కనిష్కుడి కాలం నాటి కోట ఖిలా ముబారక్

Pavan Kumar

శుక్రవారం, 6 జూన్ 2008 (18:58 IST)
కుషాణ సామ్రాజ్య చక్రవర్తి కనిష్కుడి కాలం నాటి కోట ఖిలా ముబారక్. ఖిలా ముబారక్ కోట పంజాబ్‌లోని బథిండాలో ఉంది. బథిండా చరిత్ర ఈనాటిది కాదని భారత పురావస్తు శాఖ నిపుణులు అంటున్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో బథిండాకు ప్రత్యేక స్థానం ఉంది. పంచ నదులు ప్రవహించే ప్రాంతమైన పంజాబ్‌లో ఉంది బథిండా. పంజాబ్‌లోని మాళ్వా ప్రాంత పరిధిలోకి వస్తుంది బథిండా.

ఆధునిక బథిండా నగరాన్ని లాఖి అడవుల ప్రాంతంలో రావు భట్టి కాలంలో నిర్మాణం మొదలైందని అంటారు. 965 సంవత్సరంలో పరిపాలించిన బాలా రావు భట్టి కాలంలో ప్రజలు ఎక్కువగా ఇక్కడ నివశించటంతో బథిండా నగర స్థాయికి ఎదిగిందని అంటారు. ఆ తర్వాత కాలంలో ఇది బథిండాగా పేర్గాంచింది.

మహ్మదీయ రాజు మహ్మద్ ఘజ్నీ 1004లో ఈ నగరంపై దాడిచేసి తన పరిధిలోకి తెచ్చుకున్నాడు. ఆలాగే 1189లో మహ్మద్ గోరీ దాడి చేసినపుడు ఉత్తరాదిని పరిపాలిస్తున్న పృథ్వీ రాజ్ చౌహాన్ దీనిని అడ్డుకున్నాడు. దీనికోసం దాదాపు 13 నెలల పోరు జరిగింది. ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న రజియా సుల్తానాను కొంతకాలం ఇక్కడ బంధించారు.

సిక్కు మత గురువులైన గురు నానక్ దేవ్, గురు తేజ్ బహుదూర్, గురు గోబింద్ సింగ్‌లు బథిండా నగరాన్ని సందర్శించారు. భారత స్వాతంత్ర్యోదమ కాలంలో బథిండాకు చెందిన వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ వారిని ఎదిరించారు.

ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన అనేక ఆధారాలు బథిండాలో లభ్యమయ్యాయి. రాతి పరికరాల్లో ఒకటైన సుత్తిని ఈ జిల్లాలో కనుగొన్నారు. ఇది క్రీస్తు పూర్వం 50వేల సంవత్సరాల నాటిదిగా పురావస్తు వేత్తలు నిర్ధారించారు. హరప్పా కాలంలో కూడా బథిండా నగరం బాగా వర్ధిల్లింది. శక, కుషాణ సామ్రాజ్య కాలాల్లో బథిండా బాగా అభివృద్ధి చెందింది.

ఖిలా ముబారక్ కోట
ఖిలా ముబారక్ కోట పునాదులు కుషాణ సామ్రాజ్య చక్రవర్తి కనిష్కుడి కాలం నాటిదిగా పురావస్తు వేత్తలు నిర్ధారించారు. ఆ తర్వాత కాలంలో ఇక్కడ కోట నిర్మించటం జరిగింది. బథిండాలో ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో కోట ఒకటి.

గురుద్వారాలు

సిక్కు మతానికి చెందిన అనేక గురుద్వారాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో గురుద్వారా తారునా సాహెబ్, గురుద్వారా లిఖాన్‌సర్ సాహెబ్, గురుద్వారా తిత్తార్ సర్ సాహెబ్‌లు ఉన్నాయి.

వసతి
అన్ని రకాల వారికి అవసరమైన వసతి సదుపాయాలు ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి
విమాన మార్గం : ఢిల్లీ సమీపంలోని ప్రధాన విమానాశ్రయం.
రైలు మార్గం : బథిండా ప్రధాన రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి జైపూర్, ఢిల్లీ, ముంబయిలకు నేరుగా రైలు సదుపాయం ఉంది.
రహదారి మార్గం : బథిండా నుంచి అన్నిచోట్లకు బస్సు సదుపాయం ఉంది.

వెబ్దునియా పై చదవండి