కేంద్ర ప్రభుత్వం కొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని ప్రకటించింది. కమోడిటీ ఎక్చేంజీల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ)ను 23 శాతం వరకు పెట్టుబడి చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి పొందాల్సిన అవసరం లేదని పరిశ్రమల శాఖ ప్రకటించిన నూతన ఎఫ్‌డీఐ నిబంధనావళిలో పేర్కొన్నారు.
ఇప్పటివరకు కమోడిటీ ఎక్చేంజీల్లో ప్రభుత్వ అనుమతి మార్గంలో ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐలకు 49 శాతం వరకు పెట్టుబడులకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. మొత్తం 49 శాతం పరిమితిలో రిజిస్టర్డ్ ఎఫ్ఐఐలు 23 శాతం వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఎఫ్‌డీఐ విధానంలో పరిమితి 26 శాతం నిర్ణయించారు.
డీఐపీపీ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే సర్క్యులర్‌ను ఇక నుంచి సంవత్సరానికి ఒకసారి ఇస్తామని ప్రకటించింది. కొత్త పాలసీ ప్రకారం విదేశీ కంపెనీలు ఏదైనా రంగంలో కానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ముందుగా రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఆర్బీఐ అనుమతి అనంతరం ఎఫ్ఐఐలు 24 శాతానికి మించి వాటాను కలిగివుండవచ్చు. దీనికి ఆయా కంపెనీ బోర్డులు, వాటాదార్ల అనుమతి కూడా తీసుకోవాల్సివుంది. విదేశాల నుంచి సెకెండ్ హ్యాండ్ యంత్రాల దిగుమతిని ప్రోత్సహించరాదని ప్రభుత్వం నిర్ణయించింది.