వైద్యులకు ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్.. కనీస చార్జీ లేకుండానే ఫ్లైట్ జర్నీ!!

సోమవారం, 1 జూన్ 2020 (21:59 IST)
కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడంలోనూ, ఈ వైరస్ సోకిన వారికి తమ ప్రాణాలు ఫణంగా పెట్టి వైద్యం చేస్తున్న వైద్యులకు ప్రైవేట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కనీస చార్జీ చెల్లించకుండానే దేశంలో ఎక్కడైనా విమానంలో ప్రయాణించవచ్చని పేర్కొంది. 
 
ఈ విమానయాన సంస్థ తాజాగా వెల్లడించిన వివరాల మేరకు... ఈ ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్‌పై పోరాడుతున్న వైద్యుల కోసం 50 వేల సీట్లు కేటాయిస్తున్నట్టు ఎయిర్ ఏషియా ఇండియా విభాగం వెల్లడించింది. 
 
ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుని ప్రయాణించే వైద్యులు విమాన కనీస చార్జీ చెల్లించకుండానే ప్రయాణం చేయొచ్చు. అంటే, కనీస చార్జీ లేకుండా, కేవలం ఎయిర్‌పోర్టు ఫీజు, ఇతర పన్నులు చెల్లిస్తే చాలు. సదరు ప్రయాణికుడు దేశంలో ఎక్కడికైనా నామమాత్రపు చార్జీతో ప్రయాణించవచ్చు. 
 
జూలై ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30 మధ్య ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వైద్యులు తమ వివరాలను జూన్ 12 లోపు నమోదు చేసుకోవాలి. సంప్రదింపుల వివరాలు, గమ్యస్థానం, ప్రయాణ తేదీ, ఐడీ వంటి వివరాలు అందిస్తే ఎయిర్ ఏషియా వర్గాలు వాటిని పరిశీలించి టికెట్ మంజూరు చేస్తామని ఎయిర్ ఏషియా వాణిజ్య విభాగం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు