"కింగ్ కోబ్రా" రాజధాని "ఆగుంబె"

FILE
"నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో....!" అని ఓ సినీ కవి అన్నట్లుగా... దారి పొడవునా పచ్చటి పందిరి వేసినట్లుగా చెట్లు, దూరంగా అగ్గిపెట్టెల్లాగా ఇళ్ళు, చెయ్యి తిరిగిన చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన అద్భుతమైన వర్ణ చిత్రంలాంటి దట్టమైన అటవీ అందాలన్నింటినీ తనలో దాచుకున్న ప్రాంతమే "ఆగుంబె". పడమటి కనుమల్లోకెల్లా ఎత్తయిన ఈ ప్రాంతం, దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా వర్షం కురిసేటి... "దక్షిణాది చిరపుంజి"గా పేరుగాంచింది.

కర్ణాటక రాష్ట్రంలోని షిమోగ జిల్లా, తీర్థహళ్ళి తాలూకాలోని ఒక గ్రామమే "ఆగుంబె". ఇది పశ్చిమ కనుమలలోని మలనాడు అనే ప్రాంతంలో ఉంది. ఈ గ్రామంలో పడే వర్షం ఆధారంగానే భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదు చేసుకున్న ప్రాంతమైన చిరపుంజి తరువాతి స్థానంలో నిలిచి "దక్షిణ చిరపుంజి"గా రికార్డులకెక్కింది. ఇక్కడ సాలీనా సగటు వర్షపాతం 7640 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటిదాకా ఆగుంబెలో 4508 మి.మీటర్ల అత్యధిక వర్షపాతం 1946వ సంవత్సరంలో ఆగస్టు నెలలో నమోదయ్యింది.

ఆగుంబె గ్రామంలోనే ప్రసిద్ధ సర్ప పరిశోధనా శాస్త్రవేత్త విట్టేకర్ స్థాపించిన "వర్షపాత ఆధారిత అరణ్య పరిశోధనా కేంద్రం" ఉంది. అప్పట్లో విట్టేకర్ ఈ గ్రామాన్ని "కింగ్ కోబ్రా" రాజధానిగా అభివర్ణించారు. ఔషధ మొక్కల సంరక్షణా కేంద్రం కూడా ఈ గ్రామంలోనే నెలకొని ఉంది.
కింగ్ కోబ్రాను కనుగొన్నది ఇక్కడే...!
సుప్రసిద్ధ సర్ప (పాముల) పరిశోధకుడు రోములస్ విట్టేకర్.. 1970వ సంవత్సరంలో ఆగుంబె ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా రాజనాగాన్ని (కింగ్ కోబ్రా) కనుగొన్నారు. ఇందుకుగానూ ఆయన బ్రిటీ ప్రభుత్వం నుంచి విట్లీ అవార్డును కైవసం చేసుకున్నారు.


ఆగుంబె ప్రత్యేక ఆకర్షణల విషయానికి వస్తే... పశ్చిమ కనుమలలో ఉన్న ఆగుంబెలో సూర్యాస్తమయం చూసేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఎక్కువగా తరలివస్తుంటారు. అరేబియా సముద్రం ఈ ప్రాంతానికి చాలా దూరంగా ఉన్నప్పటికీ... ఆకాశం నిర్మలంగా ఉన్న రోజుల్లో, సూర్యాస్తమయం సమయాల్లో అరేబియా సముద్రంలోకి సూర్యుడు వెళ్లిపోతున్నాడా అన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ వీక్షకులకు కట్టిపడేస్తుంది.

ఇక్కడి అందమైన జలపాతాలు పర్యాటకులకు మరో ఆకర్షణ. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కుంచికాళ్ జలపాతం. ఇది భారతదేశంలో అత్యధిక ఎత్తు నుంచి పడుతున్న జలపాతాలలో ఒకటి. అలాగే ప్రపంచ జలపాతాలలో 116వది. ఇది 1493 అడుగులు (455 మీటర్లు) ఎత్తు నుంచి పడుతూ.. వరాహి నదికి జన్మనిస్తున్నది.

మరో జలపాతం బరకనా జలపాతం. ఇది 850 అడుగుల (259 మీటర్లు) ఎత్తు నుంచి పరవళ్ళెత్తూ ఉంటుంది. ఇది మనదేశంలో అత్యంత ఎత్తునుంచి పడుతున్న జలపాతాలలో 10వ స్థానాన్ని ఆక్రమించింది. సీతానది కొండలపై నుంచి ప్రవహిస్తూ బరకనా జలపాతంగా మారే ఈ జలపాతానికి సీతా జలపాతం అనే మరో పేరు కూడా ఉంది. కర్ణాటక రాష్ట్ర జలవిద్యుత్ ఉత్పత్తిలో ఈ జలపాతం ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

ఆగుంబెకు దగ్గర్లో ఉండే మరో జలపాతం ఓణకే అబ్బే జలపాతం. కన్నడ భాషలో ఓణకే అంటే దంపుడు కర్ర (వడ్ల దంచేందుకు ఉపయోగించే కర్ర, లేదా రోకలి) అని అర్థం. ఈ జలపాతం ఉధృతిని దృష్టిలో పెట్టుకుని దీనికి ఆ పేరు పెట్టినట్లు స్థానికుల కథనం.

దూరదర్శన్ ఛానెల్లో ప్రసారమైన "మాల్గుడి డేస్" అనే ధారావాహిక నాటకం ఆగుంబెలోనే చిత్రీకరించారు. ఆగుంబె ప్రక్కనే చివరిగా మిగిలిన లోతట్టు వర్షపాతాధిరిత అరణ్యాలైన కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం మరియు సొమేశ్వర వన్య అభయారణ్యం ఉన్నాయి. ఆగుంబెలో లాంగూరం, సెమ్నొపితకస్‌ హైపొలికస్‌మలనాడు తదితర వైవిధ్యమైన జీవజాతులు నివసిస్తున్నాయి.

ప్రసిద్ధ సర్ప పరిశోధకుడు రోములస్ విట్టేకర్ భారతదేశంలోనే ఏకైక వర్షపాత ఆధారిత అరణ్య పరిశోధనా కేంద్రాన్ని ఆగుంబె స్థాపించాడు. 1970వ సంవత్సరంలో ఈ ప్రాంతంలోనే ఆయన రాజ నాగం (కింగ్ కోబ్రా)ని కనుగొని, ఆ తరువాత దీనిని అరణ్య పరిశోధనా కేంద్రంగా మార్చారు. ఇందుకుగానూ విట్టేకర్ బ్రిటీష్ ప్రభుత్వం నుంచి 2005లో 30 వేల పౌండ్ "విట్లీ అవార్డు"ను అందుకున్నారు.

ఆగుంబెలోనే 1999 సంవత్సరంలో "ఔషధీ మెక్కల సంరక్షణా స్థలం" స్థాపించబడింది. సముద్రమట్టానికి 600-700 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం గార్సీనియా, మిరిస్టికా, లిస్టియేసి, డయోస్పోరస్‌, హోలిగ్రానా, యూజీనియా, ఫైకస్‌ తదితర ఓషధ ధర్మాలు కలిగిన మొక్కలకు నిలయంగా మారింది.

ఎలా వెళ్లాలంటే... కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి ఆగుంబె 380 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బెంగళూరు నుంచి జాతీయ రహదారి 4 మీద తుముకూరు వరకు వెళ్ళి అక్కడ నుండి 206 నంబరు జాతీయ రహదారి మీద షిమోగా వరకు వెళ్లాలి. అక్కడినుంచి 13వ నంబరు జాతీయ రహదారిపై వెళ్తే ఆగుంబే దగ్గర్లోని తీర్థహళ్ళి పట్టణం వస్తుంది.

అలాగే, ఉడిపి నుండి శృంగేరికి వెళ్ళే బస్సులు కూడా ఆగుంబె మీదుగా వెళ్తాయి. రైల్లో అయితే... ఉడిపిలోని కొంకణ్ రైల్వేస్టేషన్ ఆగుంబెకి దగ్గరగా ఉంటుంది. ఇక విమాన సౌకర్యం అయితే ఆగుంబె సమీపంలోని మంగళూరు వరకు ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి