కరోనా కష్టకాలం తర్వాత దేశంలో అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజల్ ధరలు సెంచరీ కొట్టాయి. ఈ ధరల ప్రభావం అన్నింటిపై పడింది. దీంతో ప్రతి ఒక్క వస్తువు ధర విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా ఏసీ ధరలు మరోమారు పెరగనున్నాయి. ఇప్పటికే వీటి ధరలు ఒకసారి పెరిగాయి. ధరలను పెంచుకోవడానికి ఈ ఏసీ తయారీ సంస్థలు వాటి తయారీలో ఉపయోగించే మెటల్, కంప్రెసర్ రేట్ల పెరుగుదలను సాకుగా చూపుతున్నాయి.
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గించేందుకు ఐటీతోపాటు పలు కార్పొరేట్ సంస్థలు దాదాపు తమ సిబ్బంది మొత్తానికి వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చాయి. వేసవిలో వేడి తగ్గించుకోవడానికి ఏసీలు కొనాలని తలపోస్తున్న ఐటీ నిపుణులకు.. ఇతర వర్గాల ఉద్యోగులకు ముడి సరుకుల ఖర్చు పెరుగుదల సాకుతో ఏసీ తయారీ సంస్థలు వాటి ధరలు పెంచి షాక్ ఇవ్వనున్నాయి.
ఏసీల ధరలు 3 నుంచి 5 శాతం పెంచనున్నట్లు డైకిన్ తెలిపింది. టాటా సన్స్ గ్రూప్ అనుబంధ వోల్టాస్ సంస్థ ఇప్పటికే ఏసీల ధరలు పెంచేసింది. ముడి సరకుల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వోల్టాస్ పేర్కొంది. ఇప్పటికే వివిధ శ్రేణి ఏసీలపై 5-8 శాతం ధరలను పెంచేసిన మరో సంస్థ బ్లూస్టార్.. మరో సారి వచ్చే నెలలో 3 శాతం మేర ధరలు పెంచేందుకు సన్నద్ధం అవుతోంది. 2019తో పోలిస్తే ఈ ఏడాది ఏసీల విక్రయాలు 30 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు బ్లూస్టార్ ఎండీ త్యాగరాజన్ తెలిపారు.