గతంలో ఇవ్వని నంది పురస్కారాల స్థానంలో ఇక ప్రతియేటా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట ఇవ్వనున్నారు. ఈసారి పురస్కారాల ప్రదానోత్సవం తేదీ కొంచెం అటు ఇటు కావచ్చు! కానీ, వచ్చే ఏడాది నుంచి ఉగాది రోజునే ఇవ్వాలని నిర్ణయించారు. 2013 నుంచి గత ప్రభుత్వం సినిమా అవార్డులు ఇవ్వనందున వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఒక్కో ఏడాదికి ఒక్కో ఉత్తమ చిత్రానికి పురస్కారం ఇవ్వనున్నారు.
2024వ సంవత్సరానికి నటీనటులు సాంకేతిక నిపుణుల వ్యక్తిగత అవార్డులతో పాటు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, బాలల చిత్రం, జాతీయ సమైక్యత చిత్రం, పర్యావరణం, చారిత్రక సంపద తదితర విభాగాల సినిమాలకు గద్దర్ అవార్డులు ఇవ్వనున్నారు. అలాగే యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు తొలి ఫీచర్ ఫిల్మ్, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్ విభాగాల్లోను పురస్కారాలు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. తెలుగు సినిమా పై పుస్తకాలు, విశ్లేషణాత్మక వ్యాసాలు రాసే ఫిల్మ్ జర్నలిస్టులకు కూడా అవార్డులు ఇస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు.