వందే భారత్ రైళ్లలో సీట్లు ఖాళీగా ఎందుకుంటున్నాయి?

శుక్రవారం, 14 జులై 2023 (21:26 IST)
‘‘మధ్యతరగతి ప్రజల్లో వందే భారత్ రైళ్లకు మంచి డిమాండ్ ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాలూ ఈ రైళ్లతో అనుసంధానమయ్యే రోజు దగ్గర్లోనే ఉంది.’’ అని ఇటీవల రెండు వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2021 ఆగస్టు 15నాడు ఎర్రకోట పైనుంచి ప్రసంగించేటప్పుడు 75 కొత్త వందే భారత్ రైళ్లను నడపబోతున్నట్లు మోదీ ప్రకటించారు. భారత స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తికాబోతున్న నేపథ్యంలో మొత్తంగా 2023 ఆగస్టు 15 నాటికి 75 రైళ్లను ప్రవేశ పెట్టబోతున్నట్లు మోదీ వెల్లడించారు.
 
మోడర్న్ డిజైన్, హైస్పీడ్‌పై ఈ రైళ్లను కొందరు ప్రశంసిస్తుంటే.. టిక్కెట్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని చాలా మంది విమర్శిస్తున్నారు. ‘వందే భారత్’కు ప్రయాణికులతోపాటు సోషల్ మీడియాలోనూ మంచి ఆదరణ ఉందని వార్తలు వస్తున్నాయి. నిజంగానే ప్రజల్లో ఈ రైలుకు అంత డిమాండ్ ఉందా? చాలా మార్గాల్లో నడుస్తున్న ఈ రైళ్లకు సంబంధించిన రైల్వే రికార్డులను పరిశీలిస్తే కొద్దిమంది మాత్రమే ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు ధరల్లో ప్రస్తుతం రైల్వే రాయితీలను కూడా ప్రకటిస్తోంది. ప్రజలను ఆకర్షించేందుకు రైల్వే ప్రస్తుతం ఏం చర్యలు తీసుకుంటోంది, అసలు ఈ రైళ్ల ప్రత్యేకత ఏమిటి లాంటి విషయాలను ఈ కథనంలో చూద్దాం.
 
ఖాళీ కోచ్‌లు..
భారత్‌లో తొలి వందే భారత్‌ రైలును 2019 ఫిబ్రవరిలో మొదలుపెట్టారు. ప్రస్తుతం 25 మార్గాల్లో 50 వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. జులై 2023లోనూ నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశముంది. వరుసపెట్టి మొదలుపెడుతున్న ఈ రైళ్లకు ప్రజల్లో అంత డిమాండ్ ఉందా అనే ప్రశ్న చాలా మంది నిపుణుల నుంచి ఉత్పన్నం అవుతోంది. ప్రస్తుతం చాలా వందే భారత్ రైళ్లు 8 కోచ్‌లతో నడుస్తున్నాయి. అయినప్పటికీ వీటిలో ప్రయాణికులు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఉదాహరణకు రాణి కమలాపతి స్టేషన్ (భోపాల్) నుంచి జబల్‌పుర్‌కు ఎనిమిది కోచ్‌లతో నడిచే వందే భారత్ రైలును తీసుకోండి. 2023, ఏప్రిల్ 1 నుంచి.. 2023, జూన్ 29 మధ్య ఈ రైలు ఆక్యుపెన్సీ సగటున 32 శాతం మాత్రమే ఉంది.
 
మరోవైపు తిరుగు ప్రయాణంలోనూ సగటున 36 శాతం సీట్లే నిండుతున్నాయి. అధునాతన హంగులతో ఈ రైళ్లు కనిపిస్తున్నప్పటికీ ధర ఎక్కువగా ఉండటం వల్లే సీట్లు ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే, అన్ని మార్గాల్లోనూ పరిస్థితులు ఇలానే లేవు. కొన్ని రూట్లలో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఉదాహరణకు కాసర్‌గోడ్-త్రివేండ్రమ్ సెంట్రల్ వందే భారత్‌లో బుకింగ్ రేటు 182 శాతం వరకూ ఉంది. తిరుగు ప్రయాణంలోనూ ఇది 176 శాతం ఉంది. అంటే ఇక్కడ రైలు నిండంతోపాటు 82, 76 శాతం మందికి టికెట్లు దొరకడం లేదు. అలానే ముంబయి సెంట్రల్-గాంధీనగర్ వందే భారత్ రైలులోనూ బుకింగ్ రేటు 129 శాతంగా ఉంది, తిరుగు ప్రయాణంలోనూ ఇది 134 శాతంగా ఉంది.
 
మరోవైపు సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్‌లోనూ ఇది 114 శాతంగా ఉంది. అంటే కొన్ని వందే భారత్ రైళ్లలో సిట్లకు మించి డిమాండ్ ఉంటోంది. ఇదే సమయంలో కేఎస్ఆర్ బెంగళూరు, ధార్వాడ్ మధ్య నడిచే వందే భారత్‌ రైలులోనూ 60 శాతం సీట్లనే ప్రజలు బుక్ చేసుకున్నారు. ఈ రైలు కూడా ఎనిమిది కోచ్‌లతోనే నడుస్తోంది. తిరుగు ప్రయాణంలోనూ సగటున 60 శాతం సీట్లనే ప్రజలు బుక్ చేసుకున్నారు. ఇందోర్, భోపాల్ మధ్య నడిచే వందే భారత్ రైలు పరిస్థితి అత్యంత దారుణంగా కనిపిస్తోంది. 8 కోచ్‌లతో నడిచే ఈ రైలులో కేవలం 21 శాతం సీట్లే బుక్ అవుతున్నాయి, తిరుగు ప్రయాణంలో ఇది 29 శాతంగా ఉంది. మరోవైపు దిల్లీ కంటోన్మెంట్ నుంచి అజ్‌మేర్‌కు వెళ్లే వందే భారత్ రైలులో 61 శాతం టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. మడ్‌గావ్ నుంచి ముంబయి శివాజీ టెర్మినస్‌కు వెళ్లే రైలులో 55 శాతం సీట్లు బుక్ అవుతున్నాయి. అంటే ఈ రూట్లలో సీట్ల కంటే ప్రయాణికుల సంఖ్య తక్కువే ఉంటోంది.
 
కొత్త రైళ్లు ఎలా ప్రవేశపెడతారు?
కొత్త రైళ్లను ప్రవేశపెట్టే ముందు రైల్వే చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. దీనిపై రైల్వే బోర్డు మాజీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. రాజకీయ అంశాలతోపాటు ప్రజల నుంచి డిమాండ్ ఎక్కడ ఎక్కువగా ఉందనే వాటిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అంటే ప్రస్తుతం బుకింగ్‌లతోపాటు రైళ్ల రద్దీని పరిశీలిస్తారు. దీనిపై రైల్వేలోని ప్రాంతీయ మేనేజర్లతో డైలీ యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం అవుతుంది. ఆ తర్వాత రైల్వే శాఖ దగ్గరకు ఈ ప్రతిపాదన వెళ్తుంది. చాలాసార్లు డిమాండ్ ఎక్కువ ఉండేటప్పుడు ప్రస్తుత రైళ్లలో బోగీల సంఖ్యను పెంచుతారు. అప్పటికీ డిమాండ్ ఎక్కువగా ఉంటే కొత్త రైళ్లను ప్రారంభిస్తారు.
 
అప్పుడు ఏ సమయంలో ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ తరగతికి ఎక్కువ డిమాండ్ ఉంది? లాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటారు. కొన్నిసార్లు ఎంపీలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే డిమాండ్ల నుంచి కూడా కొత్త రైళ్లను ప్రవేశపెడుతుంటారు. అయితే, ఇలాంటి ప్రతిపాదనల సమయంలోనూ పూర్తిస్థాయి అధ్యయనం నిర్వహిస్తారు. దీనిపై ఆల్‌ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్ర మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు డిమాండ్ సర్వే లాంటి వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు అనుగుణంగా కొత్త రైళ్లపై ప్రకటనలు చేస్తున్నారు.’’ అని ఆయన అన్నారు.
 
వందే భారత్ ధర
శతాబ్ది తరహాలోనే వందే భారత్ రైళ్ల టికెట్ ధర కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా రూట్లలో ప్రయాణికులు వీటివైపు చూడటం లేదు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 100 కి.మీ.లకు కనీస చార్జి రూ.215. ఇదే వందే భారత్ రైళ్లలో బేసిక్ చార్జి రూ.301గా ఉంది. అదే శతాబ్దిలోని ఎగ్జిక్యూటివ్ చార్జి రూ.488. ఇది వందే భారత్‌లో రూ.634. ఇదే 500 కి.మీ.లకు చూసుకుంటే.. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో చైర్‌కార్ కనీస చార్జి రూ.658 కాగా, వందే భారత్‌లో ఇది రూ.921. ఇదే దూరానికి ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో అయితే, శతాబ్దిలో రూ.1446, వందే భారత్‌లో అయితే, రూ.1880గా వసూలు చేస్తున్నారు.
 
మరోవైపు ఈ ధరకు అదనంగా రిజర్వేషన్ చార్జి, సూపర్‌ఫాస్ట్ చార్జి, కేటరింగ్‌ చార్జి, జీఎస్‌టీ కూడా కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రయాణికులకు చార్జీలో 45 శాతం రాయితీ ఇస్తున్నట్లు రైల్వే చెబుతోంది. ‘‘వందే భారత్ ధర ఎంత ఎక్కువగా ఉంటోందంటే.. నలుగురు మనుషులు వెళ్లేటప్పుడు దీని బదులు కారులో వెళ్తే డబ్బులు తక్కువ ఖర్చు అవుతాయి. అయితే, ఈ రైళ్లను సామాన్య ప్రజల కోసం నడపడంలేదని, ఇవి ఖరీదైన రైళ్లని రైల్వేనే చెబుతోంది.’’ అని మిశ్ర అన్నారు.
 
వందే భారత్ వర్సెస్ శతాబ్ది
వందే భారత్ రైళ్లను ‘ఐసీఎఫ్ చెన్నై’లో తయారుచేస్తున్నారు. వీటిని మొదటగా ట్రైన్-18గా పిలిచేవారు. మొదట్లో దీన్ని 2018లో మొదలుపెట్టాలని రైల్వే భావించింది. వీటి తర్వాత ట్రైన్-20ని కూడా 2020లోనే మొదలుపెట్టాలని రైల్వే భావించింది. ఇవి ఏసీ స్లీపర్ కోచ్ రైళ్లు. వీటిని 2024 మార్చిలో ప్రవేశపెట్టే అవకాశముంది. శతాబ్ది రైళ్లకు ప్రత్యామ్నాయంగా వందే భారత్ రైళ్లను చూస్తుంటారు. ఎందుకంటే శతాబ్దిలోనూ ఇలాంటి చైర్ కార్ కోచ్‌లు కనిపిస్తాయి. భారత్‌లో తొలి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను 1988 జులై 10న మొదలుపెట్టారు. ఆనాడు ఈ రైళ్లలో తొలి ప్రయాణం చేసినవారిలో ‘ఇండియన్ రైల్’ మ్యాగజైన్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు అరవింద్ కుమార్ ఒకరు.
 
‘‘అప్పట్లో మాధవ్‌రావ్ సింధియా రైల్వే మంత్రిగా ఉండేవారు. జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆ రైలును మొదలుపెట్టారు. దీన్ని 21వ శతాబ్దపు ఆధునిక రైలుగా అప్పట్లో చెప్పారు.’’ అని ఆయన అన్నారు. నేడు భారత మోడర్న్ రైలుగా వందే భారత్‌ను పిలుస్తున్నారు. ప్రస్తుతం దాదాపు అన్ని వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే ప్రారంభిస్తున్నారు. గత 35 ఏళ్లలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లను 19 మార్గాల్లో మాత్రమే మొదలుపెట్టారు. ప్రస్తుతం రైల్వే దృష్టి మొత్తం శతాబ్ది నుంచి వందే భారత్ రైళ్లపై పెట్టింది. 16 కోచ్‌లున్న వందే భారత్ రైళ్ల తయారీకి కేంద్రం రూ.100 కోట్లు ఖర్చు పెడుతుంటే, 20 కోచ్‌లున్న వందే శతాబ్ది కోసం రూ.55 కోట్లు వెచ్చిస్తోంది.
 
వందే భారత్‌ స్పీడ్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. అయితే, ఈ రెండు రైళ్ల గరిష్ఠ ఆపరేషన్ స్పీడ్ గంటకు 160 కి.మీ.లే. అయితే, ఈ రెండింటి సగటు వేగం గరిష్ఠ వేగం కంటే తక్కువగానే ఉంటోంది. మరోవైపు శతాబ్దితో పోలిస్తే, వందే భారత్ కాస్త వేగంగా గమ్యాన్ని చేరుకుంటోంది. దీనికి కారణం ఏమిటంటే.. స్వల్ప సమయంలోనే వందే భారత్ గరిష్ఠ వేగాన్ని చేరుకోగలదు. అంతేకాదు, తక్కువ సమయంలోనే బ్రేక్‌లువేసి వేగాన్ని నియంత్రించుకోగలదు.
 
రైల్వే ఆఫర్
ప్రస్తుతం కొన్ని రూట్లలో ఈ రైళ్లలో సీట్ల ఖాళీలు ఎక్కువగా ఉండటంతో ఒక కొత్త ప్రతిపాదనతో రైల్వే ముందుకు వచ్చింది. ఆక్యుపెన్సీ 50 శాతం కంటే తక్కువగా ఉండే రూట్లలో ధరలో గరిష్ఠంగా 25 శాతం వరకూ రాయితీ ఇవ్వాలని తాజాగా రైల్వే నిర్ణయించింది. అయితే, ఈ ఆఫర్ విస్టాడోమ్, అనుభూతి, ఇతర ఏసీ సీటింగ్ కోచ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. రాయితీ ఎంత ఇవ్వాలి అనే దాన్ని సంబంధింత ర్వైల్వే జోన్‌లే నిర్ణయించబోతున్నాయి. ‘‘నిజానికి 2019లోనే ఈ ప్రణాళికను అమలు చేయాలని భావించాం.

కానీ, కోవిడ్-19 వల్ల అది సాధ్యపడలేదు. ఇదేమీ కొత్త ఆఫర్ కాదు.. పైగా ఒక్క వందే భారత్‌కే దీన్ని అమలు చేయడం లేదు.’’ అని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ చెప్పారు. నిజానికి వందే భారత్ రైళ్లను రెండు నగరాల మధ్య ప్రవేశపెడుతున్నారు. అయితే, భారత్‌లో రోడ్లను మెరుగుపరుస్తున్నారు. దీంతో చాలా మంది రోడ్లపై ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారు.
అందుకే ప్రవేశపెడుతున్న ప్రతి కొత్త రైలుకు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటికి అనుగుణంగా కొత్తకొత్త ప్రతిపాదనలతో రైల్వే ముందుకు రావాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు