బడ్జెట్ 2017-17.. జీఎస్టీ ఏప్రిల్ 1 నుంచి అమలు..? నీతి ఆయోగ్ సిఫార్సులే కీలకమా? రియల్ ఎస్టేట్ రంగానికి?
బుధవారం, 11 జనవరి 2017 (17:15 IST)
2017-18 వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో ప్రజల సలహాలు, సూచనలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ట్విట్టర్ ద్వారా నెటిజన్ల అభిప్రాయాలను స్వీకరిస్తోంది. మౌలిక సదుపాయాలు, తయారీ, వ్యవసాయం, ఐటి, సర్వీసులు వంటి రంగాల్లో ఏ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలో ఓటు ద్వారా వెల్లడించే అవకాశాన్ని కల్పించింది. ట్విట్టర్ ఖాతా కలిగిన వ్యక్తులు ఈ ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఆర్థిక మంత్రి త్వ శాఖ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో ఈ ఓటింగ్ సదుపాయం ఉంది.
ఈ ఓటింగ్‌లో భాగంగా నాలుగు రంగాల్లో ఏ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలో దానిపై క్లిక్ చేస్తే ఓటు వేసినట్లవుతుంది. వెంటనే ఏయే రంగాలకు ఎంత శాతం ప్రాధాన్యం లభించిందో ప్రత్యక్షమవుతుంది. ఇప్పటికైతే వ్యవసాయానికి ఎక్కువ మంది ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాతి స్థానాల్లో మౌలిక రంగం, మాన్యుఫ్యాక్చరింగ్, ఐటి, సర్వీసులు ఉన్నాయి.
ఇకపోతే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.1శాతంగా నమోదు కావచ్చునన్న తాజా కేంద్ర గణాంకాల శాఖ (సీఎస్‌వో) అంచనాలపై దృష్టిసారించనున్నారు. కాగా గతేడాది నమోదైన 7.6శాతం కంటే తక్కువకావడం గమనించదగ్గ అంశం. నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వివరాలు గురువారం వెల్లడికానున్నాయి. అక్టోబర్‌లో ఐఐపీ 1.9శాతం క్షీణించింది. ఇక డిసెంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ)కూడా విడుదల కానుంది. నవంబర్‌లో సీపీఐ 3.63శాతం పెరిగింది. కాగా 2017-18 కేంద్ర బడ్జెట్ రూపకల్పనపై కేంద్ర ఆర్థక శాఖ అరుణ్ జైట్లీ కసరత్తు చేస్తున్నారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు బ్రిటీష్ సర్కార్ నాటి నుంచి అనుసరిస్తున్న పద్ధతికి స్వస్తి చెప్పి 2017 సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఒకట తేదీనే 2017-18 సంవత్సరం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పెద్దనోట్ల రద్దు కారణంగా ఆర్థిక వ్యవస్థ పెద్ద కుదుపునకు గురైనప్పటికీ, పార్లమెంటు శీతాకాలం సమావేశాలు వృధా అయినప్పటికీ, జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో రైల్వే బడ్జెట్‌ను తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌లోనే చేర్చాలని కూడా నిర్ణయించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చినా.. ఎగ్జిక్యూటివ్ నిర్ణయమైనందువల్ల బడ్జెట్ సమర్పణను వాయిదా వేయలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టి.. మార్చి చివరి నాటికి బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం లభిస్తే, ఏప్రిల్ 1 నుంచి మంత్రిత్వశాఖలకు నిధులు అందే వీలు ఉంటుందని ప్రభుత్వం వెల్లడిస్తోంది.
ప్రణాళికా సంఘంతో ఏర్పాటయిన నీతి ఆయోగ్ నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖకు పూర్తి స్థాయిలో సహకారం అందితే బడ్జెట్ ప్రక్రియ కొద్దిగా ముందుగా పూర్తయ్యే అవకాశం, ఫలితంగా కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోయే అవకాశం ఉంది.
బడ్జెట్ సమావేశాలు అనగానే దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు కేంద్ర బడ్జెట్ కన్నా, రైల్వే బడ్జెట్ పైనే ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే ఈ సారి ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం లేదు. రైల్వే బడ్జెట్‌ను 2017-18 సాధారణ బడ్జెట్‌లోనే చేరుస్తున్నారు. రోడ్డురవాణా, విమానయానం విస్తృతంగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో రైల్వేల ప్రాధాన్యం తగ్గిందని కేంద్రప్రభుత్వం భావించడమే ఇందుకు కారణం.
రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో చేర్చడం వల్ల రైల్వే మంత్రి, అధికారులు భారతీయ రైల్వే సంస్థను మరింత సమర్థంగా నిర్వహింతడంపై దృష్టి పెట్టే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఇతరులు భావించారు. 1949 నుంచి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో చేర్చాలని పలు కమిటీలు సిఫార్సు చేసినా, ఆయా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రయోగానికి సిద్ధమైంది.
ఆర్థిక సంస్కరణల్లో కీలకమైన వస్తువులు, సేవల పన్ను (జిఎస్‌టి)ని 2017 ఏప్రిల్1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది. 2017-18 కేంద్ర బడ్జెట్‌లోనే జిఎస్‌టీ ప్రస్తావన రావలసి ఉంది. అయితే జిఎస్‌టీపై ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరని కారణంగా ఇది ఎంత మేరకు సాధ్యమో వేచి చూడాలి. ఇకపోతే.. నీతి ఆయోగ్ చేసే సిఫార్సులను బడ్జెట్‌లోనే పొందుపరిచే అవకాశం ఉంది.
పెద్దనోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై కానీ, జిడిపిపై కానీ పెద్దగా ప్రభావం లేదని కేంద్రం చెప్తోంది. ఈ బడ్జెట్ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇన్‌కమ్‌టాక్స్ రేట్ నుంచి ఊరట నివ్వాలని.. జీఎస్టీలో క్లారిటీ ఇవ్వాలని.. హౌస్ రెంట్ అలోవెన్స్ (హెచ్ఆర్ఏ) డిటెక్క్షన్‌లపై బడ్జెట్ పరంగా ప్రకటన ఉంటుందని రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వ్యాపారవేత్తలు ఆశిస్తున్నారు.