ్లు. వ్యాపారం కోసమే వీళ్ళంతా రాజకీయాల్లోకొచ్చారు. వ్యాపారాలున్నందునే వారిని పార్టీలు ఆదరించాయి. వ్యాపారాలకోసమే వాళ్లు పార్టీలు మారుతున్నారు. అందుకే పార్టీలనుంచి ఎవరైనా ఫిరాయిస్తే పార్టీలు అప్పటికేదో స్పందిస్తాయి తప్ప ప్రజల్లో ఫిరాయింపనేది పెద్ద అనైతిక చర్యగా సంచలనం సృష్టించడం లేదు. ఫిరాయించిన వాళ్లు తిరిగొస్తారనే ఆశ ప్రతిపార్టీలో కనిపిస్తుంది. అలా 'సొంత ఇంటికి తిరిగొచ్చినంత ఆనందంగా ఉంది'అని వచ్చిన వాళ్లూ ఉన్నారు.
అసలు చర్చ ప్రారంభించింది తెలుగు వాడే
నిజానికి పార్లమెంటులో మొట్టమొదటిసారి ఫిరాయింపుల మీద చర్చ మొదలు పెట్టింది తెలుగు సభ్యుడే. 1967, ఆగస్టు 11న లోక్ సభలో కాంగ్రెస్ సభ్యుడు పెండేకంటి వెంకటసుబయ్య ఈ చర్చ మొదలుపెట్టారు. చర్చ ఘాటుగాసాగింది. దీని వల్లే ఆ యేడాది అక్టోబర్ 14, 15 తేదీలలో ఢిల్లీలో జరిగిన స్పీకర్ల సభలో ఒక తీర్మానం చేశారు. పెండేకంటి ప్రవేశపెట్టిన చర్చతో డిసెంబర్ 8న లోక్ సభ ఒక తీర్మానం చేస్తూ సభ్యులు పార్టీ ఫిరాయించడాన్ని నిషేధించేందుకు తగిన సలహా లిచ్చే నిమిత్తం పార్టీనేతలతో, రాజ్యాంగ నిపుణలుతో ఒక కమిటీ వేయాలని సభ కోరింది. దీని ఫలితమే వై బి చవాన్ కమిటీ. ఇందులో ఉన్నవాళ్లంతా హేమాహేమీలు. ఆ నాటి మేధావులు. ఈ కమిటీ నివేదిక 1969 ఫిబ్రవరి 18న లోక్ సభ ముందుకొచ్చింది. ఫిరాయింపులు నిషేధించేందుకు పార్టీలకు ప్రవర్తనానియమావళి ఉండాలని, దిగువ సభలో సభ్యులు కాని వాళ్లను క్యాబినెట్లోకి తీసుకోరాదని ఈ కమిటీ అభిప్రాయపడింది.
వైబి చవాన్ సిఫార్సుల ఆదారంగా 1973లో 32వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకువచ్చారు. పార్టీ సభ్యత్వం కోల్పోయినా, పార్టీ అనుమతి లేకుండా సభలో ఓటింగ్ నుంచి గైర్ హాజరయినా,విప్ ను ధిక్కరించినా సభ్యుడు సభలో కొనసాగేందుకు అనర్హుడని బిల్లు పేర్కొంది. అయితే, ఎమర్జన్సీ రావడంతో దీనిని పరిశీలించేందుకు ఉద్దేశించిన జాయింట్ పార్లమెంటరీకమిటీ ఉనికి కోల్పోయింది. తర్వాత 1978మరొక ప్రయత్నం జరిగింది. ఆగస్టు 28న ఫిరాంపులు నిషేధించేందుకు 48వ రాజ్యంగ సవరణ బిల్లు తీసుకువచ్చారు. చాలా మంది సభ్యలు బిల్లు మీద అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ బిల్లును సభ ముందుంచలేకపోయారు.
1984 డిసెంబర్ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఫిరాయింపుల చట్టం మీద మళ్లీ చర్చ మొదలయింది. 1985 జనవరిలో రాజ్యాంగ 52 వ సవరణ బిల్లుగా లోక్ సభ ముందుకొచ్చింది. రెండు సభల్లో పాయింది. ఫిబ్రవరి 15న రాష్ట్రపతి ఆమోదంరావడంతో చట్టమయింది. మార్చి 18 నుంచి అమలులోకి వచ్చింది.
ఇందులో లొసుగులున్నాయని, ఫిరాయింపులు ఆగడం లేదని , చట్టాన్ని ఇంకా దృఢపర్చి ఫిరాయింపులు ఆపాలని 2003 మార్చి 5న 97వ రాజ్యంగా సరవణ బిల్లు తీసుకువచ్చారు. అది పాసయింది.చట్టమయింది. అయితే ఏమయింది. ఫిరాయింపులు ఆగలేదు. ఇపుడు ఫిరాయింపు చట్టాన్ని బాగా బిగించి, ఒక పార్టీ తరఫున చట్ట సభకు గెల్చిన వ్యక్తి మరొక పార్టీలోకి మారినా, విప్ ను ధిక్కరించినా అటోమేటిక్ గా సభ్యత్వం పోవాలని ప్రతిపాదిస్తున్నారు.
ఇదీ జరగవచ్చు. అయితే, దానితో ఫిరాయింపులు ఆగతాయన్ని గ్యారంటీ లేదు. ఫిరాయింపు చట్టానికి ఇన్ని సవరణలు వచ్చింది ఇలాంటి డిమాండ్ల వల్లే. ఈ మధ్య కాలంలో కర్నాటకలో, తమిళనాడులో రూలింగ్ పార్టీలలో లుకలుకల వల్ల కొంతమంది సభ్యులను ఫిరాయింపు నిరోధక చట్టంతో స్పీకర్ వారిని అనర్హులను చేశారు. అయితే, రూలింగ్ పార్టీయే ఫిరాయింపులను ప్రోత్సహించినపుడు, ప్రతిపక్ష పార్టీ చేసే ఫిర్యాదుల మీద స్పీకర్లు అంతే ఉత్సాహంగా చర్యలు తీసుకోవడం లేదు. స్పీకర్ల దగ్గిర ఈ ఫిర్యాదులు ఏళ్ల తరబడి మూలుగుతున్నాయి. ఫిరాయింపులు కొనసాగుతున్నాయి.
ఫిరాయింపులను ఓటర్లు ఎపుడూ సీరియస్ తీసుకున్నట్లు లేరు. ఫిరాయించిన వాళ్లు మంచి మెజారీటీతో గెలుస్తున్నారు, ఫిరాయించిన పార్టీలు అఖండ విజయం సాధిస్తున్నాయి. ఫిరాయింపుల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఒకనాటి లోక్ సభ సెక్రెటరీ జనరల్ జిసి మల్హోత్రా 'చాలా దేశాలలో ఫిరాయింపులు చర్చనీయాంశం కాదు, వాటిని ఒక సమస్యగా పరగణించడం లేద'ని అన్నారు. అదిపుడు ఇండియాకు కూడా వర్తిస్తుంది.