క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్' రచనతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రచయిత శామ్యూల్ హటింగ్టన్ (81) కన్నుమూశారు. హార్వర్డ్ యూనివర్శిటీలో దాదాపు 58 ఏళ్లుగా శామ్యూల్ రాజనీతి శాస్త్ర విద్యార్థులకు పాఠాలు బోధించారు. మసాచుసెట్స్ లోని ఓ ఆసుపత్రిలో ఆయన బుధవారం మృతి చెందినట్లుగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం తన వెబ్సైట్ ద్వారా తెలిపింది. ఆయనకు భార్య, ఇద్దరు పుత్రులు ఉన్నారు.
పాశ్చాత్య ప్రపంచానికి, ఇస్లామిక్ ప్రపంచానికి మధ్య సంఘర్షణ తప్పదని హటింగ్టన్ తన పుస్తకంలో ముందే ఊహించారు. 1993లో ఒక విదేశీ వ్యవహారాల పత్రికలో రాసిన వ్యాసాన్ని మరింతగా విస్తరించి ఆయన 1996లో క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ పుస్తకం ప్రచురించి సంచలనం గొల్పించారు.
మత ప్రాతిపదికన ప్రపంచంలో విభేదాలు తలెత్తుతాయని శామ్యూల్ ఈ పుస్తకంలో రాశారు. అలాగే అమెరికన్ల జాతీయ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన 2004లో రాసిన హూ ఆర్ వియ్ అనే పుస్తకం కూడా సంచలనం రేకెత్తించింది.