దేశ వ్యాప్తంగా ప్రారంభమైన సమ్మె... స్తంభించిన బ్యాంకు సేవలు

సోమవారం, 15 మార్చి 2021 (07:13 IST)
జాతీయ బ్యాంకుల ప్రేవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సోమ, మగంళవారాల్లో దేశ వ్యాప్త సమ్మె జరుగనుంది. రెండు రోజుల పాటు సాగే ఈ సమ్మెలో అన్ని ప్రధాన బ్యాంకు సంఘాలకు చెందిన ఉద్యోగులు పాల్గొంటున్నారు. దీంతో రెండు రోజుల పాటు బ్యాంకు సేవలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. 
 
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మె కారణంగా రెండ్రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ సమ్మెలో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు పాల్గొంటారని అంచనా.
 
అయితే, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ వంటి ప్రైవేటు బ్యాంకులు మాత్రం యధాతథంగా పనిచేస్తాయి. సమ్మె ప్రభావం ప్రైవేటు బ్యాంకులపై లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 9 ఉద్యోగ సంఘాల వేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇప్పటికే కేంద్రం ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించగా, మరో రెండు బ్యాంకులను కూడా ఇదే బాటలో ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు