రాష్ట్ర ఆతిథ్యరంగ పెట్టుబడుల అవకాశాలపై అవగాహన కల్పించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ విజయవాడ వేదికగా రాష్ట్ర స్ధాయి సదస్సు నిర్వహించనుంది. ఇప్పటికే అతిథ్య రంగంలో ఉన్న అనుభవజ్ఞులతో పాటు, ఈ రంగంపట్ల ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు సైతం ఉపకరించేలా ఈ సదస్సు కార్యాచరణను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హిమాన్హు శుక్లా తెలిపారు.
నగరంలోని హరితబెరం పార్కు వేదికగా జనవరి 10 గురువారం ఉదయం 11 గంటలకు సదస్సు జరగనుండగా, రెండు సెషన్స్‌గా కార్యక్రమాన్ని విభజించామన్నారు. తొలి సెషన్‌లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా ఆతిథ్య రంగంలో పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ అందిస్తున్న సేవల గురించి వివరిస్తామని శుక్లా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆతిథ్య రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై పూర్తి అవగాహన కలిగించేలా కార్యక్రమం ఉంటుందని, హోటల్ పరిశ్రమకు చెందిన వారందరికీ స్వాగతం పలుకు తున్నామని స్పష్టం చేసారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ తొలిసారి ఈ తరహా కార్యక్రమాన్ని ఎంచుకుందని పర్యాటక శాఖకు చెందిన వివిధ స్ధాయిల అధికారులు సదస్సులో అందుబాటులో ఉండి వ్యక్తిగతంగా కూడా పెట్టుబడిదారుల సందేహాలను నివృత్తి చేస్తారన్నారు. పర్యాటక శాఖ పరంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆతిథ్య రంగం అభివృద్ధికి అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి పరిశ్రమ వర్గాలకు స్పష్టత ఇవ్వనున్నామన్నారు. రెండో సెషన్‌లో సదస్సుకు జ్ఞాన భాగస్వామిగా వ్యవహరిస్తున్న వి రిసార్ట్స్ ఆతిథ్య రంగంలో అందుబాటులో ఉన్న ఉత్తమ పద్దతులపై ఈ రంగ నిపుణులు, ఔత్సాహికులకు మార్గనిర్దేశం చేయనుంది.
పర్యాటకుల పాదముద్రల పరంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే జాతీయ స్థాయిలో మూడో స్ధానాన్ని అందిపుచ్చుకోగా, కీలక సమయాలలో అతిథి గృహాల కొరత నెలకొంటుందని దీనిని అధికమించే క్రమంలో ఈ సదస్సు కీలక భూమికను పోషిస్తుందని శుక్లా పేర్కొన్నారు. పర్యాటక రంగం అభివృద్దిలో మౌళిక సదుపాయాల కల్పన ముఖ్య భూమికను పోషిస్తుండగా, ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ పనిచేస్తుందని, సదస్సుకు హాజరు కావాలనుకున్న వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉండగా, 9198736617 నెంబర్‌లో సంప్రదించవచ్చని, bit.ly/biddersmeet లింక్ ద్వారా నేరుగా నమోదు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ స్పష్టం చేసింది.