సాహిత్యం సామాజిక వాస్తవాన్ని ప్రతిబింబించాలి

బుధవారం, 15 అక్టోబరు 2008 (18:09 IST)
FileFILE
చెన్నయ్ నగరంలో పుట్టి దేశ దేశాల్లో పెరిగి 33 సంవత్సరాల చిరుప్రాయంలోనే ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2008 అవార్డును, తీవ్ర పోటీ మధ్య చేజిక్కించుకున్న తమిళనాడు వాసి అడిగా అరవింద్ సామాజిక వాస్తవాలను సాహిత్యం ప్రతిబింబించాలని పేర్కొన్నారు.

ప్రపంచం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో బుకర్ ప్రైజ్ గెలవడం గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నలకు అరవింద్ సమాధానిమిస్తూ, భారత్, చైనా తమదైన మార్గంలో అడుగుపెట్టాయని, ఈ దేశాలనుంచి వస్తున్న సాహిత్యం కూడా ఈ వాస్తవాన్ని ప్రతిబింబించాలని చెప్పారు.

ఈ దేశాలనుంచి వస్తున్న రచయితలు మరింత విమర్శనాత్మకంగా ఉండాలని, ఎందుకంటే ప్రస్తుతం భారత్, చైనా వంటి దేశాలకు ఎలాంటి సంరక్షణల అవసరం లేదని అరవింద్ చెప్పారు. ప్రపంచ రంగం మీదికి ఈ దేశాలు రావడమే కాక ఇవి ప్రపంచాన్ని శాసించగల శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నాయని అన్నారు.

తాను ఢిల్లీలో ఉండగా ఈ నవల రాసినందున "ది వైట్ టైగర్‌"ను ఢిల్లీకే అంకితం చేస్తున్నానని అరవింద్ చెప్పారు. ఢిల్లీ తాను ప్రేమిస్తున్న నగరమని, ఇది భారత్ భవిష్యత్తును నిర్ణయించనుందని అన్నారు. ప్రపంచంలోని విశాల భాగం భవిష్యత్తును కూడా ఢిల్లీ భవిష్యత్తులో నిర్దేశించనుందని చెప్పారు.

ఢిల్లీ జీవితం గురించిన నవల కాబట్టి ఈ నవల వెలుగు చూడటానికి కారణమైన ఢిల్లీ వాసులకే దీనిని తాను అంకితం చేస్తున్నట్లుగా చెప్పారు. 300 ఏళ్ల క్రితం ఇది భూమ్మీద అతి ముఖ్యమైన నగరంగా ఉండేదని ఈ నగరానికి ఆ స్థాయి తిరిగి వస్తుందని అరవింద్ చెప్పారు.

అరవింద్ రాసిన మొట్టమొదటి నవలకే మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు దక్కడం ఒక విశేషం కాగా, భారతీయ కుల వ్యవస్థ పునాదులను ఈ నవల పరామర్శించడం మరో విశేషం. న్యూఢిల్లీలోని ఒక భారతీయ రిక్షా కార్మికుడి జీవన పోరాటాన్ని ఈ నవల చిత్రించింది.

నేటి ప్రపంచంలో వర్గాలు, ధనికులకు పేదలకు మధ్య అగాధపూరితమైన వ్యత్యాసాలు ఉంటున్నాయని వాటిగురించి రాయవలసింది చాలానే ఉందని అరవింద్ చెప్పారు. చాలామంది ప్రజలు సాహిత్యాన్ని గురించి పెద్దగా పట్టించుకోరుకానీ, నేటి ప్రపంచంలో సాహిత్యం చాలా అవసరమని పేర్కొన్నారు.

1974లో చెన్నయ్‌లో జన్మించిన అరవింద్ మంగుళూర్, ఆస్ట్రేలియాలలో పెరిగారు, కొలంబియా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీల్లో ఇంగ్లీష్ సాహిత్యం చదివిన అరవింద్ అనంతరం భారత్‌లో టైమ్స్ కరస్పాండెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం ముంబైలో ఉంటూ ఫ్రీలాన్సర్‌గా పని చేస్తున్నారు.

ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ అవార్డు ఇంతవరకు భారత సంతతి రచయితలకు 5 సార్లు లభించడం విశేషం. విఎస్ నయపాల్ (1971), సాల్మన్ రష్దీ (1981), అరుంధతీ రాయ్ (1997), కిరణ్ దేశాయ్‌ (2006) లకు ఇప్పటి వరకూ ఈ బహుమతి లభించింది. బుకర్ ప్రైజ్ గెల్చుకున్న అయిదవ భారతీయ రచయితగా అరవింద్ చరిత్రలో నిలిచారు. నవలా రచయిత అవ్వాలని బాల్యం నుంచి కోరుకుంటూ వచ్చిన అరవింద్ తన రచనా జీవితంలోనే అత్యున్నత శిఖరాలను 33 ఏళ్ల ప్రాయంలోనే అధిరోహించారు.

వెబ్దునియా పై చదవండి